వడదెబ్బ మృతులు ముగ్గురేనట!

14 Jun, 2014 03:45 IST|Sakshi
వడదెబ్బ మృతులు ముగ్గురేనట!

ఆదిలాబాద్ : జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది వేసవిలో భానుడు చెలరేగిపోయాడు. దాదాపు 46 డిగ్రీల సెంటిగ్రేడ్‌కుపైగా ఉష్ణో గ్రతలు నమోదయ్యాయి. ఎండలకు వేడిగాలులకు తోడవడంతో ప్రజలు కొందరు మృత్యువాత పడ్డారు. గతేడాది 40 మందికిపైగా మృతిచెందితే.. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 50 మందికిపైగా మరణించారు. మృతిచెందిన వారిలో అత్యధికంగా నిరుపేదలైన ఉపాధి కూలీలే ఉండటం గమనార్హం. వాస్తవానికి క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించకుండానే నివేదికలు తయారుచేసి అధికారులకు పంపించారు. ఈ నివేదికల్లో ఈ ఏడాది ఇప్పటివరకు ముగ్గురే మృతిచెందినట్లు పేర్కొనడం విస్మయం కలిగిస్తోంది.
 
గతేడాది 40 మంది..
జిల్లాలో వడదెబ్బ కారణంగా గతేడాది ఏప్రిల్, మే, జూన్‌లలో 40 మంది మృతి చెందారు. ఇందులో 39  మందికి ఆపద్బంధు పథకం కింద రూ. 50 వేల చొప్పున వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు. ఈ ఏడాది 50 మందికిపైగా వడదెబ్బతో మృతి చెందారు. సాధారణంగా ఇలా మృతి చెందినప్పుడు బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారు. ఒకవేళ మృతుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోతే ఎఫ్‌ఐఆర్ కాపీ వచ్చే పరిస్థితి ఉండదు. ఇలాంటి వారికోసం ప్రభుత్వం ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. అందులో తహశీల్దార్, సంబంధిత పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్, మెడికల్ అధికారి ఇందులో సభ్యులు ఉంటారు. వారు వ్యక్తి మృతికి సంబంధించి విచారణ చేపట్టి నివేదికను అందజేస్తారు.
 
ఒకవేళ ఆ వ్యక్తి వడదెబ్బ కారణంగానే మృతి చెందాడని నిర్దారణ అయిన పక్షంలో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు ఆపద్బంధు వర్తిస్తుంది. సహజంగా బాధితులు ఆపద్బంధు పథకం కోసం తహశీల్దార్‌కు ఎఫ్‌ఐఆర్ కాపీతో దరఖాస్తు చేసుకోవాలి. తహశీల్దార్ నుంచి వచ్చే వివరాల ఆధారంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో పథకం విభాగంలో లబ్ధిదారులను గుర్తిస్తారు. ప్రభుత్వానికి నివేదిక పంపుతారు. దాని ఆధారంగా వచ్చే సహాయాన్ని బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. జిల్లాలో పలువురు ఉపా ధి హామీ కూలీలు, ఇతర కష్టజీవులు వడదెబ్బతో మృ తి చెందారు. అయితే వారి వివరాలు పంపించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పలువురు బాధితులకు ఆపద్బంధు పథకం కింద ఈ ఆర్థిక సాయం లభిస్తుందనే అవగాహన లేకపోవడం కూడా దీనికి కారణమవుతుంది. పేద కుటుంబాలకు ఆపద్బంధు పథకం కింద వచ్చే రూ. 50 వేలు ఎంతో ఆసరాను ఇస్తాయి. అధికారులు మిగతా వారిని గుర్తించి ఆపద్బంధు కింద ఆదుకోవాల్సిన అవసరం ఉంది.
 
 వడదెబ్బ మృతులు వీరేనట..
 
 పేరు            ఊరు        మండలం
 ఉర్వేత రాము        లక్ష్మీపూర్    కడెం
 జంగుల గంగారాం    గిర్నూర్    బజార్‌హత్నూర్
 కంకణాల మాధవరెడ్డి కోనంపేట    నెన్నెల

మరిన్ని వార్తలు