గృహమే కదా ‘స్విగ్గి’సీమ! 

9 Apr, 2020 02:23 IST|Sakshi

లాక్‌డౌన్‌ నేపథ్యంలో యూట్యూబ్‌లో చూసి వంటలు నేర్చుకుంటున్న ప్రజలు

ఇంట్లోనే రకరకాల పదార్థాలు చేసుకుంటున్న వైనం

గతంలో ఆర్డర్‌ చేస్తే వచ్చేవి... ఇప్పుడు ఇంట్లోనే చేసుకోవాల్సిన పరిస్థితి 

టైంపాస్‌తో పాటు... అనుభవమూ వస్తుందంటున్న సిటిజన్స్‌ 

సాక్షి, హైదరాబాద్‌: గతంలో ఏదైనా తినాలనిపిస్తే అలా ఆన్‌లైన్‌లోకి వెళ్లి ఇలా ఆర్డర్‌ చేసేవాళ్లం. సంప్రదాయ వంటలు, స్వీట్లు, బిర్యానీలు ఇలా.. ఏం తినాలనిపించినా వెంటనే తెప్పించుకోవడం.. జిహ్వ చాపల్యం తీర్చుకోవడం జరిగేది. అయితే ఇప్పుడు అలా అవకాశం లేదు. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో బయటినుంచి ఫుడ్‌ తెప్పించుకునే పరిస్థితి లేదు. ఒకవేళ అవకాశం ఉన్నా ఎలాంటి ఆహారం వస్తుందోనని, తెచ్చే వ్యక్తి ఎలాంటి వారోనని భయం. మరి రోజూ రకరకాల రుచులు చూసిన నాలుక ఊరుకుంటుం దా? నచ్చిన తిండి కోసం మనసు ఊగిసలాడుతోంది. అందుకే ఇలాంటివన్నీ పక్కకు పెట్టేసి కొత్త కొత్త వంటకాల కోసం యూట్యూబ్‌లోకి వెళ్లి నచ్చిన.. మెచ్చిన వంటలను తయారు చేసుకుంటున్నారు ప్రజలు. దీంతో లాక్‌డౌన్‌ సమయంలో రోజు గడిచిపోవడమే కాకుండా.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. వేడి వేడి వంట మన ఇంట్లోనే.. 

నచ్చిన ఆహారాన్ని తయారు చేసుకుంటున్నాం 
ఎప్పుడూ రకరకాల ఫుడ్‌ను ఆర్డర్‌ చేసేవాళ్లం. లాక్‌డౌన్‌ నేపథ్యంలో యూట్యూబ్‌లో చూసి నచ్చిన ఫుడ్‌ను స్వయంగా తయారు చేసుకుంటున్నాం. పాలక్‌ పన్నీర్, బిర్యానీ, ఎగ్‌ఫ్రై ఇలా రకరకాల వంటకాలు స్వయంగా చేసుకుంటున్నాం.          
–స్వప్న, హిమాయత్‌నగర్‌

బర్త్‌డే కేక్‌ తయారు చేశా.. 
ప్రతీ ఏడాది మా అబ్బాయి బర్త్‌డేకు కేక్‌ ఆర్డర్‌ చేసేవాళ్లం. అయితే ఇప్పుడు బయట షాపులు లేకపోవడంతో ఇంట్లోనే యూట్యూబ్‌లో చూసి కేక్‌ తయారు చేశా. అదే విధంగా వెజ్‌ బిర్యానీ సైతం స్వయంగా తయారు చేయడం కొత్త అనుభూతిని ఇచ్చింది. మనసుకు నచ్చిన ఆహారం మనమే తయారు చేసుకోవడం ఆనందంగా ఉంది.  
– వినిత, తిలక్‌నగర్‌

ఇంట్లోనే వంట చేసుకుంటున్నాం  
నేను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని, గచ్చిబౌలిలో ఉద్యోగం. గతంలో డ్యూటీ అవగానే క్యాబ్‌లోనే ఫుడ్‌ ఆర్డర్‌ చేసేవాన్ని. ఇంటికి చేరుకునేలోగా ఫుడ్‌ వచ్చేది. ఇప్పుడు వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నాం. దీంతో ఇంట్లోనే నచ్చిన వంటను చేస్తున్నా. రుచితో పాటు వేడివేడిగా తింటున్నాం. టైం గడిచిపోవడంతోపాటు వంట చేసే అనుభవం కూడా వస్తోంది.  – భరత్‌కుమార్‌   

>
మరిన్ని వార్తలు