మా బతుకులు ముంచొద్దు

22 Oct, 2017 01:15 IST|Sakshi
అధికారుల ముందు గోడు వెళ్లబోసుకుంటున్న గ్రామస్తురాలు

గ్రామసభలో వేములఘాట్‌ ప్రజల ఆవేదన  

సాక్షి, సిద్దిపేట: ‘తరతరాలుగా ఇక్కడే బతు కుతున్నాం.. ఏటా 2 పంటలు పండే సార వంతమైన భూములున్నాయి. రైతులు, కూలీలు, కులవృత్తులు సబ్బండ జాతులం అన్నదమ్ముల్లా బతుకున్నాం.. ఇప్పుడు మా గ్రామాన్ని ముంచి కుటుంబాలను చెల్లాచెదురు చేస్తే.. మేం ఎక్కడికెళ్లి బతకాలి? మా బతుకులు ముంచొద్దు’ అంటూ సిద్దిపేట జిల్లా వేములఘాట్‌ గ్రామస్తులు ముక్తకంఠంతో చెప్పారు. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణంలో ముంపునకు గురవుతు న్న తొగుట మండలం వేములఘాట్‌ గ్రామస్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే . నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలతో జిల్లా అధికారులకు అందిన ఉత్తర్వుల మేరకు శనివారం గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్‌ మంజుల అ ధ్యక్షతన జరిగిన సభ లో గ్రామస్తులు తమ  గోడు వెలిబుచ్చారు.  

రెండు పంటలు పండే భూములు 
‘ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రెండు పంటలు పండే నికార్సైన భూములు మావి.. వాటిని వదిలి ఎలా వెళ్లాలి?ఈ ప్రాంతంలో నదులు లేకుండా ప్రాజెక్టులు కట్టడమేమిటి’ అని గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. డీపీఆర్, ఇతర అనుమతులు చూపించా లని, పునరావాసం, ఉపాధి వివరాలు అందజేయాలని కోరారు. అందరం కలసికట్టుగా పనిచేసుకుంటూ బతికే గ్రామాన్ని నీటిలో ముంచి ప్రాజెక్టులు కడితే తాము ఎక్కడికి వెళ్లి బతకాలని అని విలపించారు. భూమికి భూమి, ఇల్లుకు ఇల్లు ఇవ్వాలని, గ్రామం ఒకేచోట నిర్మించాలని కోరారు.  

ప్రతి అంశాన్నీ రికార్డు చేశాం.. 
గ్రామసభలో గ్రామస్తులు తెలిపిన అభిప్రాయంలోని ప్రతీ అంశాన్ని రికార్డు చేశామని సిద్దిపేట ఆర్డీవో ముత్యంరెడ్డి తెలిపారు. పునరావాసం, ఉపాధి, పరిహారం, ప్రాజెక్టు నిర్మాణం మొదలైన అంశాలపై వివరాలు అందచేస్తామన్నారు. గ్రామానికి గ్రామం నిర్మించి, అన్ని వసతులు కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. 

మరిన్ని వార్తలు