సిటీ‘లైఫ్‌’.. ఇస్మార్ట్‌ ప్రూఫ్‌ 

11 Sep, 2019 03:28 IST|Sakshi

నగరంలో గణనీయంగా పెరిగిన శిక్షల శాతం 

రాష్ట్రంలో అత్యధికంగా జీవితఖైదులు ఇక్కడే 

ఈ ఏడాది తొలి 8నెలల్లో జీవిత ఖైదు పడ్డవారి సంఖ్య 67 

రాజధానిలోని 3 కమిషనరేట్లలో విధించినవి 24 

ప్రత్యేకంగా అభినందించిన డీజీపీ కార్యాలయం 

సాక్షి, హైదరాబాద్‌: ఇస్మార్ట్‌ ప్రూఫ్‌లు.. నేరస్థులను ఇట్టే పట్టిస్తున్నాయి. మూడోకన్ను పడిందంటే మూడినట్టే. నేరాల ప్రివెన్షన్, డిటెక్షన్, కన్వెక్షన్‌లో సీసీ కెమెరాలతోపాటు ట్యాబ్స్, ల్యాప్‌టాప్స్, యాప్స్‌ కీలకపాత్ర పోషిస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసుశాఖకు మౌలిక వసతులతోపాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం సమకూర్చింది. సాంకేతిక సహాయంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధుల్లోని సిబ్బందిలో జవాబుదారీతనం పెరిగింది. ఫలితంగా వీటిల్లో శిక్షలు, ముఖ్యంగా జీవితఖైదు శిక్షలు పెరిగాయి. జీవితఖైదు పడుతున్న కేసుల్లో హత్య, పోక్సోయాక్ట్, మహిళలపై నేరాలతోపాటు ఇతరాలు ఉంటున్నాయి. 

జీవితఖైదు శిక్షలు
ఈ ఏడాది జనవరి–ఆగస్టు మధ్య రాష్ట్రవ్యాప్తంగా పడిన జీవితఖైదుల్లో 35.8 శాతం ఈ మూడు కమిషనరేట్ల కేసులకు సంబంధించిన తీర్పులే. దీన్ని గుర్తించిన డీజీపీ కార్యాలయం ఇటీవల ప్రత్యేకంగా అభినందించింది. రాష్ట్రంలోని 21 యూనిట్లలో 67 మందికి జీవిత ఖైదుపడగా వారిలో హైదరాబాద్‌ పరిధిలో 10, సైబరాబాద్, రాచకొండల్లో ఏడుగురు చొప్పున ఉన్నారు. 

క్లూస్‌ టీమ్స్‌..
నేరం జరిగినప్పుడు ఘటనాస్థలాల నుంచి వీటిని ఎంత వేగంగా, పక్కాగా సేకరించ గలిగితే అంత మంచి ఫలితాలు ఉంటాయి. ఒకప్పుడు మూడు కమిషనరేట్లలో కలిపి కేవలం మూడే క్లూస్‌టీమ్స్‌ ఉండేవి. ఫలితంగా వారిపై పనిభారంతో పాటు క్రైమ్‌ సీన్స్‌కు చేరుకోవడంలో కాలయాపన జరిగేది. జాప్యాన్ని నివారించడానికి పోలీసు శాఖ డివిజినల్‌ క్లూస్‌టీమ్స్‌ను ఏర్పాటు చేసింది. 

జియో ట్యాగింగ్‌
ప్రతి పోలీసు అధికారి రోజువారీ నిర్వర్తిస్తున్న విధులను తెలుసుకోవడం కోసం ప్రత్యేక ఆన్‌లైన్‌ నివేదికలను పోలీసు ఉన్నతాధికారులు తెప్పించుకుంటున్నారు. నేరగాళ్ల నివాసాలు, ఆవాసాలను సాంకేతికంగా గుర్తించడానికి సీసీ కెమెరాలకు జియో ట్యాగింగ్‌ చేయడంతోపాటు ఈ–లీవ్‌ విధానం అమలు వంటివి ప్రతిస్థాయి అధికారి, సిబ్బందికి అందుబాటులోకి వచ్చాయి. 

సీసీ కెమెరాలు..
నేరాలను నిరోధించడం, కేసుల్ని కొలిక్కి తేవడం, దోషులను నిర్ధారించడం వంటి అంశాల్లో సీసీ కెమెరాలు బాగా ఉపకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాపార, వాణిజ్యవర్గాల సహాయంతో కమ్యూనిటీ సీసీ కెమెరాలు, ‘నేను సైతం’ప్రాజెక్టు కింద సాధారణ ప్రజలతో సీసీటీవీలను ఏర్పాటు చేయించారు. మూడు కమిషనరేట్లలో ఉన్న సీసీ కెమెరాల సంఖ్య 3 లక్షలకు పైనే. రికార్డు అయిన ఫీడ్‌ను శాస్త్రీయంగా ఎలా సేకరించాలనే అంశంపై పోలీసులకు ప్రత్యేక శిక్షణ సైతం ఇచ్చారు.  

ఐఎస్‌ఎస్‌..
శిక్షల శాతం పెరగడంలో ఇన్వెస్టిగేషన్‌ సపోర్ట్‌ సెంటర్‌ (ఐఎస్‌ఎస్‌) పాత్ర ఎనలేనిది. హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ కేంద్రంగా రెండేళ్లుగా పనిచేస్తున్న ఈ విభాగం దర్యాప్తు అధికారులకు ఆద్యంతం సహకరిస్తోంది.  

మరిన్ని వార్తలు