మహబూబ్‌నగర్‌లో ఆన్‌లైన్‌ మోసం 

3 Apr, 2019 15:26 IST|Sakshi

రుణాలు ఇప్పిస్తామని బ్యాంకు ఖాతాలో రూ.94వేలు అపహరణ 

ఆలస్యంగా ఫిర్యాదు  చేసిన బాధితుడు  

సాక్షి, మహబూబ్‌నగర్‌ క్రైం: రుణాలు ఇస్తామని చెప్పి.. బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకొని ఖాతాలో ఉన్న రూ.94వేల నగదును ఆన్‌లైన్‌ ద్వారా తస్కరించారు. బాధితులు మోసపోయామని తెలుసుకొని ఆలస్యంగా ఫిర్యాదు చేశారు. రూరల్‌ ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్‌ కాలనీకి చెందిన వెంకటరాములు వృత్తిరీత్య ఓ ప్రైవేట్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. జనవరి 3న వెంకటరాములు సెల్‌ఫోన్‌కు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి మేము మహీంద్ర ఫైనాన్స్‌ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామని చెప్పారు. మీ సెల్‌ నంబర్‌కు లక్కీడిప్‌ తగిలింది మా కంపెనీ నుంచి తక్కువ వడ్డీకి లోన్‌ ఇస్తున్నామని నమ్మించారు.

దీంతో బాధితుడు వెంకటరాములు రూ.6లక్షల రుణం కావాలని కోరాడు. దీంతో వారు అతని బ్యాంకు ఖాతా వివరాలు, జీతం వివరాలు అడగటంతో వివరాలన్నింటిని తెలిపాడు. ఆ తర్వాత మీ ఖాతాలో కనీసం రూ.35వేలు ఉండాలని చెప్పారు. ఆ తర్వాత వెంకటరాములు సెల్‌కు వచ్చిన మెసెజ్‌ వివరాలు తెలుసుకొని అతడి ఖాతాలో నుంచి రూ.34,999లను ఆన్‌లైన్‌ ద్వారా డ్రా చేశారు. ఆ వెంటనే బాధితుడు అదే నంబర్‌కు ఫోన్‌ చేసి నా ఖాతాలో డబ్బు కట్‌ చేశారని అడిగితే లోన్‌ వచ్చే సమయంలో రూ.6లక్షలతో పాటు ఇప్పుడు కట్‌ అయిన డబ్బు కూడా వస్తోందని చెప్పి ఫోన్‌ కట్‌ చేశారు. మళ్లీ జనవరి 4వ తేదీన బాధితుడు వెంకటరాములు అదే నంబర్‌కు ఫోన్‌ చేసి నాకు రూ.10లక్షల రుణం కావాలని అడిగాడు.

వారు ఒక ఖాతా నుంచి ఒకరికి మాత్రమే లోన్‌ ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత వెంకటరాములు మరో తెలిసిన వ్యక్తి నవనీత బ్యాంకు ఖాతా వివరాలు చెప్పాడు. దీంతో ఆ ఖాతాలో నుంచి కూడా రూ.60వేల నగదు కట్‌  చేసుకున్నారు. ఆ తర్వాత ఎన్నిసార్లు సంబంధిత సెల్‌ఫోన్లకు ఫోన్‌ చేసినా పని చేయలేదు. దీంతో ఈ నెల 26న రుణాలు ఇస్తామని మోసం చేసిన వ్యక్తులను అరెస్టు చేసినట్లు పలు దినపత్రికల్లో వచ్చిన కథనాలు చూసి బాధితుడు ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.  
  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా