కరోనా భయం.. కారే నయం!

28 May, 2020 04:17 IST|Sakshi

ప్రజా రవాణా వ్యవస్థపై భయంతో కార్ల కొనుగోళ్లపై జనం మోజు

ఇప్పటికే ఉన్నవారు ఇంటి అవసరాల కోసం రెండోది కొనే యోచన

బ్రోచర్, డెమో, కొటేషన్, ఫైనాన్స్‌ ప్రాసెస్‌.. అంతా ఆన్‌లైన్‌లోనే

ఉత్సాహంగా కారు కంపెనీలు.. త్వరలో ఊపు వస్తుందన్న అంచనా  

సాక్షి, హైదరాబాద్‌: కరోనా పుణ్యమాని జీవనశైలిని దాని కి అనుగుణంగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ క్రమంలో విలాస వస్తువు ల జాబితాలో ఉన్న కారు ఇ ప్పుడు ‘అవసరం’గా మారే పరిస్థితి ఉత్పన్నమవుతోంది. ఎగువ మధ్య తరగతి ఇళ్ల ముందు తళుక్కున మెరుస్తు న్న కార్లు, ఇప్పుడు సగటు మ ధ్య తరగతి ఇళ్ల ముందూ కనిపించబోతున్నాయి. ప్రజా రవాణా, ఇతరత్రా ప్రైవేట్‌ వా హనాల్లో ప్రయాణం భద్రం కాదని భావిస్తున్న జనం.. కార్ల కొనుగోలుపై మోజు చూపుతున్నారు. తమ ప్రయాణ అవసరాలతో పాటు పిల్లలను ఆటోలు, బస్సుల్లో బడికి పంపడం సురక్షితం కాదని యోచిస్తున్న పలువు రు కారు కొనాలని ఫిక్స్‌ అయిపోతున్నారు. పది రోజుల క్రితం తెరుచుకున్న కార్ల షోరూంలకు వస్తున్న వారిని చూస్తే ఇది ఇట్టే అర్థమవుతుంది. ఇప్పుడు కార్ల కోసం ఎంక్వైరీ చేస్తున్న వారి జాబి తాలో 90% చిన్నకార్లే ఉంటున్నాయి. వీరంతా ఇంతకాలం కారును తమ పరిధిలోని వస్తువు కాదని భావించినవారే కావటం విశేషం. ఇక, ఇప్పటికే కారు ఉన్న వారు ఇంటి, ఇతర అవసరాలకు మరొకటి కొనే యోచనలో ఉన్నారు.

అంతా ఆన్‌లైన్‌లోనే..
కరోనా భయంతో షో రూంలకు వెళ్లే వారి సంఖ్య బాగా తగ్గింది. దీంతో ఆయా షోరూంలు పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచుతున్నాయి. ఈ–కొటేషన్, ఈ–బ్రోచర్, డిజిటల్‌ డెమో, ఈ–ఫైనాన్స్‌ ప్రాసెస్‌.. ఇలా అన్నీ వెబ్‌సైట్‌ ద్వారా చూసుకునే వీలు కల్పించాయి. కొనుగోలుదారులు ముందుగా ఆన్‌లైన్‌లోనే వాటిని పరిశీలించి.. కారు ఎంపిక చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక డిజిటల్‌ టెస్ట్‌ డ్రైవ్‌ ఆప్షన్‌ కూడా ఉంది. ఆ కారు నడిపితే ఎలా ఉంటుందో ఆన్‌లైన్‌ స్క్రీన్‌ ముందు కూర్చుని ఆస్వాదించొచ్చు. ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు ఇలాంటి వాటిని కొత్త ఫీచర్లతో అం దించేందుకు వీలుగా కార్ల కంపెనీలు ప్రచార బడ్జెట్‌ను రెట్టింపు చేశాయి. ఇక ఎవరైనా కారు కొనేందుకు ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేయగానే, ఆ సమాచారం కార్ల కంపెనీ సిబ్బందికి చేరిపోతోంది.

దీంతో కొనుగోలుదారులు సెర్చ్‌ చేస్తున్న చోట తమ కార్లకు సంబంధించి ఫీచర్లతో కూడిన పాపప్‌ కనిపించేలా చేస్తున్నారు. దాన్ని క్లిక్‌ చేయగానే సమగ్ర సమాచారం స్క్రీన్‌పై వస్తోంది.  ఏవైనా సందేహాలుంటే అప్పటికప్పుడు నివృత్తిచేసే ఏర్పాటూ ఉంది. ఈ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటున్నాయి. ఇక కొందరు కొ నుగోలుదారులు నేరుగా షోరూంలకు వెళ్తున్నా రు. అయితే, అక్కడి నమూనా కార్లలో కూర్చుని పరిశీలించడానికి జంకుతున్నారు. అదే కారును అంతకుముందు ఎవరైనా పరిశీలించి ఉంటారనే దే ఇందుకు కారణం. దీంతో షోరూం నిర్వాహకులు కార్ల స్టీరింగులు, సీట్లు, డోర్‌ హ్యాండిల్స్, ఇతర ముఖ్యమైన చోట్ల తిరిగి తొలగించగలిగే పారదర్శక తొడుగులు ఏర్పాటు చేస్తున్నారు. ఒక కొనుగోలుదారు దాన్ని పరిశీలించగానే వాటిని తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు.

టాప్‌గేర్‌లో బుకింగ్‌లు
► మారుతి సుజుకీ కార్లు తెలంగాణలో గత వారం రోజుల్లో దాదాపు 400 బుక్‌ అయ్యాయి. వీటిలో ఈనెలాఖరు వరకు 250 కార్లు డెలివరీ అవుతాయని కంపెనీ చెబుతోంది. నిత్యం సగటున 50 కార్లు బుక్‌ అవుతున్నట్టు చెబుతోంది.
► హ్యుందాయ్‌ కార్లు లాక్‌డౌన్‌ తర్వాత 250 వరకు బుక్‌ అయ్యాయట. రోజూ రాష్ట్రవ్యాప్తంగా 150 వరకు ఎంక్వైరీలు వస్తున్నాయనేది  నిర్వాహకుల మాట.
► నేరుగా షోరూమ్‌లకు వచ్చి కార్లను పరిశీలించే వారి సంఖ్య 60 శాతానికి పడిపోయింది.     ఆన్‌లైన్‌లో ఎంక్వైరీల సంఖ్య రెట్టింపైంది.
► కారును పరిశీలించిన వారిలో కొంతమందే ఫైనల్‌గా కొంటారు. అదిప్పుడు 40 శాతం అదనంగా పెరిగింది.

కొత్త మార్పుకు శ్రీకారం
కార్లు కొనాలనుకునే వారి సం ఖ్య పెరగబోతోంది. షోరూం లకు వచ్చేవారి తో డిస్కషన్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. టెస్ట్‌ కార్లలో ముఖ్యమైన చోట్ల ప్రత్యేక కవర్లు ఏర్పాటుచేస్తున్నాం. కరోనా నిబంధనలన్నీ పాటిస్తున్నాం. షో రూంలను శానిటైజ్‌ చేస్తున్నాం. – డీకే రాజా, డైరెక్టర్, వరుణ్‌ మోటార్స్‌

ఫైనాన్స్‌తోనే తంటా
ప్రజా రవాణాలో ప్రయాణానికి భయపడే చాలామంది సొంత కారుకు ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఫైనాన్స్‌ సంస్థలు తటపటాయిస్తుండటం సమస్యగా మారింది. త్వరలో అదీ పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాం. ఫైనాన్స్‌కు క్లియరెన్స్‌ రాగానే ఎక్కువమంది కార్లు బుక్‌ చేసుకుంటారు. – అశోక్, సీఈఓ, కున్‌ హ్యుందాయ్‌

మరిన్ని వార్తలు