లంచాలివ్వలేం.. తాళిబొట్లు తీసుకోండి

21 Feb, 2020 03:50 IST|Sakshi

ఆక్రమణకు గురైన స్థలాలకోసం బాధితుల వినూత్న నిరసన

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన

తాళిబొట్లు, చెవికమ్మలు తీసిచ్చిన మహిళలు

వాచీలు, ఉంగరాలు, సెల్‌ఫోన్లు ఇచ్చిన పురుషులు

స్పందించిన తహసీల్దార్‌.. ఆక్రమణకు గురైన భూమి సర్వే

మోత్కూరు: ‘మీకు లంచాలిచ్చేందుకు మా దగ్గర పైసల్లేవు. బండలు కొట్టి బతుకుతున్నం. మా తాళిబొట్లు, చెవికమ్మలు అన్నీ తీసుకొని మా భూమి మాకు ఇప్పించండి’ అంటూ పలువురు బాధితులు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు తహసీల్దార్‌ కార్యాలయం ముందు గురువారం ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం వారికి కేటాయించిన ఇళ్లస్థలాలను అక్రమార్కుల చెర నుంచి విడిపించి అప్పగించాలంటూ రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఇలా వినూత్న రీతిలో నిరసనకు దిగారు.

విసిగిపోయి చివరికిలా...: 1985లో ఎన్టీఆర్‌ ప్రభుత్వం మోత్కూరు వడ్డెర కాలనీలోనిసర్వే నెంబర్‌ 610లో 3.39 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల కోసం కేటాయించి కొన్ని ఇళ్లు నిర్మించింది. ప్రస్తుతం ఆ కాలనీ 2.39 ఎకరాలకు విస్తరించింది. మిగిలిన ఎకరం స్థలాన్ని కొందరు కబ్జా చేశారు. ఈ నేపథ్యంలో ఆక్రమణదారులపై చర్యలు తీసుకుని తమ స్థలాన్ని తమకు అప్పగించాలని కోరుతూ పలుమార్లు బాధితులు రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టి తమ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఎంతగా పోరాడినా ఫలితం లేకపోవడంతో విసిగిపోయారు. దీంతో గురువారం వారంతా తహశీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నారు. తహశీల్దార్‌ షేక్‌ అహ్మద్‌ను, ఇతర సిబ్బందిని లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్వేగానికి గురైన మహిళలు.. లంచాలు ఇవ్వడానికి తమ దగ్గర డబ్బుల్లేవంటూ మెడలో ఉన్న తాళిబొట్లు, చెవికమ్మలు తీసి ఇవ్వగా, పురుషులు తమ ఉంగరాలు, వాచీలు, సెల్‌ఫోన్లు తీసి ఓ టవల్‌లో వేశారు. అవన్నీ తీసుకుని తమ భూమి తమకు ఇప్పించాలని తహశీల్దార్‌ను వేడుకున్నారు. సమస్య పరిష్కరిస్తానని, ఆందోళన విరమించాలని తహసీల్దార్‌ హామీ ఇచ్చినప్పటికీ.. వెంటనే పరిష్కరిస్తేనే ఆందోళన విరమిస్తామంటూ వారు భీష్మించుకుని కూర్చున్నారు.

10 గుంటల్లో అక్రమ నిర్మాణాలు...
కాలనీవాసుల ఆందోళనతో ఎట్టకేలకు స్పందించిన తహసీల్దార్‌ షేక్‌ అహ్మద్‌.. సర్వేయర్‌ శ్రీనివాస్‌రాజు, ఆర్‌ఐ నజీర్, వీఆర్వోలతో కలిసి ఆ కాలనీకి వెళ్లారు. ఆక్రమించిన స్థలాన్ని పరిశీలించి సర్వే చేయించారు. మొత్తం 3.39 ఎకరాల భూమిలో 2.39 ఎకరాల్లో కాలనీవాసులు ఇళ్లు నిర్మించుకున్నారని, ఆక్రమణకు గురైన ఎకరం భూమిలో పది గుంటలు రోడ్డులో పోగా 30 గుంటల భూమి మిగిలి ఉందని నిర్ధారించారు. అందులో 10 గుంటల స్థలంలో ఆక్రమణదారులు నిర్మాణాలు చేపట్టారని తహశీల్దార్‌ తెలిపారు. ఆక్రమణదారులకు ఇదివరకే ఒకసారి నోటీసులు ఇచ్చామని, ఇప్పుడు మరోసారి నోటీసులు ఇచ్చి నిర్మాణాలు తొలగించి కాలనీవాసులు అప్పగిస్తామని చెప్పారు. దీంతో కాలనీవాసులు ఆందోళన విరమించారు.

మరిన్ని వార్తలు