చికిత్స చేస్తేనే పీపీఈ కిట్లు 

3 Apr, 2020 02:44 IST|Sakshi

ఐసీయూ, మార్చురీల్లో ఉండే వారికే హైరిస్క్‌..

వారికే పూర్తిస్థాయి పీపీఈ కిట్లు అవసరం

కరోనా మృతదేహాన్ని తరలించడం లోరిస్కే..

సాధారణ వైద్యులకు 3 లేయర్ల మాస్కులు చాలంటున్న వైద్యాధికారులు

మార్గదర్శకాలు విడుదల చేసిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ

సాక్షి, హైదరాబాద్‌: కరోనా బాధితులకు చికిత్స చేసే డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి మాత్రమే పూర్తిస్థాయిలో పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్స్‌ (పీపీఈ) అవసరమని వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. సాధారణ వార్డుల్లో, ఇతర చోట్ల పనిచేసే వారికి అవి అవసరం లేదని వెల్లడించింది. కరోనా చికిత్స నేపథ్యంలో తమకు కిట్లు అందుబాటులో లేవంటూ కొందరు డాక్టర్లు, వైద్య సిబ్బంది చేస్తున్న వాదనలు కొట్టేస్తూ.. ఎవరికి ఏమేమి అవసరమన్న దానిపై మార్గదర్శకాలు విడుదల చేసింది. పీపీఈ కిట్లలో ఫేస్‌ షీల్డ్‌ గాగుల్స్, ట్రిపుల్‌ లేయర్‌ మెడికల్‌ మాస్కులు, ఎన్‌–95 మాస్క్‌లు, గ్లౌవ్స్, గౌన్స్, షూ కవర్స్, హెడ్‌ కవర్స్‌ ఉన్నాయి. ఇవన్నీ అందరికీ అవసరం లేదని మార్గదర్శకాల్లో సర్కారు తెలిపింది.

వారికి మాస్క్, గ్లౌవ్స్‌ చాలు.. 
ఓపీలో ఉండే వారికి, అనుమానితులు ఉండే ఐసోలేషన్‌ వార్డుల్లో పనిచేసే వారికి పూర్తిస్థాయిలో పీపీఈ కిట్లు అవసరం లేదని వైద్య, ఆరోగ్య శాఖ తేల్చి చెప్పింది. ఎన్‌–95 మాస్కులు, గ్లౌవ్స్‌లు ఉంటే సరిపోతుందని  పేర్కొంది. కరోనా మృతదేహాన్ని తరలించే సిబ్బందికి కూడా ఎన్‌ 95 మాస్క్‌లు, గ్లౌవ్స్‌ సరిపోతాయని తెలిపింది. కరోనా రోగుల వార్డుల్లో శానిటేషన్‌ చేసే వారికి, రోగుల బట్టలు ఉతికే వారికి కూడా గ్లౌవ్స్, ఎన్‌–95 మాస్కులు సరిపోతాయని తెలిపింది. క్షేత్రస్థాయిలో సర్వైలెన్స్‌ చేసే ఆశ కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు మూడు లేయర్ల మాస్క్‌లు ధరిస్తే చాలని తెలిపింది. క్షేత్రస్థాయిలో క్లినికల్‌ ఇన్వెస్టిగేషన్‌ చేసే వైద్య సిబ్బందికి ఎన్‌–95 మాస్క్‌లు, గ్లౌవ్స్‌ చాలని , క్వారంటైన్‌లో ఉన్న కరోనా అనుమానితులను పరీక్షించే డాక్టర్లకు కూడా ఎన్‌–95 మాస్కులు, గ్లౌవ్స్‌ సరిపోతాయని తెలిపింది.

వారి శరీర ఉష్ణోగ్రత చెక్‌చేసే వారికి, ఇతర సహాయకులకు గ్లౌవ్స్, మూడు లేయర్ల మాస్క్‌లు సరిపోతాయని పేర్కొంది. కరోనా మృతదేహాన్ని ఒకచోట నుంచి మరో చోటకు తీసుకెళ్లే వారికి, కరోనా చికిత్స చేసే గదుల్లో తరచుగా క్లీనింగ్‌ చేసే వారికి ఎన్‌–95 మాస్క్‌లు, గ్లౌవ్స్‌ సరిపోతాయని స్పష్టం చేసింది. కరోనా చికిత్స అందించే ఆస్పత్రుల్లో పనిచేసే అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్సియల్, ఇంజనీరింగ్, సెక్యురిటీ సిబ్బందికి ఎలాంటి రిస్క్‌ ఉండదని, వారికి ఎలాంటి మాస్క్‌లు, గ్లోవ్స్‌ అవసరం లేదని పేర్కొంది. ఔట్‌ పేషెంట్‌ విభాగంలో పనిచేసే వారికి మోడరేట్‌ రిస్క్‌ మాత్రమే ఉంటుందని, వారికి ఎన్‌–95 మాస్క్‌లు, గ్లౌవ్స్‌ సరిపోతాయని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌లో కేసులను చూసే వారికి ఎన్‌–95 మాస్క్‌లు, గ్లౌవ్స్‌ సరిపోతాయని స్పష్టంచేసింది.

హైరిస్క్‌లో ఉన్నవారికే పూర్తి కిట్లు.. 
గాంధీ, ఉస్మానియా, ఫీవర్, ఛాతీ తదితర కరోనా చికిత్స చేసే ఆసుపత్రుల్లో ఉన్న వారందరికీ పీపీఈ కిట్లు పూర్తిస్థాయిలో అవసరం లేదని సర్కారు తెలిపింది. హైరిస్క్‌లో ఉన్నవారికే అన్ని రకాల ఎక్విప్‌మెంట్లు అవసరమని తేల్చి చెప్పింది. క్రిటికల్‌ కేర్‌ ఐసీయూలో పనిచేసే వారికి, మృతదేహాన్ని ప్యాక్‌ చేసేవారికి, ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసేవారికి, అంబులెన్స్‌లో పేషెంట్‌ హెల్త్‌ కండీషన్‌ను పర్యవేక్షించే వైద్య సిబ్బందికి, వైద్య పరీక్షల కోసం పేషెంట్‌ వద్ద నమూనాలు సేకరించే వారికి, దాన్ని ల్యాబ్‌కు పంపేవారికి, ల్యాబ్‌లో శాంపిల్స్‌ను పరీక్షించే వారికి, పోస్ట్‌మార్టం చేసే సమయంలో డాక్టర్లకు మాత్రమే పూర్తి స్థాయిలో పీపీఈ కిట్లు అవసరమని తేల్చి చెప్పింది.

>
మరిన్ని వార్తలు