కొత్తనోటుకు..‘చిరుగు’పాట్లు..!

21 Oct, 2018 02:26 IST|Sakshi

     మార్పిడిపై ఆర్బీఐ ఉదాసీనత 

     ఇంకా మార్చే అవకాశం కల్పించని వైనం 

     ఇబ్బంది పడుతున్న ప్రజలు

సాక్షి, హైదరాబాద్‌: నోట్ల రద్దు కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొత్త నోట్లు వచ్చి రెండేళ్లు కావస్తున్నా అవస్థలు అలాగే ఉంటున్నాయి. చిరిగిన నోట్లను మార్చే వ్యవస్థను రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఇంకా ఏర్పాటు చేయలేదు. దీంతో చిరిగిన కొత్త నోట్లు ఉన్నవారి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. అనుకోకుండా, ఏదో కారణాలతో చిరిగిన నోట్లను కలిగిన వారు వాటిని మార్చుకుందామని హైదరాబాద్‌లోని ఆర్బీఐ కార్యాలయానికి వెళ్లిన వారికి నిరాశే మిగులుతోంది.

కొత్త నోట్లు చిరిగితే వాటిని మార్చే వ్యవస్థ ఇంకా అమల్లోకి రాలేదని, త్వరలోనే ఏర్పాటు చేస్తామని ఆ కార్యాలయం వర్గాలు చెబుతున్నాయి. దీంతో అక్కడికి వచ్చినవారు నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఆర్బీఐ వర్గాలు మాత్రం దీనిపై స్పష్టత ఇవ్వడంలేదు. కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ. వెయ్యి నోట్ల రద్దును 2016 నవంబర్‌ 8న ప్రకటించింది. కొన్ని నెలల తర్వాత రూ.2 వేల నోటును, ఆ తర్వాత రూ.500, రూ.200, రూ.50, రూ.20 కొత్త నోట్లను ప్రవేశపెట్టింది. సాధారణంగా నోట్లు చిరిగితే వాటిని బ్యాంకులలో ఇచ్చి కొత్తవి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే కొత్త నోట్లు వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇవి చిరిగితే మార్చే వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. కేంద్రం, ఆర్బీఐ దీనిపై నిర్ణయం తీసుకుందని అధికారులు చెబుతున్నా, ఆ ప్రక్రియను మాత్రం ఎంతకీ ప్రారంభించడంలేదు.  

పాతనోట్లకు రూల్స్‌ ఉన్నా.. కొత్తవాటికే.. 
చిరిగిన నోట్లు చెల్లక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి ఉపశమనం కలిగిస్తూ ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. వాటికి తిరిగి చెల్లింపు విషయమై 2009లోనే కొన్ని నిబంధనలు జారీ అయ్యాయి. తాజాగా వాటిలో కొన్ని మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో రూ.1 నుంచి రూ.2 వేల వరకు నోటులో ఎంత చిరిగినప్పటికీ ఎంతో కొంత విలువ తిరిగి పొందడానికి వీలు కల్పించింది. రూ.1 నుంచి రూ.20 వరకు సగం నోటు ఉన్నా పూర్తి విలువ ఇవ్వనున్నట్లు తెలిపింది.

అంతకంటే ఎక్కువ విలువ ఉన్న నోట్లకు ఎక్కువ భాగం ఉంటే పూర్తి విలువ, అర్ధభాగంలోపు ఉంటే సగం విలువ ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఆర్బీఐ రూల్స్‌–2018 ఉత్తర్వులు జారీ చేసింది. చిరిగిన నోటుకు పూర్తి విలువ పొందాలంటే ఏ నోటు కనీసం ఎంత మొత్తంలో మిగిలి ఉండాలో ఇందులో నిర్దేశించింది. అయితే కొత్తగా చలామణిలోకి తెచ్చిన నోట్లు చిరిగితే వాటిని మార్చే ప్రక్రియను ఇంకా ప్రారంభించడంలేదు.

మరిన్ని వార్తలు