పెళ్లి ఇష్టలేక కిడ్నాప్‌ డ్రామా.. 

5 Sep, 2019 08:49 IST|Sakshi

లండన్‌ నుంచి వస్తుండగా ఎయిర్‌పోర్టులో కిడ్నాప్‌

అయినట్లు కుటుంబీకులకు ఫోన్‌

సాక్షి, శంషాబాద్‌: ఓ యువకుడు తాను కిడ్నాప్‌ అయి నట్లు సమాచారం ఇచ్చి తన కుటుంబసభ్యులతోపాటు పోలీసులను ఉరుకులుపరుగులు పెట్టించాడు. తీరా.. పోలీసుల దర్యాప్తులో అతడు డ్రామా ఆడినట్లు తేలింది. తన కుమారుడు ప్రవీణ్‌ మంగళవారం రాత్రి లండన్‌ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నాడని, అనంతరం అతడి జాడ లేకుండా పోయిందని మేడ్చల్‌ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడెంకు చెందిన శేషగిరిరావు ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లండన్‌ నుంచి వచ్చిన కొద్దిసేపటికి తనను క్యాబ్‌ డ్రైవర్‌ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి డబ్బులు, బంగారం దోచుకున్నాడని ప్రవీణ్‌ తమకు సమాచారం ఇచ్చాడంటూ కుటుంబసభ్యులు పోలీసులకు వివరించారు.

ప్రస్తుతం అతడు కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్నట్లు విచారణలో తేలింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అసలు ప్రవీణ్‌ అనే వ్యక్తి లండన్‌ నుంచి వచ్చినట్లు ఎలాంటి సమాచారమూ లేదని తేల్చేశారు. ప్రవీణ్‌ ఉద్దేశపూర్వకంగానే కుటుంబీకులనుు తప్పుదోవ పట్టించినట్లు పోలీసులు గుర్తించారు. రెండేళ్లుగా అతడు కర్ణాటకలోని కోలార్‌లో నివాసముంటూ కటుంబీకులకు మాత్రం లండన్‌లో ఉంటు న్నట్లు నమ్మించినట్లు నిర్ధారించారు. మరో పదిహేను రోజుల్లో ప్రవీణ్‌ వివాహం ఉండడంతో అతడు వివాహం ఇష్టలేక ఉద్దేశపూర్వకంగానే కుటుంబసభ్యులను తప్పుదోవ పట్టించినట్లు తెలుస్తోంది. ప్రవీణ్‌ చెప్పిన వివరాలన్నీ తప్పుడు సమాచారమేనని శంషాబాద్‌ ఏసీపీ అశోక్‌కుమార్‌ మీడియాకు వివరించారు. ఈమేరకు అతడిని అదుపులోకి తీసుకున్న తర్వాత మరింత సమాచారం రాబట్టనున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు