ఓఆర్‌ఆర్‌లో ‘ఫాస్టాగ్‌’ తిప్పలు

9 Mar, 2020 09:27 IST|Sakshi

కనీస చార్జీకి మూడింతలు ఆయా కార్డుల నుంచి కట్‌

ఒక్కోసారి ఫాస్టాగ్‌ రీడ్‌ కాక వాహనాలు ఆగుతున్న వైనం

ఉన్నతాధికారుల చొరవతో ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ క్లియర్‌

కార్డుల నుంచి ఎక్కువ డబ్బులు కట్‌ అవుతున్న అంశంపై దృష్టి

ఆర్‌ఎఫ్‌ఐడీ లేన్‌ ఉపయోగిస్తే కొంత ఇబ్బందులు తప్పినట్టే

సాక్షి, సిటీబ్యూరో:  ఔటర్‌ రింగ్‌ రోడ్డు తుక్కగూడ నుంచి బొంగళూర్‌ గేట్‌ వరకు సాధారణంగా కారుకు టోల్‌ఫీజు రూ.20 వసూలు చేస్తారు. అయితే ఫిబ్రవరి 27న తుక్కుగూడ నుంచి బొంగళూరు వరకు ఫాస్టాగ్‌ ద్వారా వెళ్లిన ఏపీ29 బీకే 0789 కారుకు మాత్రం రూ.70లు కార్డు నుంచి కట్‌ అయ్యాయి. అయితే తిరుగు ప్రయాణంలో మాత్రం రూ.20 టోల్‌ రుసుం కట్‌ అయింది. 

...ఇది మచ్చుకు ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై వాహనాలు ఎదుర్కొంటున్న సమస్యకు ఒక ఉదాహరణ మాత్రమే. నిత్యం లక్షా 30వేలకు పైగా వాహనాలు వెళుతున్న 158 కిలోమీటర్ల ఈ మార్గంలో చాలామంది వాహనదారులకు ఈ సమస్యలు నిత్యకృత్యం అయ్యాయి. అయితే రూ.50లే కదా ఫిర్యాదు ఎందుకులే అని కొందరు తేలిగ్గా తీసుకుంటే... ప్రతిరోజూ ఆయా మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు మాత్రం ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఆయా టోల్‌గేట్‌ల వద్ద అడిగినా సిబ్బంది నుంచి సరైన సమాధానం రాకపోవడంతో మిన్నకుండిపోతున్న సందర్భాలు చాలానే ఉంటున్నాయి. కొంతమంది సిబ్బందేమో మళ్లీ డబ్బులు క్రెడిట్‌ అవుతాయని సర్దిచెబుతుండటంతో ఈ సమస్య హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ అనుబంధ విభాగమైన ‘హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌’ ఉన్నతాధికారుల దృష్టికి చేరడం లేదనే వాదన వినిపిస్తోంది. 

ఫాస్టాగ్‌తోనూ తప్పని తిప్పలు...
కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌లో భాగంగా ఫాస్టాగ్‌ వసూలు వ్యవస్థను గతేడాది ఆగస్టు నుంచి ఓఆర్‌ఆర్‌లో అమల్లోకి తీసుకొచ్చారు. అంతకుముందు ఏడాది పాటు ఎలక్ట్రానిక్‌ టోల్‌ సిస్టమ్‌ను ట్రయల్‌ రన్‌ నిర్వహించిన సమయంలో సిబ్బందికి సరైన అవగాహన లేక సాంకేతిక కారణాలతో అడపాదడపా అమలును వాయిదా వేస్తూ వచ్చారు. చివరకు గతేడాది ఆగస్టు నుంచి అమలు చేస్తున్నా సాంకేతిక సమస్యలు మాత్రం తీరడం లేదు. ఆయా ఫాస్టాగ్‌ కార్డులు కొన్ని సందర్భాల్లో స్కాన్‌ కాకపోవడం వల్ల వాహనాలు బారులు తీరుతున్నాయి. చాలాసార్లు అధికారులు క్విక్‌రెస్పాన్స్‌తో సమస్యను పరిష్కరిస్తున్నారు. ఒక్కో మార్గం నుంచి మరో మార్గం వరకు నిర్దిష్ట రుసుం రూ.20, రూ.30లు ఉంటే రూ.70లు ఆయా వాహనదారుల ఫాస్టాగ్‌ కార్డుల నుంచి కట్‌ అవడం విస్మయం కలిగిస్తోంది.  ముఖ్యంగా పేమెంట్స్‌ యాప్‌ల ద్వారా ఆయా ఫాస్టాగ్‌ కార్డులు రీచార్జ్‌ చేస్తున్న వారికి ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నట్టుగా ఓఆర్‌ఆర్‌ విభాగాధికారులకు అందుతున్న ఫిర్యాదులను బట్టి తెలుస్తోంది. ఈ సాంకేతిక సమస్యలపై ఇప్పటికే ఆయా పేమెంట్స్‌ యాప్‌ల దృష్టికి ఉన్నతాధికారులు తీసుకెళ్లినా.. ఆశించినంత స్పందన రాలేదని తెలిసింది. పరిమితికి మించి మీ ఫాస్టాగ్‌ కార్డుల ద్వారా నగదు కట్‌ అయితే ఫిర్యాదు చేయాలని, తక్షణ పరిష్కారం లభించేలా చూస్తామని అధికారులు అటున్నారు.  

వాహనదారులు తికమక పడవద్దు...
ఆర్‌ఎఫ్‌ఐడీ ఫాస్టాగ్‌ ఉపయోగించే వాహనదారుల కోసం ఆయా టోల్‌గేట్‌ల వద్ద ప్రత్యేక లేన్లను కేటాయించాం. అలా కాకుండా కొందరు ఫాస్టాగ్‌ ఉన్న వాహనదారులు మాన్యువల్‌ లేన్‌లోకి వెళ్లి అక్కడి సిబ్బందికి కార్డు చూపించి స్లిప్‌ తీసుకొని వెళుతున్నారు. దీంతో ఫాస్టాగ్‌ కార్డును అక్కడి సాంకేతిక వ్యవస్థ రీడ్‌ చేయడం లేదు. ఫలితంగా వారు ఎక్కడైతే టోల్‌గేట్‌ నుంచి దిగిపోతారో వారికి ఎంట్రీ అయిన ప్రదేశాన్ని సాంకేతిక వ్యవస్థ గుర్తించక ఎగ్జిట్‌ అయిన ప్రాంతం వద్ద రూ.70లు కట్‌ అవుతున్నట్టుగా మెసేజ్‌లు వెళుతున్నాయి. 158 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్‌కు రూ.140 టోల్‌ రుసుం కాబట్టి ఇలా సగం కట్‌ అవుతుంది. మీ ప్రయాణ దూరాన్ని బట్టి కాకుండా, అంతకుమించి ఎక్కువగా డబ్బులు కట్‌ అవుతే మాత్రం మా టోల్‌గేట్‌ వద్ద ఫిర్యాదుచేయండి. సమస్యను పరిష్కరిస్తాం.–రవీందర్‌ రెడ్డి, హెచ్‌ఎండీఏ ఇంజనీరింగ్‌ విభాగాధికారి

మరిన్ని వార్తలు