బినామీ పేరుపై ‘కల్యాణలక్ష్మి’

8 Nov, 2019 10:11 IST|Sakshi
బ్రోకర్లు ముద్రించిన వివాహ ఆహ్వాన పత్రిక

బోగస్‌ ధ్రువీకరణ పత్రాలతో కాజేసేందుకు యత్నం 

ఆలస్యంగా వెలుగులోకి ఘటన 

సాక్షి, ఖానాపూర్‌: దారిద్య్రరేఖకు దిగువన ఉన్న నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్రప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. కానీ ఉన్నతాధికారుల పర్యవేక్షణలోపం.. స్థానిక అధికారుల నిర్లక్ష్యం.. వెరసి పథకం అమలులో చోటు చేసుకుంటున్న లోపాలతో ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతుందని పలువురు పేర్కొంటున్నారు.

నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలంలోని సత్తన్‌పల్లిలో బినామి పేర్లతో కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసిన దళారులు అధికారులతో కుమ్మకై చెక్కును మంజూరు చేయించుకోవడంతో పాటు డబ్బులు స్వాహా చేసేందుకు ప్రయత్నించారనే బలమైన ఆరోపణలు ఇప్పుడు మండలంలో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన వివరాలిలా ఉన్నాయి.  

నలుగురు మనుషులు లేకున్నా ఉన్నట్లు సృష్టి 
సత్తన్‌పల్లి గ్రామంలోని దొమ్మటి రమ–వెంకటేశ్‌గౌడ్‌ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కూతురు లేదు. కాని కుటుంబ సభ్యులకు సంబందం లేకుండా గ్రామాలోని ఇద్దరు దళారులు ఆదంపతులకు కూతురు శ్యామల ఉన్నట్లు సృష్టించడంతో పాటు గ్రామంలో అసలే లేని పెళ్లికొడుకు, వారి తల్లిదండ్రులను కల్పితంగా సృష్టించి వివాహ ఆహ్వాన కార్డును ముద్రించారు.

ఇరువురికి గ్రామంలోనే గత సంవత్సరం డిసెంబర్‌ 14న వివాహం జరిగినట్టు సృష్టించి  కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేశారు. దీంతో గ్రామానికి చెందిన దొమ్మటి రమ పేరుపై చెక్కు మంజూరైంది. ఈ నెల 4న స్తానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే  చెక్కుల పంపిణీ సందర్భంగా ఈ తతంగం అధికారుల దృష్టికి వచ్చింది.  అధికారులు చెక్కును ఇవ్వకుండా లోలోపల సమస్య సమసిపోయేలా గోప్యత ప్రదర్శించారనే విమర్శలొచ్చాయి. రమ–వెంకటేశ్‌లు మాత్రం ఇందులో తమ ప్రమేయం ఏమీలేదన్నారు.  

అధికారుల తీరుపైనే అనుమానం.. 
గ్రామస్థాయిలోరెవెన్యూ అధికారి, మండల స్థాయిలో  గిరిధవార్‌లు క్షేత్రస్థాయిలో నిర్థారించి ప్రభుత్వానికి సిఫారసు చేస్తే చెక్కు మంజూరవుతుంది. కానీ అధికారులు మాత్రం పోర్జరీ చేసి దరఖాస్తు చేశారని, తమ ప్రమేయం లేదని దాటవేస్తున్నారు. ఈ విషయమై తహసీల్దార్‌ సత్యనారాయణను వివరణ కోరగా తహసీల్దార్‌ విజయారెడ్డి ఘటన జరిగినరోజు విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు.

ఉన్నతాధికారులకు ఇప్పటికే నివేదిక ఇచ్చామన్నారు. విధుల బహిష్కరణ సందర్భంగా ఇంకా విచారణ జరుపలేదన్నారు. పూర్తిస్థాయి విచారణ జరిపిన తర్వాత దోషులపై చట్టపరమైన చర్యలకోసం పైఅధికారులకు నివేదిస్తామన్నారు.     

మరిన్ని వార్తలు