ఎదురుచూపులేనా !

28 Sep, 2018 14:20 IST|Sakshi
ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల లబ్ధిదారుల ఎంపికకు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్న దృశ్యం ( ఫైల్‌) 

ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల కోసం నిరీక్షణ ఎన్నాళ్లో.. 

లబ్ధిదారుల ఎంపికతోనే సరిపెట్టిన అధికారులు 

2, 283 యూనిట్లలో 180 మందికే సబ్సిడీ మంజూరు  

బూర్గంపాడు: షెడ్యూల్‌ కులాల నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కల్పనకు ఎస్సీ కార్పొరేషన్‌ నుంచి ప్రభుత్వం ఇవ్వాల్సిన రుణాలు అందని ద్రాక్షగానే మిగులుతున్నాయి. ప్రతి ఏటా ఎస్సీ కార్పొరేషన్‌  అధికారులు రుణాలకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రచారం చేయటం, ఆ తర్వాత లబ్ధిదారులను ఎంపిక చేయటం, అంతటితోనే సరిపెట్టడం పరిపాటిగా మారింది. గత రెండేళ్లుగా ఎస్సీ నిరుద్యోగులు రుణాల కోసం ఎదురుచూస్తున్నారు. రుణాలకు ఎంపికైనప్పటికీ.. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు చుట్టూ  ప్రదక్షిణలు చేస్తున్నారు. లబ్ధిదారులను ఎంపిక చేసిన అధికారులు.. వారికి రుణాలు మంజూరు చేయకుండానే ఈ ఏడాది కొత్తగా మళ్లీ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 

జిల్లాలో 2017 – 18 సంవత్సరానికి గాను 2, 283 మంది లబ్ధిదారులను ఎస్సీ కార్పొరేషన్‌ ఎంపిక చేసింది. ఈ ప్రక్రియ పూర్తయి ఏడాది గడిచింది. కాగా, ఇప్పటివరకు టేకులపల్లి, చుంచుపల్లి మండలాలకు చెందిన 180 మందికి మాత్రమే ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలు మంజూరయ్యాయి. మిగతా మండలాల్లోని 2103 మంది లబ్ధిదారులకు ఇప్పటి వరకు రుణాలు మంజూరు కాలేదు. ఎస్సీ కార్పొరేషన్‌ నుంచి రుణాలు తీసుకునే లబ్ధిదారులు యూనిట్‌ పెట్టుకునేందుకు 80 శాతం ఎస్సీ కార్పొరేషన్‌ రాయితీగా అందిస్తుంది. మిగతా 20 శాతం బ్యాంకుల నుంచి లోన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే బ్యాంకర్లు ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలు తీసుకున్న వారు సక్రమంగా చెల్లించటం లేదని, 20 శాతం బ్యాంకు రుణం ఇవ్వాలంటే లబ్ధిదారుని నుంచి డిపాజిట్‌ చేయాలని చెపుతున్నారు. అలా చెల్లించిన వారికే బ్యాంకు రుణం ఇచ్చేలా అంగీకారపత్రం అందిస్తున్నారు. దీంతో లబ్ధిదారులు తమ వాటా 20 శాతం ఎంపిక సమయంలో చెల్లించి బ్యాంకుల నుంచి కాన్సెంట్‌ తెచ్చుకున్నారు. ఇందుకోసం ప్రైవేటు అప్పులు తీసుకుని బ్యాంకుల్లో డిపాజిట్‌ చేశారు. ఏడాది దాటినా రుణాలు మంజూరు కాకపోవటంతో లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 2016 – 17 సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలకు ఎంపికైన లబ్ధిదారుల్లో కొందరిని 2017 – 18 లబ్ధిదారుల్లో చేర్చారు. వారు రెండేళ్లుగా ప్రభుత్వ రాయితీ కోసం పడిగాపులు పడుతున్నారు. బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసేందుకు బయట తీసుకువచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పది రోజుల్లో రుణాలు మంజూరు కాకపోతే మళ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎవరూ పట్టించుకోరని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రుణాలు వెంటనే మంజూరు చేయాలని  కోరుతున్నారు. 

తీవ్రజాప్యం జరుగుతోంది   
ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోంది. లబ్ధిదారులను ఎంపిక చేసి ఏడాది గడిచినా రుణం మాత్రం మంజూరు కావడం లేదు. లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా పట్టించుకునే వారు లేరు. ఎప్పుడు అడిగినా వస్తాయి అంటారే తప్ప ఇచ్చేది మాత్రం లేదు. 
పేరాల శ్రీనివాసరావు, మాజీ ఉపసర్పంచ్, సారపాక 
బడ్జెట్‌ విడుదలవుతుంది 
జిల్లాలో 2, 283 మంది లబ్ధిదారులకు గాను 180 మందికి రుణం మంజూరు అయింది. మిగతా వారికి కూడా బడ్జెట్‌ విడుదలైంది. రుణాలకు సంబంధించి చెక్‌ అలాట్‌ అయింది. తొందరలోనే లబ్ధిదారులకు రుణాలను అందిస్తాం.
ఎం. పులిరాజు, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ 
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా