ఊపిరాడని బతుకుకు..ఊపిరిపోశారు!

6 Dec, 2019 03:57 IST|Sakshi
గంగాధర్‌ను బయటకు తీసుకొస్తున్న కార్మికులు

డ్రైనేజీలో ఇరుక్కుపోయిన కార్మికుడు

శ్వాస ఆడక గంటపాటు నరకయాతన

చంద్రశేఖర్‌ కాలనీ: వరద నీరు వెళ్లేందుకు నిర్మించిన డ్రైనేజీలో చెత్తను తొలగించేందుకు దిగిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు అందులో చిక్కుకు పోయాడు. సరిగా శ్వాస ఆడక గంటపాటు విలవిల్లాడాడు. స్థానికులు సకాలంలో స్పందించడంతో అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన గురువారం నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. మున్సి పల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని వర్ని రోడ్డులో దశాబ్దాల క్రితం స్ట్రామ్‌ వాటర్‌ డ్రైనేజీ నిర్మించారు.

కోటగల్లి పరిసర ప్రాంతాలకు చెందిన మురుగునీరు ఈ డ్రైనేజీ ద్వారానే పూలాంగ్‌ వాగులోకి వెళుతోంది. అయితే, డ్రైనేజీలో చెత్త పేరుకు పోవడంతో మురుగు నీరు నిలిచి పోయింది. ఆ చెత్తను తొలగించేందుకు కార్పొరేషన్‌ సిబ్బంది గురువారం ప్రయత్నించారు. రోడ్డు కింద నిర్మించిన డ్రైనేజీ లోపలికి వెళ్లిన తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికుడు గంగాధర్‌ (35) కర్ర సాయంతో చెత్తను తొలగిస్తుండగా, మురుగు నీరు ఒక్కసారిగా ముంచెత్తింది. ఈ క్రమంలో గంగాధర్‌ కుడి చేయి కేబుల్‌ పైపులైన్లలో చిక్కుకోవడంతో అతడు డ్రైనేజీలో ఉండిపోయాడు.

గంగాధర్‌కు పైపు ద్వారా గాలి అందిస్తున్న కార్మికులు

శ్వాస సరిగా ఆడక విలవిల్లాడాడు. ఇది గమనించిన మరో కార్మికుడు ఉన్నతాధికారులకు సమాచారమిచ్చాడు. మరోవైపు గంగాధర్‌కు శ్వాస ఆడేందుకు ఇంట్లో వినియోగించే నీటి పైప్‌ను స్థానికులు అందించారు. అనంతరం జేసీబీతో రోడ్డును తవ్వి డ్రైనేజీ నీటిని వేరే వైపు మళ్లించారు. గంట పాటు డ్రైనేజీలో ఇరుక్కుని తల్లడిల్లిన గంగాధర్‌ను తోటి కార్మికులు బయటకు తీసి, జిల్లా ఆస్పత్రికి తరలించారు. గంగాధర్‌ను పరీక్షించిన వైద్యులు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారని మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ సాజిద్‌ అలీ తెలిపారు.

మరిన్ని వార్తలు