‘గూగుల్‌’ అధికార ప్రతినిధిగా.. 

14 Jul, 2019 10:09 IST|Sakshi
హైదరాబాద్‌లో ‘నాస్కమ్‌టెక్‌నగరే’ సదస్సులో రూ.3 లక్షల నగదు బహుమతి అందుకుంటున్న భానుప్రకాష్‌

ప్రపంచంలో 15 మందిలో భారతదేశం నుంచి చీళ్ల భానుప్రకాష్‌ 

సాక్షి, సత్తుపల్లి: గూగుల్‌ ఇంటర్నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ నోడ్‌జేఎస్‌ అధికార ప్రతినిధిగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామానికి చెందిన చీళ్ల భానుప్రకాష్‌కు అరుదైన గౌరవం దక్కింది. యూఎస్‌ ఆన్‌లైన్‌లో స్క్రీనింగ్‌ ద్వారా నాలుగు రౌండ్లలో జరిగిన ఇంటర్వ్యూలలో ఎంపిక జరిగింది. నోడ్‌కోర్‌ కమిటీ, నోడ్‌జేఎస్‌ ప్రోగ్రామింగ్‌ ప్రాసెస్‌ ప్రాబ్లం సొల్యూషన్స్‌ నూతన ఆవిష్కరణలు చేయటం వల్ల ఎంపికయ్యాడు. సుమారు 6 నెలలపాటు జరిగిన దశలవారీ ఎంపిక విధానంలో చీళ్ల భానుప్రకాష్‌ ప్రతిభ చూపటంతో ప్రపంచవ్యాప్తంగా 15 మందితో కూడిన గూగుల్‌ ఇంటర్నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌కు అధికార ప్రతినిధిగా భారతదేశం నుంచి ఎంపికయ్యాడు.

ప్రపంచ వ్యాప్తంగా జరిగే కాన్ఫరెన్స్, సెమినార్లకు హాజరయ్యేందుకు ట్రావెలింగ్, వసతి సౌకర్యాలతో పాటు రూ.1.50 లక్షలు గౌరవ వేతనంగా అందిస్తారు. నోడ్‌ జేఎస్‌ ఇంటర్నేషనల్‌ ప్రోగ్రామింగ్‌లో గూగుల్‌ సర్వర్‌సైడ్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ కోర్‌ కమిటీ సభ్యుడిగా అప్‌డేట్స్, ఛాలెంజెస్‌ సొల్యూషన్స్, నూతన ఆవిష్కరణలు చేస్తుంటాడు. ప్రస్తుతం హైద్రాబాద్‌లోని ఏడీపీ ఇండియా సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌లో అప్లికేషన్‌ డెవలపర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.  

‘మై ఫస్ట్‌ రెస్పాండర్‌’యాప్‌తో..  
చీళ్ల భానుప్రకాష్‌ సత్తుపల్లిలోనే ప్రాథమిక విద్య నుంచి బీఎస్సీ విద్యనభ్యసించాడు. ఎమ్మెస్సీ కంప్యూటర్స్‌ ప్రవేశ పరీక్షల్లో ఆంధ్రా యునివర్సిటీ నుంచి 4వ ర్యాంక్, కాకతీయ యూనివర్సిటీ నుంచి 56వ ర్యాంక్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 52వ ర్యాంక్, పాండిచేరి యూనివర్సిటీ నుంచి 2వ ర్యాంక్‌ సాధించాడు. 2010 నుంచి 2014 వరకు అరోరా కళాశాలలో ఎంసీఏ పోస్టు గ్రాడ్యూయేషన్‌ పూర్తి చేసి గోల్డ్‌మెడల్‌ సాధించాడు. ఏడీపీ ఇండియా డైరెక్టర్‌ బత్తుల పోల్‌రెడ్డి ఆర్థిక సహకారంతో ‘మై ఫస్ట్‌ రెస్పాండర్‌’యాప్‌ తయారు చేశాడు.

దీంతో ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎంబీఏ, తుపాన్లు, వరదలు, రోడ్లు ప్రమాదాల లాంటి 15 సమస్యలకు పరిష్కారాలకు ఈ యాప్‌ ద్వారా తెలియచేయవచ్చు. ఈ యాప్‌తో హైదరాబాద్‌లో జరిగిన ‘నాస్కమ్‌టెక్‌నగరే’ హ్యాథాన్‌ సదస్సులో రూ.3 లక్షల మొదటి బహుమతిని అందుకున్నాడు. జర్మనీ దేశంలోని ఐర్లాండ్‌లో గల డైరీ మాస్టర్‌ సంస్థ భానుప్రకాష్‌ను పీహెచ్‌డీ స్కాలర్‌ కింద ఎంపిక చేసింది.   

మరిన్ని వార్తలు