ఆన్‌లైన్‌ పాఠాలు.. పేరెంట్స్‌కి పరీక్షలు!

19 Jul, 2020 04:15 IST|Sakshi

తల్లిదండ్రులు పక్కన లేకపోతే.. క్లాసులు వినని పిల్లలు

ఇంగ్లిష్‌ మీడియం పాఠాలు అర్థంకాని కొందరు పేరెంట్స్‌

హోంవర్కులు, పీడీఎఫ్‌లు, టెస్టులతో కొత్త టెన్షన్‌

అసలే తీరికలేని అమ్మలకి.. ఇదో అదనపు భారం

తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులైతే.. చదువులిక అంతే!

సాక్షి, హైదరాబాద్‌: మమ్మీ.. డాడీ.. ‘ఫొటోసింథసిస్‌’    పాఠం అర్థం కాలేదు అనగానే.. ఏం చెప్పాలో అర్థంకాక తల్లిదండ్రులిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. మేడం, నిన్న మీ అమ్మాయి మ్యాథ్స్‌ హోంవర్క్‌ పీడీఎఫ్‌ చేసి పంపలేదు.. ఎందు కు? అన్న వాట్సాప్‌ మేసేజ్‌కు ఏం రిప్లై ఇవ్వాలో తెలియక బిక్కముఖం వేశారు మరో పేరెంట్స్‌.

ఇవి ప్రస్తుతం ఆన్‌లైన్‌ క్లాసుల్లో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న వింత పరిస్థితులు. ఇంతకాలం ఉదయం పిల్లల్ని రెడీ చేసి, టిఫిన్‌ సర్ది పంపడం సాయంత్రానికి ట్యూషన్‌ లేదా ఆటలకు పంపేవారు. కరోనా దెబ్బకు తల్లిదండ్రుల పాత్రలు మారిపోయాయి. పిల్లలకు ఆన్‌లైన్‌ క్లాసులతోపాటే.. తల్లిదండ్రులకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. హైస్కూలు పిల్లలు పర్వాలేదుగానీ, మరీ ప్రైమరీ స్కూలు పిల్లలను ఆన్‌లైన్‌ క్లాసులకు సిద్ధంచేయడం, వారిని క్లాసులు వినేలా కూర్చోబెట్టడం పెద్ద పరీక్షలా మారింది. చాలామంది కుదురుగా కూర్చోవడం లేదు.

క్లాసులు వినకుండా చేతిలో సెల్‌ఫోన్‌ పట్టుకుని దిక్కులు చూడటం లేదా క్లాసు జరుగుతుండగానే ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతున్నారు. కొందరు పడుకుని, నిల్చుని, మరికొందరు గడుగ్గాయిలు శీర్షాసనం వేస్తూ వారికి నచ్చిన భంగిమలో వింటున్నారు. ఇంకొందరు ఆకతాయిలు పదే పదే చాట్‌బాక్స్‌లో మెసేజ్‌లు పెడుతూ టీచర్లకు విసుగు తెప్పిస్తున్నారు. వెంటనే టీచర్లు క్లాసులు ఆపేసి నేరుగా తల్లిదండ్రులకు ఫోన్‌ చేస్తున్నారు. దీంతో వీళ్ల దెబ్బకు వారి పక్కనే తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు కూర్చోవాల్సి వస్తుంది. లేకపోతే ఇచ్చే హోంవర్కులను చాలామంది తుంటరి పిల్లలు నోట్‌ చేసుకోవడం లేదు. చేయకపోతే స్కూలు టీచర్లు వేసే అక్షింతలను కూడా తల్లిదండ్రులు వేసుకోవాల్సిన పరిస్థితి. 

ఆంగ్ల మీడియం మరో సమస్య.. 
తల్లిదండ్రుల్లో చాలామంది 30 నుంచి 40 ఏళ్లలోపు వారే. వీరిలో 80 శాతం మంది తెలుగు మీడియం నేపథ్యమున్నవారే. వీరికి ఆంగ్ల పరిజ్ఞానం తక్కువ. ఇదే ఇప్పుడు వీరిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పుడు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ వంటి పాఠ్యపుస్తకాల్లోని పాఠ్యాంశాలను పిల్లలకు వివరించాల్సి వచ్చినపుడు, మరీ ముఖ్యంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి సబ్జెక్టుల విషయంలో సందేహాలు వచ్చినపుడు వాటిని నివృత్తి చేయడంలో తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సంస్థలు వర్క్‌ ఫ్రం హోం తీసేయడంతో తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు ఆఫీసుకు వెళ్తున్నారు. ఉన్నవారిలో ఎవరు ఇంగ్లిష్‌లో వీక్‌గా ఉన్నా.. ఇక పిల్లల ముందు చిన్నబుచ్చుకుంటున్నారు. ఇక తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్తులైతే.. పిల్లలకు సందేహాలు తీర్చేవారే లేరు. 

హోంవర్కులు చేయాలి.. పీడీఎఫ్‌లు పంపాలి..! 
ఆన్‌లైన్‌ క్లాసుల కారణంగా ఈసారి తల్లిదండ్రులు పుస్తకాలతోపాటే ట్యాబ్‌లు అదనంగా కొనాల్సి వచ్చింది. చిన్నారుల హోంవర్క్‌ సైతం ఆన్‌లైన్‌లోనే పంపాల్సి ఉంటుంది. పిల్లలకు టీచర్లంటే ఉన్న భయం తల్లిదండ్రులంటే అంతగా ఉండదు. దీంతో వారితో హోంవర్క్‌ చేయించేసరికి దేవుడు కనిపిస్తున్నాడు. తరువాత ఆ పేజీలను ఫోటోలు తీసి, వాటిని పీడీఎఫ్‌లోకి మార్చి ఆ తరువాత సంబంధిత క్లాస్‌ టీచర్‌కు మెయిల్‌ చేయాల్సి వస్తోంది. ఈ విషయంలో చాలామంది భార్యాభర్తల్లో ఎవరో ఒకరికి మాత్రమే పరిజ్ఞానం ఉంటుంది. లేనివారు పక్కింటివారినో ఇతరులనో బతిమాలుకోవాల్సి వస్తోంది.

ఇంతాచేసి సరిగ్గా చేశామో లేదో అన్న భయంతోనే రాత్రి నిద్రకు ఉపక్రమిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఉదయం లేచి.. వారిని క్లాసుల ముందు కూర్చోబెట్టే దగ్గరి నుంచి రాత్రి 10 గంటల వరకు వారితోనే గడపాల్సి వస్తుంది. వంటతో సహా ఇంట్లో అన్ని పనులు దాదాపు మధ్యాహ్నమే చేసుకుంటున్నారు. ఈ విషయంలో గృహిణులకు మునుపెన్నడూ లేని స్థాయిలో పనిభారం పెరిగింది. పిల్లలతో గడిపే సమయం పెరిగినందుకు సంతోషపడాలో.. వారితోపాటు వారి పుస్తకాలు చదివి, వారి పరీక్షలు కూడా రాయాల్సిన అదనపు భారం పడినందుకు బాధపడాలో తెలియని విచిత్ర పరిస్థితి తల్లిదండ్రులది.

మరిన్ని వార్తలు