'సై'బ'రా'బాద్‌

7 Dec, 2019 07:34 IST|Sakshi
చటాన్‌పల్లిలోని ఎన్‌కౌంటర్‌ ఘటనా స్థలి...

సీపీ సజ్జనార్‌ సహా పోలీసులపై ప్రశంసల జల్లు

సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్‌ పోలీసుల ఎదురుకాల్పుల్లో ‘దిశ’ నిందితులుహతమయ్యారనే వార్త బయటకు రాగానే..రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఒక్కసారిగా ఉద్వేగం ఉబికివచ్చింది. అత్యధికులు పోలీసు చర్యని కొనియాడుతూ... నీరాజనాలు పట్టారు. సోషల్‌మీడియాలోనూ భారీగా ఇదే ట్రోల్‌ అయింది. కొందరు పోలీసులపై పూలవర్షం కురిపిస్తే..మరికొందరు సైబరాబాద్‌ సీపీ  సజ్జనార్‌ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. ఎన్‌కౌంటర్‌ వార్త విన్న తర్వాత ప్రజల్లో కలిగిన ఉద్విగ్నానికి, ఉద్వేగానికి ఇవే ప్రత్యక్ష నిదర్శనాలు. ప్రజలు ఈ స్థాయిలో స్పందించి పోలీసుల చర్యను సమర్థించడానికి గత ఉదంతాల వల్ల తలెత్తిన అసంతృప్తేకారణమని నిపుణులు చెప్తున్నారు. ప్రేమ పేరుతో యువతులను వేధించి, బలితీసుకున్న ఉన్మాదుల ఉదంతాలు,హత్యాచారాలకు సంబంధించిన ఘాతుకాలు గతంలోనూ అనేకం చోటు చేసుకున్నాయి. అయితే ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం సహా వేటిలోనూ బాధితులకు పూర్తి న్యాయం జరగలేదనే భావన ప్రజల్లో నాటుకుపోయింది. విజయవాడకు చెందిన ఎంసీఏ విద్యార్థిని శ్రీలక్ష్మిని కళాశాల క్లాస్‌రూమ్‌లోనే మనోహర్‌ అనే ఉన్మాది దారుణంగా నరికి చంపాడు. మనోహర్‌ను అరెస్టు చేసిన పోలీసులు అతనిపై సుదీర్ఘ దర్యాప్తు జరిపి ఆధారాలు సేకరించారు. విచారణ అనంతరం కింది కోర్టు నిందితుడికి ఉరి శిక్ష విధించింది. దీనిపై మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు హర్షం వ్యక్తం చేశాయి.

ఈ తీర్పును నిందితుడి తరఫు న్యాయవాదులు హైకోర్టులో సవాల్‌ చేశారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. శ్రీలక్ష్మి ఉదంతాన్ని ఆద్యంతం గమనించిన అనేక మందికి ఈ శిక్ష మనోహర్‌కు చాలదని భావించి నిర్లిప్తత వ్యక్తం చేశారు. గుంటూరులో చోటు చేసుకున్న ప్రసన్న లక్ష్మి ఉదంతం సైతం ఈ కోవకు చెందినదే. నిందితుడు సుభానీకి కింది కోర్టు వేసిన ఉరి శిక్షను హైకోర్టు యావజ్జీవంగా మార్చింది. కొన్నేళ్ల క్రితం విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం ఉమెన్స్‌ హాస్టల్‌లో చోటు చేసుకున్న ఆయేషా మీరా ఉదంతంలోనూ బాధితులకు పూర్తి న్యాయం జరగలేదనే భావన ప్రజల్లో ఉంది. కొన్ని నెలల పాటు ఈ కేసు అపరిష్కృతంగా మిగిలిపోయింది. చివరకు పోలీసులు నిందితుడని ఆరోపిస్తూ సత్యంబాబును అరెస్టు చేసినా..ఈ కేసు ఉన్నత న్యాయస్థానంలో వీగిపోయింది. ‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే నిర్భయ తల్లి సైతం తమకు పూర్తి న్యాయం జరగలేదని స్పందిస్తూ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఇలాంటి అసంతృప్తుల మధ్య ఉన్న ప్రజలు దిశ ఉదంతం చోటు చేసుకోవడంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు.

ఇది జరిగిన 24 గంటల్లోనే నిందితులను అరెస్టు చేసిన సైబరాబాద్‌ పోలీసులు మీడియా ముందు హాజరుపరిచారు. విలేకరుల సమావేశంలో పోలీసులు వెల్లడించిన వాస్తవాలు ప్రజలకు మరింత ఆగ్రహాన్ని కలిగించాయి. ప్రతి ఒక్కరిలోనూ పైకి చెప్పుకోలేని ఓ విధమైన భీతి గూడుకట్టుకుపోయింది. ఈ మానసిక సంఘర్షణలో ఉన్న వారికి ఎన్‌కౌంటర్‌ వార్త ఎంతో ఉద్వేగానికి గురిచేసింది. నిందితులకు తగిన శిక్ష పడిందనే భావం వ్యక్తమైంది. ఫలితంగానే రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికుల స్పందన పోలీసు చర్యలను సమర్థిస్తూనే వచ్చింది. 

మరిన్ని వార్తలు