కరోనా భయంతో సాగర్‌లో దూకాడు

5 Jul, 2020 09:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా లక్షణాలతో పది రోజుల నుంచి బాధపడుతున్నాడు...చికిత్స చేయాలని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్లాడు. కానీ ఆ ఆస్పత్రిలో చేర్చుకునేందుకు వారు నిరాకరించి గాంధీకి వెళ్లమన్నారు. ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. తాను ఎన్నో రోజులు బతకలేనని భావించిన ఓ వ్యక్తి హుస్సేన్‌ సాగర్‌లో దూకి గల్లంతయ్యాడు. ఈ ఘటన రాంగోపాల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు.. వెస్ట్‌ బెంగాల్‌కు చెందిన పల్టుపాన్‌ (34)  కొద్ది సంవత్సరాల క్రితం భార్య రోమాపాన్‌తో సహా నగరానికి వచ్చి దూద్‌బౌలిలో స్థిరపడ్డారు. పల్టుపాన్‌ గోల్డ్‌స్మిత్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఆయన 10 రోజుల నుంచి జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నాడు. స్థానికంగా ఉండే ఓ క్లినిక్‌లో చికిత్స తీసుకుంటున్నా తగ్గలేదు.

అయితే అక్కడి వైద్యుల సూచన మేరకు గురువారం, శుక్రవారం చికిత్స కోసం మలక్‌పేట్‌లోని యశోద ఆస్పత్రికి వెళ్లారు. ఉదయం నుంచి రాత్రి వరకు రెండు రోజుల పాటు ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నా బెడ్లు లేవని చెప్పి అతన్ని ఆస్పత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించారు. తనకు శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది అవుతుందని కాళ్ల వేళ్ల పడినా కనికరించకుండా గాంధీ ఆస్పత్రికి వెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారు. శుక్రవారం సమస్య మరింత తీవ్రం కావడంతో పాటు శ్వాస తీసుకోవడానికి మరింత ఇబ్బంది వచ్చింది.  తీవ్ర భయాందోళనకు గురైన ఆయన శుక్రవారం సాయంత్రం తన స్నేహితుడు శ్రీరాములుకు ఫోన్‌ చేశాడు. అతడు రాగానే తనకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని హుస్సేన్‌ సాగర్‌ వద్దకు వెళితే చల్లటి గాలి వస్తుందని అక్కడికి తీసుకుని వెళ్లాలని కోరాడు.

దీంతో ఇద్దరు కలిసి రాత్రి 7.55 గంటల సమయంలో ఆటోలో ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు. ఆటోను ట్యాంక్‌బండ్‌పై ఉండే పూజా స్టాల్‌ లేపాక్షి మధ్యలో నిలిపి తాను కొద్దిసేపు అలా తిరిగి వస్తానని పల్టు పాన్‌ ముందుకు నడుచుకుంటూ వెళ్లి హుస్సేన్‌ సాగర్‌లో దూకాడు. వెంటనే శ్రీరాములు దీన్ని గమనించి రాంగోపాల్‌పేట్‌ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వాళ్లు అక్కడికి చేరుకుని నీళ్లలో గాలింపు చర్యలు చేపట్టారు. కానీ అతని ఆచూకీ మాత్రం తెలియలేదు.     

మరిన్ని వార్తలు