నగదు.. నిరాశ!

18 Apr, 2020 08:08 IST|Sakshi

బ్యాంక్‌ ఖాతాలో నగదు జమ

మొబైల్‌ మేసేజ్‌పైనే ఆధారం

70 శాతం ఖాతాలు క్లియర్‌

బ్యాంకుల ముందు బారులు

కనిపించని సామాజిక దూరం

సాక్షి, సిటీబ్యూరో: కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన ‘నగదు’ పై పేదలకు పరేషానీ పట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం దారిద్య్రరేఖకు దిగువనున్న ఆహార భద్రత కార్డు కలిగిన కుటుంబాలకు నిత్యావసర వస్తువుల కోసం రూ.1500 బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. దీంతో పేదలు నగదు విత్‌ డ్రా కోసం గత మూడు నాలుగు రోజు నుంచి ఉరుకులు పరుగులు పెడుతున్నారు. బ్యాంకుల ముందు పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు. గంట కొద్ది నిలబడిన కొద్ది మందికీ కౌంటర్ల వద్ద నిరాశ తప్పడం లేదు. కొందరి ఖాతాల్లో నగదు జమ జరగలేదు. ప్రభుత్వం ఇటీవల ఆహార భద్రత కార్డు కలిగిన లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాలో నగదు జమ చేసింది. బ్యాంక్‌ ఖాతాతో అనుసందానమైన మొబైల్స్‌æకు కూడా నగదు జమ జరిగినట్లు మేసేజ్‌లు కూడా వచ్చాయి. మరి కొందరి ఖాతాల్లో నగదు జమ జరిగినా.. లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాలు మొబైల నంబర్‌తో అనుసంధానం కాకపోవడంతో అలర్ట్‌ మేసేజ్‌ రాలేదు. దీంతో  బ్యాంకు ఖాతాలో నగదు పడిందా లేదా అనే పరేషానీ పట్టుకుంది.

ఆధార్‌ ఆధారంగానే నగదు జమ..
ఆహార భద్రత లబ్ధిదారుల ఆధార్‌ ఆధారంగానే బ్యాంకు ఖాతాలో నగదు జమ జరిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఆహార భద్రత కార్డుదారులకు బియ్యంతోపాటు నగదు సాయం కూడా ప్రకటించడంతో రెండింటి బాధ్యత చేపట్టిన పౌరసరఫరాల శాఖ రేషన్‌ కార్డుదారుల  బ్యాంకు ఖాతాలు లేక పోవడంతో ఎన్‌పీసీఐ వద్ద ఆధార్‌తో మ్యాపింగ్‌ చేసి బ్యాంక్‌ అకౌంట్లను వివరాలను తెప్పించుకుంది. ఆ డేటాతో పౌరసరఫరాల శాఖ డేటాను స్కానింగ్‌ చేసింది. రేషన్‌కార్డు దారులకు బ్యాంక్‌ అకౌంట్‌ ఉంటే  ఆ వివరాలు...లేకుంటే కుటుంబ సభ్యుల్లో  ఎవరో ఒకరి బ్యాంక్‌ అకౌంట్‌ జోడించి ప్యూరిఫై చేసింది. ఆ డేటాను ఎస్‌బీఐకి పంపించింది. అక్కడి నుంచి ఎన్‌పీసీఐ నేరుగా లబ్ధిదారుల ఖాతాలో నగదు బదిలీ చేసింది. 

చివరి లావాదేవీల ఖాతాలోనే జమ
ఆహార భద్రత కార్డు కలిగిన లబ్ధిదారులకు ఒకటి కంటే  ఎక్కువ బ్యాంక్‌ అకౌంట్‌ ఉంటే ఏ అకౌంట్‌లో నగదు జమ జరిగిందో అర్ధం కానీ పరిస్థితి నెలకొంది. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్‌ అకౌంట్‌లు ఉంటే ఆధార్‌ నెంబర్‌కు మ్యాపింగ్‌ జరిగి ఉన్న  అకౌంట్లలో ఇటీవల చివరి లావాదేవీలు జరిగిన ఖాతాలను గుర్తించి అందులో నగదు జమ చేశారు.  

రెండో విడతలో వీరికి..
హైదరాబాద్‌ మహానగరంలో సుమారు 70 శాతం ఆహార భద్రత కార్డుదారుల బ్యాంక్‌ ఖాతాలు క్లియర్‌గా ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ గుర్తించింది. క్లియర్‌ గల ఖాతాల్లో ఇప్పటికే నగదు జమ జరిగనట్లు తెలుస్తోంది. కాగా,  మిగితా ఖాతాల్లో నగదు జమ జరుగలేదు. ఆహార భ్రదత కార్డులతో ఆధార్‌ సీడింగ్‌ జరిగి ఉండి, బ్యాంక్‌ ఖాతా నంబర్‌ లేని వారికి రెండో విడతలో నగదు బదిలీ జరుగనుంది. బ్యాంక్‌ ఖాతాలు లేని వారికి వారి సంబంధికుల ఖాతా నెంబర్లను సేకరించి నగదు అందించనున్నారు.

నగరంలో 18 లక్షలపైనే..   
హైదరాబాద్‌ మహా నగరంలో సుమారు 18 లక్షల పేద కుటుంబాలకు నగదు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో నగరంలోని అర్బన్‌ ప్రాంతానికి చెందిన ఆహార భద్రత కార్డు దారులు సుమారు  9.80 లక్షల పైగా ఉండగా, వివిధ జిల్లాకు చెంది ఇక్కడ ఉపాధి, ఇతరత్రా కారణాలతో తాత్కాలికంగా నివాసం ఉంటున్న వారు మరో 8.20 లక్షల వరకు ఉండవచ్చని అధికారుల అంచనా.

మరిన్ని వార్తలు