ఇక ‘కట్’కటే..

13 Jun, 2014 02:24 IST|Sakshi

ఖమ్మం : వేసవి కాలం అయిపోయింది.. తొలకరి చినుకులు కురుస్తున్నాయి...ఇక విద్యుత్ గండం నుంచి గట్టెక్కినట్టేనని సంతోషపడుతున్నారా ..? అలా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే వేసవి ముగిసిన వెంటనే ఎడాపెడా కోతలకు విద్యుత్ శాఖ రంగం సిద్ధం చేసింది. వేసవికాలంలో ఎన్నికలు ఉండడంతో గృహ వినియోగదారులపై కొంత ‘కరుణ’ చూపినా.. ఇప్పుడు తన పని తాను చేసుకుపోతోంది. విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించిన దాని ప్రకారమే విచ్చలవిడి విద్యుత్ కోతలతో జిల్లా ప్రజలు ఉక్కిరి బిక్కిరి కానున్నారు.
 
ఇక వ్యవసాయ సీజన్ ప్రారంభమై, వినియోగం పెరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనలవి కాదు. అధికారికంగానే ఆరేసి గంటల చొప్పున కోతలు ప్రకటిస్తున్న విద్యుత్ శాఖ అనధికారికంగా మరింత కోత విధించే అవకాశం ఉంది. దీనికి తోడు చిన్నపాటి వర్షానికే విద్యుత్ వైర్లు తెగిపడటం, షార్ట్ సర్క్యూట్లు, లైన్ల మరమ్మతు వంటి కారణాలతో ఇంకెన్ని ఇబ్బందులోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
 
తక్షణమే అమలు...
నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌పీడీసీఎల్) అధికారుల నుంచి  ఆదేశాలు వెలువడిన వెంటనే జిల్లాలో గురువారం నుంచే విద్యుత్ కోతలు అమల్లోకి వచ్చాయి. జిల్లా కేంద్రంలో గంట, మున్సిపల్, మండల కేంద్రాల్లో రెండు గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆరు గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. అయితే ఇంకా ఎండల ప్రభావం తగ్గకపోవడంతో ఇప్పటి వరకు వ్యవసాయ సీజన్ ప్రారంభం కాలేదు. దీంతో జిల్లాకు కేటాయించే విద్యుత్ కంటే వినియోగం తక్కువగానే ఉంది. గత మూడు, నాలుగు రోజులుగా జిల్లాకు సగటున సుమారు 5.8 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా అవుతోంది.
 
వినియోగం మాత్రం రోజుకు సగటున 5.4 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉన్నట్లు తెలిసింది. దీన్ని బట్టి చూస్తే జిల్లాలో ఇప్పుడు విద్యుత్ కోతలు విధించాల్సిన అవసరం లేదు. కానీ ఎన్‌పీడీసీఎల్ పరిధిలో ఉన్న వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, ఖమ్మం జిల్లాల సగటు విద్యుత్ వినియోగం సరఫరా కంటే అధికంగా ఉంది. ఈ పరిస్థితిలో అన్ని జిల్లాల సగటు వినియోగం, సరఫరాను లెక్కేసి విద్యుత్ కోతలు విధిస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ జిల్లాల పరిధిలో వ్యవసాయ విద్యుత్ వినియోగం గణనీయంగానే ఉంటుంది. మరి ఇప్పుడే ఆరు గంటల కోత విధిస్తే.. ఖరీఫ్ ప్రారంభమై వ్యవసాయ విద్యుత్ వినియోగం పెరిగితే మరిన్ని గంటల పాటు కోతలు తప్పవని విద్యుత్ శాఖ వర్గాలే చెపుతున్నాయి.
 
వ్యవసాయానికి 6 గంటలే..
వ్యవసాయానికి ఆరు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలను ఏ,బీ,సీ గ్రూపులుగా విభజించి విద్యుత్ సరఫరా చేస్తున్నారు. గ్రూప్ ఏ ప్రాంతానికి తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు, రాత్రి 10 నుంచి 12 వరకు, గ్రూప్- బి ప్రాంతంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు, రాత్రి 12 నుంచి 2 వరకు, గ్రూప్-సీ ప్రాంతానికి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు, తిరిగి రాత్రి 1 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తారు. అయితే ఇచ్చే ఆరుగంటలు కూడా నిరంతరం సరఫరా చేయకుండా సగం ఉదయం, సగం రాత్రి వేళల్లో ఇస్తే మడి కూడా తడవదని, అర్ధరాత్రి విద్యుత్‌తో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని రైతు సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు