చనిపోతూ ఇతరులకు ‘వెలుగు’

29 Jun, 2019 12:29 IST|Sakshi

కళ్లు దానం చేసిన కుటుంబ సభ్యులు

సాక్షి, భూదాన్‌పోచంపల్లి: మెయిన్‌ రోడ్డుపై ఉన్న గుంతను తప్పించే క్రమంలో బైక్‌పై నుంచి కింద పడిన సంఘటనలో తలకు గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోచంపల్లికి చెందిన యువకుడు శుక్రవారం ఉదయం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలోని భావనారుషిపేటకు చెందిన చొల్లోజు భిక్షపతి, అమృత దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో చిన్న కుమారుడైన  శివకృష్ణ (22) (అలియాస్‌ నాని) గ్రామంలోనే కార్పెంటర్‌ పని చేస్తున్నాడు. కాగా మున్సిపాలిటీ కేంద్రంలోని సాయిరామ్‌ థియేటర్‌ సమీపంలో మెయిన్‌రోడ్డుపై తరుచుగా వర్షపునీరు నిలవడంతో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి.

శివకృష్ణ ఈనెల 26న బైక్‌పై వెళ్తూ గుంతలను తప్పించే క్రమంలో కింద పడడంతో తలలోపల గాయమై రక్తం గడ్డకట్టింది. వెంటనే కుటుంబ సభ్యులు అదే రోజు రాత్రి స్థానికంగా ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో డాక్టర్‌ సలహా మేరకు హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ గురువారం డాక్టర్లు శివకృష్ణ తలకు శస్త్ర చికిత్సను విజయవంతం చేశారు. అనంతరం పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందాడు. కాగా కుటుంబ సభ్యులు జీవన్‌ధాన్‌ సంస్థకు శివకృష్ణ కళ్లను దానం చేశారు. పోస్ట్‌మార్టమ్‌ అనంతరం సాయంత్రం మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.      

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా