నిజామాబాద్‌లో ఉన్మాది ఆత్మహత్య

14 Oct, 2019 12:03 IST|Sakshi
బందెల రవి మృతదేహం

సాక్షి, దోమకొండ : సొంత బిడ్డతో సహా ముగ్గురిని కిరాతకంగా హతమార్చి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్మాది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దారుణానికి ఒడిగట్టిన అనంతరం తాను కూడా గొంతు కోసుకుని చెరువులో దూకాడు. దోమ కొండ మండల కేంద్రంలోని మల్లన్న ఆలయం సమీపంలో కుటుంబ సభ్యులు ముగ్గురిని దారుణంగా హత్య చేసిన ఉన్మాది బందెల రవి (38) ఆదివారం స్థానిక చెరువులో శవమై తేలాడు. భిక్కనూరు సీఐ రాజశేఖర్‌ కథనం ప్రకారం.. భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన రవి తన సొంత కూతురు చందన(8)తో పాటు సోదరుడు బాలయ్య(45), అతని చిన్న కూతురు లత (18)లను శుక్రవారం హతమార్చిన సంగతి తెలిసిందే.

బాలయ్య పెద్ద కూతురు ఇటీవల ప్రేమ వివాహం చేసుకోవడంతో తమ కుటుంబం పరువు పోయిందని సైకోగా మారిన రవి.. అన్న కుటుంబంతో పాటు తన కుటుంబాన్ని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. శుక్రవారం బాలయ్యతో పాటు ఆయన చిన్న కూతురు లతతో పాటు తన సొంత కూతురు చందనను దోమకొండ శివారులోని మల్లన్న ఆలయ సమీపంలోకి తీసుకెళ్లాడు. అక్కడ కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి వారికి తాగించాడు. 

అనంతరం బ్లేడ్‌తో వారి గొంతు కోసి కిరాతకంగా హతమార్చాడు. ఆ తర్వాత అక్కడి నుంచి గూండ్ల చెరువు వద్దకు వెళ్లి గొంతు కోసుకుని, చెరువులో దూకాడు. అతడి మృతదేహం ఆదివారం ఉదయం బయట పడడంతో పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం కోసం తరలించారు. సైకోగా మారిన రవి కారణంగా రెండు కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. గ్రామానికి చెందిన నలుగురు మృత్యువాత పడడంతో భిక్కనూరులో విషాద ఛాయలు నెలకొన్నాయి. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు