అభాగ్యుడిని ఆదుకోరూ !

2 Aug, 2019 10:36 IST|Sakshi

సాక్షి, తుర్కపల్లి (ఆలేరు) : తుర్కపల్లి మండలం కొండాపూర్‌ గ్రామానికి చెందిన హన్మంత్‌ తొలుత వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. దిగుబడులు ఆశాజనకంగా లేకపోవడంతో కుటుంబ పోషణ నిమిత్తం 2004లో ఆటో కొని మండల కేంద్రం నుంచి స్వగ్రామానికి కిరాయికి నడుపుకునేవాడు. కాలక్రమంలో వ్యవసాయం పూర్తిగా కుంటు పడడంతో ఆటోనే జీవనధారంగా చే సుకుని బతుకుబండిని ముందుకు సాగించాడు.  

జీవనం సంతోషంగా సాగుతున్న తరుణంలో..
హన్మంత్‌ ఆటో నడుపుకుంటూ కుటుంబంతో సంతోషంగా సాగిపోతున్న తరుణంలో అనుకోని ఉపద్రవం వచ్చిపడింది.  అప్పటి వరకు ఎటువంటి శారీరక ఇబ్బందులు లేని హన్మంత్‌కు 2017లో హఠాత్తుగా  తీవ్రమైన వెన్నునొప్పి వచ్చి కుప్పకూలిపోవడంతో జీవితం అంధకారమయమైంది.

ఆరునెలల పాటు వైద్యం
హన్మంత్‌ రెండు కాళ్లు కదపలేని స్థితి, నడుము కింది భాగం పూర్తిగా స్పర్శ కోల్పోయాడు. దీంతో పాటు వెన్నుకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తడంతో హైదరాబాద్‌లోని ఖరీదైన ప్రైవేట్‌ ఆసుపత్రిల్లో వైద్యం అందించాల్సిన పరిస్థితి. చేతిలో ఉన్న డబ్బుతో వైద్యం అందించినా ఫలితం లేదు. 

పనిచేయని రెండు కాళ్లు
నడుం పై భాగం నుంచి కాళ్లు పూర్తిగా స్పర్శ కోల్పోవడంతో మల, మూత్ర విసర్జన కూడా మంచంవద్దే చేయాల్సిన పరిస్థితి. చేతిలో డబ్బులు లేకపోవడంతో ఎక్కడ ఈ వ్యాధికి ఉచితంగా వైద్యం చేస్తారంటే అక్కడికి తన భర్త హన్మంత్‌ను తీసుకువెళ్లి వైద్యం చేయిస్తుంది.

పిల్లల చదువులకు తీవ్ర ఇబ్బందులు
హన్మంత్‌ కుమారుడు మేడ్చల్‌ జిల్లా కీసరలో చదువుతున్నాడు ,ప్రస్తుతం కూతురు మనోజ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబ ఇంటి పెద్ద మంచానికే పరిమితమవడంతో ఆర్థిక పరిస్థితులు ఛిన్నాభిన్నమై పిల్లల చదువులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.  అనిత భర్తకు సపర్యలు చేసుకుంటు గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ బతుకుపోరాటం సాగిస్తోంది. 

ఎకరం పొలం విక్రయించి..
భర్త ఉన్నట్టుండి మంచానికే పరిమితంకావడంతో హన్మంత్‌ భార్య అనిత తట్టుకోలేకపోయింది. ఉన్న ఎకరం భూమిని విక్రయించి సుమారు రూ. 10లక్షలకు పైగా భర్తకు వైద్యానికి ఖర్చుచేసింది. అయినా భర్త కోలుకోకపోవడంతో కుమిలిపోతోంది. ఇంకా ఖరీదైన వైద్యం చేయాలని డాక్టర్లు సూచించడంతో బంధువుల వద్ద అప్పు చేసింది. అయినా పరిస్థితిలో మార్పు లేదు. ఖరీదైన వైద్యం చేస్తే తప్ప ఏమీ చేయలేయని డాక్టర్లు సూచిస్తుండడంతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. 

మరిన్ని వార్తలు