ఎన్నికల్లో వారసులొస్తున్నారు..!

18 Jan, 2020 12:06 IST|Sakshi
మంథనిలో ప్రచారం నిర్వహిస్తున్న జెడ్పీ చైర్మన్‌ భార్య శైలజ

పెద్దపల్లిలో ఎమ్మెల్యే కోడలు ఏకగ్రీవం

మంథనిలో జెడ్పీ చైర్మన్‌ సతీమణి

రామగుండంలో మాజీ ఎమ్మెల్యేల కుటుంబీకులు

సాక్షి, పెద్దపల్లి : మున్సిపల్‌ ఎన్నికల బరిలో నేతల బంధుగణం తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోందిజ చైర్‌పర్సన్‌ పీఠాలు లక్ష్యంగా కౌన్సిలర్, కార్పొరేటర్‌ స్థానాలకు నేతల వారసులొచ్చారు. ఇప్పటికే పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కోడలు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, మరో నలుగురు వారసులు పోటీపడుతున్నారు. ఇందులో ఎంతమంది కౌన్సిల్‌లోకి వెళుతారో అనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. 

చైర్‌పర్సన్‌ పీఠం లక్ష్యం
మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పీఠాలు లక్ష్యంగా నేతల కుటుంబీకులు అడుగులు వేస్తున్నారు. జిల్లా కేంద్రం పెద్దపల్లి మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ జనరల్‌ మహిళకు రిజర్వ్‌ కాగా, స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కోడలు మమతారెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. తన కోడలు ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న మనోహర్‌రెడ్డి, పావులు కదపడంతో 21వ వార్డు నుంచి మమతారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 36 వార్డులకుగాను రెండింటిని టీఆర్‌ఎస్‌ ఇప్పటికే ఏకగ్రీవంగా కైవసం చేసుకొంది.

ఎన్నికలు జరుగుతున్న 34 వార్డుల్లో అత్యధిక స్థానాలు గెలుచుకొంటే, మమతారెడ్డి చైర్‌పర్సన్‌ కావడం లాంఛనమే. ఇక మంథనిలో తొలి చైర్‌పర్సన్‌ పీఠాన్ని అధిష్టించేందుకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పోటీపడుతున్నాయి. ఇక్కడ చైర్‌పర్సన్‌ పీఠం లక్ష్యంగా జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధు తన భార్య శైలజను టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలోకి దింపారు. గతంలో మంథని మేజర్‌ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా ఉన్న శైలజ, చైర్‌పర్సన్‌ రిజర్వేషన్‌ జనరల్‌ మహిళ కావడంతో రేసులో ముందున్నారు. 

రామగుండంలోమాజీ ఎమ్మెల్యేల వారసులు..
జిల్లాలోని ఏకైక నగరపాలకసంస్థ రామగుండంలో మాజీ ఎమ్మెల్యేల కుటుంబీకులు బల్దియా బరిలో నిలిచారు. మున్సిపల్‌ చైర్మన్‌గా రామగుండంపై తనదైన ముద్ర వేసిన మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కోడలు లావణ్య కార్పోరేషన్‌ ఎన్నికల్లో తలపడుతున్నారు. గత కౌన్సిల్‌లోనూ లావణ్య కార్పొరేటర్‌గా ఉన్నారు. ప్రస్తుతం 39వ డివిజన్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఉన్నత విద్యావంతురాలైన లావణ్య తన మామ వారసురాలుగా కార్పొరేషన్‌లో పోటీపడుతున్నారు.

ఇక ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే మాలెం మల్లేశం తనయులు ఇరువురు పురపోరులో పోటీకి దిగడం విశేషం. మల్లేశం కుమారులు కిరణ్‌ 44వ డివిజన్‌ నుంచి, మధు 33వ డివిజన్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగారు. మరో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కాసిపేట లింగయ్య కూడా తన భార్య తారను రామగుండం కార్పొరేషన్‌ 11వ డివిజన్‌ నుంచి పోటీలో నిలిపారు. ఆమె గెలుపుకోసం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల కుటుంబీకులు మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీపడుతుండడగా, ఇందులో ఎంతమంది ఫలితం పొందుతారో అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు