నగదు ఏదీ?

11 Apr, 2020 10:13 IST|Sakshi

రూ.1500 కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు

ఆహార భద్రత కార్డుదారుల ఎదురుచూపులు

నగరంలో 18 లక్షల మందికిపైగా లబ్ధిదారులు

సాక్షి, సిటీబ్యూరో: రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదల పాలిట లాక్‌డౌన్‌ శాపంగా పరిణమించింది. దారిద్య్రరేఖకు దిగువనున్న వారికి ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నా.. నిత్యావసర వస్తువుల కోసం చేతిలో చిల్లిగవ్వ లేక తల్లడిల్లుతున్నారు. ఆహార భద్రత కార్డుదారులకు ఉచిత బియ్యంతో పాటు నిత్యావసర సరుకుల కోసం రూ.1500 అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. ఇప్పటికే ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా ఉచితం బియ్యం అందిస్తోంది. మహా నగరంలో ఇప్పటికే  ఆహార భద్రత కార్డుదారులు 70 శాతానికిపైగా నిరుపేదలకు ఉచిత బియ్యం పంపిణీ చేశారు. నగరంలోని కార్డుదారులతో పాటు ఉపాధి కోసం వచ్చి స్థానికంగా ఉన్న ఇతర ప్రాంతాలకు చెందిన కార్డుదారులకు సైతం పోర్టబిలిటీ ద్వారా రేషన్‌ పంపిణీ అందింది. ఇక నిత్యావసర సరుకులు, నగదు కోసం లబ్ధిదారులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బ్యాంక్‌ ఖాతాల్లో నగదు జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలుచేపట్టినట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. దీంతో తమ బ్యాంక్‌ ఖాతాల్లో నగదు జమ ఎప్పుడు జరుగుతుందోనని పేదలు ఎదురు చూస్తున్నారు.

హైదరాబాద్‌ మహా నగరంలో సుమారు 18 లక్షల పేద కుటుంబాలకు నగదు ద్వారా లబ్ధి చేకూరనుంది. వాస్తవంగా నగరంలోని అర్బన్‌ ప్రాంతానికి చెందిన ఆహార భద్రత కార్డుదారులు సుమారు 9.80 లక్షలపైగా ఉండగా, వివిధ జిల్లాలకు చెంది ఇక్కడ ఉపాధి, ఇతరత్రా కారణాలతో తాత్కాలికంగా నివాసం ఉంటున్నవారు మరో 8.20 లక్షల వరకు ఉంటారని అధికారుల అంచనా. బ్యాంక్‌ ఖాతాలో నగదు జమ అవుతున్న కారణంగా ఎక్కడైనా ఏటీఎంలో డ్రా చేసుకునే విలుంటుంది.

గతంలోనే ఆహార భద్రతకార్డుదారుల బ్యాంక్‌ ఖాతాలు, ఆధార్‌ నంబర్లను డీలర్లు సేకరించారు. మరోవైపు బ్యాంక్‌ ఖాతాలు సైతం ఆధార్‌తో అనుసంధానమయ్యాయి. ఆహార భద్రతకార్డుదారుల ఆధార్‌ ఆధారంగా నగదు బ్యాంక్‌ ఖాతాలో జమ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఆహార భద్రత కార్డుల లేని వలస కార్మికులను ఇప్పటికే గుర్తించి ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యంతోపాటు రూ.500 నగదు సైతం అందించారు. ఇక ఆహార భద్రత కార్డుదారులకు నగదు అందించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు