ఆంక్షలు సరే.. అమలు ఎలా?

25 Oct, 2018 09:23 IST|Sakshi

బాణసంచా పేలుళ్లపై ‘సుప్రీం’ నిబంధనలు

వేడుకపై గ్రేటర్‌లో సర్వత్రా ఉత్కంఠ

పీసీబీ వద్ద లెక్కలు తీసే యంత్రాంగం లేమి..

సాక్షి,సిటీబ్యూరో: దీపావళి అంటే గుర్తుకొచ్చేది టపాసుల మోతలు.. బాణాసంచా వెలుగు జిలుగులే. అయితే ప్రమోదం మాటున పొంచున్న శబ్ద, వాయు కాలుష్యంతో పాటు పర్యావరణ హననంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం తాజాగా కీలక తీర్పును వెలువరించిన విషయం విదితమే. దీపావళి వేళ బాణాసంచాను రాత్రి 8 నుంచి 10 గంటల మధ్యనే కాల్చాలన్న షరతు విధించింది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన మార్గదర్శకాల అమలుపై  గ్రేటర్‌లో ఉత్కంఠ నెలకొంది. సమయం దాటి టపాసులు పేల్చే వారిని అదుపు చేయడం, అవధులు దాటే కాలుష్యాన్ని లెక్కించడం, లైసెన్సు పొందిన వ్యాపారుల నుంచే కొనుగోళ్లు చేయాలన్న నిబంధన అమలుపై ఎలా అన్నదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కాలుష్యాన్ని లెక్కించే యంత్రాంగమేది?  
నగరంలో హెచ్‌సీయూ, సనత్‌నగర్, పాశమైలారం, జూపార్కు ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ మండలి ‘కంటిన్యూయస్‌ యాంబియంట్‌ ఎయిర్‌ క్వాలిటీ’ అధునాతన యంత్రాలతో వాయు కాలుష్యాన్ని లెక్కగడుతోంది. ఈ యంత్రాలతో గాలిలోని కార్బన్‌ డయాక్సైడ్, కార్బన్‌ మోనాక్సైడ్, సల్ఫర్‌ డయాక్సైడ్, నైట్రోజన్‌ ఆక్సైడ్, బెంజిన్, టోలిన్‌ వంటి కాలుష్య కారకాల మోతాదును నిత్యం లెక్కిస్తోంది. మరో 21 నివాస, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల్లో డస్ట్‌ శాంప్లర్‌ వంటి యంత్రాలతో దుమ్ము, ధూళి ఇతర కాలుష్యాలను మాత్రమే లెక్కగడుతోంది. ఇప్పుడు ‘సుప్రీం’ మార్గదర్శకాల ప్రకారం దీపావళికి వారం రోజుల ముందు, తరవాత నగరవ్యాప్తంగా వివిధ రకాల వాయు కాలుష్యాన్ని లెక్కించాలి. అందుకు అవసరమైన సిబ్బంది, కాలుష్య నమోదు కేంద్రాలు లేవు. దీంతో అవధులు దాటే కాలుష్యాన్ని ఎలా లెక్కిస్తాన్నది సస్పెన్స్‌గా మారింది.  

సగానికి పడిపోనున్న విక్రయాలు
గ్రేటర్‌లో ఏటా దీపావళి సీజన్‌లో సుమారు రూ.100 కోట్ల వరకు బాణసంచా అమ్మకాలు జరుగుతుంటాయి. మహానగరంతో పాటు పొరుగు జిల్లాల వారు కూడా ఇక్కడే క్రాకర్స్‌ కొనుగోలు చేస్తుంటారు. ఇందులో సుమారు రూ.20 కోట్ల వరకు ఆన్‌లైన్‌ అమ్మకాలు జరుగుతున్నట్లు అంచనా. ఈసారి దీపావళి నేపథ్యంలో అధిక శబ్దం వెలువడేవి.. ఆకాశంలో కాంతులు వెదజల్లే క్రాకర్స్‌ను చైనా నుంచి సుమారు రూ.30 కోట్ల సరుకును నగరానికి దిగుమతి చేసుకున్నట్లు అంచనా. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గ్రేటర్‌లో బాణసంచా అమ్మకాలు సగానికి సగం పడిపోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.  

‘సుప్రీం’ తీర్పులో ముఖ్యాంశాలివీ..
దీపావళికి ఏడు రోజుల ముందు, ఆ తరవాత గాలి నాణ్యత ఎలా ఉందో కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లు పరిశీలించాలి.
దీపావళి రోజు దేశవ్యాప్తంగా రాత్రి 8 నుంచి 10 వరకు మాత్రమే టపాసులు కాల్చాలి.
క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సమయంలో రాత్రి 11.55 నుంచి 12.30 వరకు (35 నిమిషాలు) మాత్రమే టపాసులు కాల్చాలి.
ఇతర పండుగలకు, వేడుకలకు కూడా ఇవే షరతులు వర్తిస్తాయి.
తక్కువ పొగ వచ్చే బాణసంచా తయారీకి మాత్రమే అనుమతివ్వాలి.
బాణసంచా వల్ల ఏర్పడే కాలుష్యంపై ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాలి.  
నిషేధిత టపాసులు అమ్మడం, కాల్చడంపై పోలీసు శాఖ నిఘా పెట్టాలి.
టపాసులు పేల్చడం వల్ల తలెత్తే కాలుష్యంపై పాఠశాలలు, కళాశాలల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి.

గ్రేటర్‌కు శబ్దకాలుష్య ముప్పు
దీపావళి టపాసుల మోత అవధులు మించితే చిన్నారులు, జంతువులపై తీవ్ర ప్రభావం చూపే అకాశం ఉంది. వాయు కాలుష్యంలో సల్ఫర్‌ డయాక్సైడ్, నైట్రోజన్‌ ఆక్సైడ్‌ మోతాదు కూడా భారీగా పెరిగి శ్వాసకోశ వ్యాధులు, కళ్ల సంబంధిత వ్యాధులు పెరిగే ప్రమాదముంది. ముఖ్యంగా టపాసులు కాల్చినపుడు వెలువడే శబ్దాలు నివాస ప్రాంతాల్లో 45 డెసిబుల్స్‌ (ధ్వనిని కొలిచే ప్రమాణం) మించరాదు. కానీ నగరంలో ఆ శబ్దాలు ఏటా 90 డెసిబుల్స్‌కు మించి నమోదవుతున్నాయి. వీటివల్ల పెంపుడు జంతువులు విపరీతంగా ప్రవర్తిస్తాయని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు.  

వాయు కాలుష్యంతో ముప్పే
సల్ఫర్‌ డై ఆక్సైడ్‌  క్యూబిక్‌ మీటర్‌ గాలిలో సల్ఫర్‌ డై ఆక్సైడ్, నైట్రోజన్‌ ఆక్సైడ్‌ 80 మైక్రోగ్రాములు మించరాదు. కానీ ఏటా దీపావళికి అవి 450–500 మైక్రోగ్రాములకు చేరుతోంది. దీంతో ఊపిరితిత్తులకు హానితో పాటు బ్రాంకైటిస్‌ (తీవ్రమైన దగ్గు), శ్వాసకోశ వ్యాధులు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ధూళిరేణువులు(ఎస్‌పీఎం) క్యూబిక్‌ మీటర్‌ గాలిలో 100 మైక్రోగ్రాములు మించకూడదు. కానీ వీటి మొతాదు కూడా 300 మైక్రోగ్రాములు దాటుతోంది.  

పరిష్కారం ఇలా..
తక్కువ శబ్దం వెలువడే చిచ్చుబుడ్లు, భూచక్రాలు, పూల్‌ఛడీ, పెన్సిల్స్‌ కాల్చాలి. శబ్దాలు కాకుండా వెలుగులు విరజిమ్మే మతాబులను ఎంచుకోవాలి. విపరీత శబ్దాలు కర్ణభేరీకి సోకకుండా చెవుల్లో దూది పెట్టుకోవాలి. ట పాసుల మోత శృతిమించకుండా చూసేందుకు కాలనీ సంక్షేమ సంఘాలు ప్రయత్నించాలి.

మరిన్ని వార్తలు