ఆదర్శ గ్రామాలు

7 Dec, 2014 01:58 IST|Sakshi
ఆదర్శ గ్రామాలు

ఏ పల్లెలో చూసినా ప్రస్తుతం మద్యం ఏరులై పారుతోంది.. ఎక్కడైనా నీటి గోస ఉన్నదేమో గానీ.. మద్యం విక్రయించని గ్రామాలు అరకొరే. ఇదిలా ఉంటే.. మారుతున్న ఆధునికతకు తోడు ఆయా భోజనప్రియుల్లోనూ మార్పులొస్తున్నాయి. నాన్‌వెజ్ లేనిదే ముద్ద దిగని రోజు లివి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ గ్రామాలు సంపూర్ణ మద్య నిషేధం పాటిస్తున్నాయి. జీవ హింసకు దూరంగా ఉంటూ.. మాంసం తినేందుకు అయిష్టపడుతున్నారు ఆ గ్రామాల ప్రజలు. పెద్దల కట్టుబాట్లకు కట్టుబడి.. గ్రామ కమిటీల ఆజ్ఞలతో.. అందరి సహకారంతో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని పాటిస్తున్నారు. అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తూ.. అభివృద్ధికి బాటలు వేసుకుంటున్నారు.

జిల్లాలో మద్యం, మాంసం ముట్టని గ్రామాలపై మద్యం.. మందు.. కళ్లు.. ఇలా ఈ మత్తు పదార్థానికి పేర్లు ఎన్నున్నాయో... అది సృష్టించే అనర్థాలూ అంతకంటే చాలానే ఉన్నాయి. మానవత్వం నుంచి మనిషిని దూరం చేసేది.. మానవ సంబంధాల్ని చంపి పాతరేసేది.. ఏదైనా ఉందంటే అది మందే. అలాంటి మందునే మనుషుల నుంచి దూరం చేయాలనుకున్నారు ఆ పల్లెల ప్రజలు. అనుకున్నది అనుకున్నట్లు ఆచరించి చూపుతున్నారు. ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆ పల్లెల్లో మద్యం అమ్మకం లేదు. బెల్టుషాపులు లేవు. గుడుంబా తయారీదారులు లేరు. ఆ విక్రయాలూ లేవు. తాగేవారు లేరు. తాగించేవారూ లేరు. ఇప్పుడా ఊళ్లు ప్రశాంతంగా ఉన్నాయి. అలాంటి ఆదర్శ పల్లెలపై ప్రత్యేక కథనం.
 
రాళ్లకన్నెపల్లిలో నాలుగేళ్లుగా నిషేధం
తిర్యాణి : మండలంలోని గడలపల్లి పంచాయతీ పరిధి రాళ్లకన్నెపల్లి గ్రామస్తులు నాలుగేళ్లుగా మద్యానికి దూరంగా ఉంటున్నారు. గ్రామంలో మద్యం అమ్మినా, తాగినా వారిని ఊరిలోకి రానిచ్చేది లేదని గ్రామస్తులంతా కలిసి స్వచ్ఛందంగా తీర్మానించుకున్నారు. గతంలో గ్రామంలో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతుండేవి. ఆడ, మగ తేడా లేకుండా చాలా మంది మద్యానికి బానిసలయ్యారు. దీంతో రోజూ గొడవలు జరుగుతుండేవి. దానికి రోజూ పంచాయతీలు పెట్టడం, తీర్మానాలు చేయడం మాములే అయిపోయింది.

ఊరి పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రామస్తులు గ్రహించారు. ఆ పరిస్థితుల నుంచి బయటపడే మార్గాల గురించి ఆలోచించి, గ్రామస్తులంతా ఏకమై గ్రామంలో మద్యం నిషేధించాలని నిర్ణయానికి వచ్చారు. తమ గ్రామంలో మద్యం నిషేధిస్తున్నట్లు ప్రకటించి అప్పటి ఎస్సై శ్రీనివాస్ యాదవ్‌కు తమ గ్రామంలో మద్యం నిషేధిస్తున్నామని తెలుపుతూ రాత పూర్వకంగా తీర్మాన పత్రం రాసి ఇచ్చారు. అప్పటి నుంచి మద్యం బంద్ అయింది.
 
ఊరు బాగు కోసం...
గ్రామంలో మద్యం నిషేధ తీర్మానం చేసినప్పటి నుంచి ఊరిలో గొడవలు సద్దుమణిగాయి. అందరూ సంతోషంగా ఉన్నారు. మాకు మేముగానే ఊరిలో మద్యం అమ్మకాలు సాగించవద్దని నిర్ణయానికి వచ్చాం. మద్యం బెల్టుషాపుల ద్వారా అమ్మసాగించే వారి ఉపాధి పోతుందని విమర్శలు వచ్చాయి. కానీ అవేమీ పట్టించుకోకుండా ఊరు బాగు కోసం త్యాగం చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాం.
- మడావి మోతీరాం
 
మేడిగూడలో పెద్దల మాట గౌరవిస్తూ..

ఇచ్చోడ : మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడిగూడ పదేళ్లుగా మద్య, మాంసాలకు దూరంగా ఉంటూ గిరిజన, గిరిజనేతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. గతంలో ఈ గూడెంలో మద్యం తాగి తరచూ గొడవలు, పంచాయతీలు, ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే వారు. ప్రశాంతత కరువైంది. 15 ఏళ్ల కిందట గూడెంలో మద్యం తాగి గొడవపడ్డ సంఘటన పోలీస్‌స్టేషన్ వరకూ వెళ్లడంతో అప్పట్లో చాలామంది గిరిజనులపై కేసులు కూడా నమోదయ్యాయి.

దీంతో అప్పటి గ్రామపెద్ద మారు పటేల్ గూడెం పెద్దలతో చర్చించి మద్యం మాంసాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. నాడు తీసుకున్న నిర్ణయాన్ని నేటి కీ పాటిస్తున్నారు. ఇప్పుడు గ్రామం ప్రశాంతంగా ఉంది. అందరూ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. మండలంలోని మాన్కపూర్ పంచాయతీ అనుబంధ గ్రామమైన మేడిగూడలో దాదాపు 70 కుటుంబాల్లో సూమారు 400  మంది జనాభా ఉంటారు. ఇక్కడ నివసించే ప్రజల్లో అందరూ ఆదిమ గిరిజన గోండు తెగకు చెందినవారే. గ్రామానికి ఇతర గ్రామాల నుంచి ఎవరైనా చుట్టాలు వచ్చినా ఇక్కడ మద్యం తాగనివ్వరు.
 
సాలెగూడలో 27 ఏళ్లుగా మద్యానికి దూరంగా...
ఉట్నూర్ : ఆ గూడెంలో ఐదుగురు కలిసి తీసుకున్న నిర్ణయం ఊరి స్వరూపాన్నే మార్చింది. ఒకప్పుడు మద్యం తాగుతూ... మాంసం తింటూ నిత్యం గొడవలు పడే కుటుంబాలున్న ఆ గూడెంవాసులు ప్రస్తుతం ప్రశాంత వాతావరణంలో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. 27 ఏళ్ల క్రితం అప్పటి గూడెం పెద్దలైన టేకం భీము, కొడప లచ్చు, ఆత్రం లేతు, టేకం రాము, ఆత్రం భీము కలిసి గూడెంలో ఎవరూ మద్యం ముట్టరాదంటూ తీర్మానించారు. అప్పటి నుంచి ఇప్పటికీ ఆ గూడెం మద్యానికి దూరంగా ఉంటోంది. ఇక గూడెంకు చెందిన దేవతల విగ్రహలు తయారు చేసే టేకం బాపురావు 1989లో తన కుటుంబం ఇక నుంచి మాంసాహారం ముట్టదని ప్రకటించాడు. అతనిని చూసిన ఇతర కుటుంబాల వారు క్రమక్రమంగా మాంసహారానికి దూరమయ్యారు. ప్రస్తుతం గూడెంలో 90 శాతం మంది మాంసాహారమంటే దూరంగా ఉంటారు. అందరూ మద్యమంటే అస్యహించుకుంటారు.
 
ఒకరికొకరు అండగా...
ఉట్నూర్ మండలం ఉమ్రి పంచాయితీ పరిధిలోని కొలాం గిరిజనులకు నిలయం సాలెగూడ. 50 ఏళ్ల క్రితం ఐదు ఇళ్లతో వెలసిన ఈ గూడెం ఇప్పుడు దాదాపు 75 కుటుంబాలతో సుమారు 420 వరకు గిరిజన జనాభాతో కళకళలాడుతోంది. గూడెంలో ఎవరిని చూసినా ప్రశాంతంగా కనిపిస్తారు. వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న వీరు తెల్లారిందంటే చేను పనులకెళ్లడం సందెవేళ ఇంటికి చేరడం నిత్య దినచర్య. గూడెంలో ఏ కుటుంబంలో ఏ సమస్య ఎదురైనా ఒకరికొకరు అండగా నిలుస్తారు. ఒక ఇంట్లో శుభకార్యమైదంటే తలో చేయివేసి తమ ఇంట్లో శుభకార్యంలాగా భావిస్తూ దగ్గరుండి పనులు చేస్తారు.

మద్యం తాగితే జరిమానా!
గూడవాసులు ఎవరైనా మద్యం తాగినట్లు తెలిస్తే గూడ పెద్ద సమక్షంలో పటేల్ ఆధ్వర్యంలో పంచాయితీ పెడుతారు. మద్యం తాగిన వ్యక్తిని పంచాయితీకి పిలిపిస్తారు. మద్యం తాగినట్లు తేలితే రూ.500ల పైచిలుకు జరిమానా విధిస్తారు. ఇలా జమైన మొత్తానికి మరికొంత మొత్తం ఇంటింటి నుంచి సేకరించి గూడెంలో జరిగే శుభకార్యాలకు పనికి వచ్చేలా దాదాపు రూ.30 వేల విలువైన వంట పాత్రలను కొనుగోలు చేశారు. అయితే కొన్ని నెలల క్రితం ఒకరు మద్యం తాగకుండా ఉండలేనంటే కుటుంబంతో సహా పక్క గూడకు వసల వెళ్లాడు. జూన్-2011 నెలలో  గూడలో ఓ పెళ్లి జరిగింది. పెళ్లి వారు మహారాష్ట్రకు చెందిన వారు. వారి పెళ్లిళ్లలో మద్యం తాగడం పరిపాటి. వారు కూడా మద్యం సీసాలు తీసుకువచ్చారు. అయితే ఈ గూడెం కట్టుబాటు, నిర్ణయాన్ని గౌరవిస్తూ ఊర్లో మద్యం తాగకుండా సీసాలు తిరిగి తీసుకెళ్లారు. ఇంతలా ఉంటుంది ఇక్కడ మద్యం విషయంలో కట్టుబాటు.

శుభకార్యాల్లో శాకాహారమే...
గూడెంలో ఏ శుభకార్యం జరిగినా శాకాహార భోజనమే పెడుతారు. మాంసాహారం అస్సలు పెట్టరు. అసలు ఆ మాటే వినిపించదంటే అతిశయోక్తి కాదు. గ్రామంలో 90 శాతం కుటుంబాలు మాంసం ముట్టరు. వీరి ఆరాధ్య దైవాలకు ముహూర్తాల సమయంలో జంతు బలులు ఉంటాయి. కానీ కొబ్బరికాయలతోనే పూజలు నిర్వహిస్తారు. ఇక ఈ గూడ పచ్చదనానికి పెట్టింది పేరు. గూడెంలోని రహదారి వెంట గూడ వాసులు చెట్లు పెంచుతున్నారు. అంతేకాకుండా ప్రతీ ఇంటి ఎదుట ఏదో పూల మొక్క కానవస్తుంది. టేకం అంకుశ్ నిరక్షరాస్యుడైనా తన ఇంటి ఆవరణలో చేపట్టిన మొక్కల పెంపుదనాన్ని ఆదర్శంగా తీసుకున్న కుటుంబాలు ప్రతీ ఇంటి ఎదుట పచ్చదానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయి. తమకు పూర్తిస్థాయి నీటి సౌకర్యం ఉంటే గూడెంనంతటిని పచ్చదనం చేస్తామని అంటున్నారు సాలెగూడవాసులు.

మరిన్ని వార్తలు