మలేషియా నుంచి విడుదలైన జిల్లా వాసులు

13 Jul, 2019 10:19 IST|Sakshi
బోయిని సురేశ్‌, నరేశ్‌

నాలుగేళ్ల జైలు జీవితం నుంచి విముక్తి

ఎట్టకేలకు అవునూర్‌ గ్రామానికి చేరుకున్న యువకులు

సాక్షి, సిరిసిల్ల : బతుకుదెరువు కోసం పొరుగుదేశం వెళ్లిన వలస జీవులకు దుర్భర జీవితం నుంచి విముక్తి లభించింది. మలేషియా జైల్లో చిక్కుకుని నరకయాతన అనుభవించిన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం ఆవునూర్‌ గ్రామానికి చెందిన యువకులు ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. పండుగపూట ఇంటికి చేరుకుని కుటుంబసభ్యులను కలుసుకున్నారు. నాలుగేళ్ల క్రితం ఓ ఏజెంట్‌ మాటలు నమ్మి పనికోసం మలేషియా వెళ్లిన ఆవునూర్‌వాసులు బోయిని నరేశ్, బోయిని సురేశ్‌ నకిలీ వీసాతో అక్కడ నానా ఇబ్బందులు పడ్డారు. మలేషియా ప్రభుత్వం వీరిని జైల్లో ఉంచింది. ఐదు నెలలుగా స్వగ్రామంలో ఉంటున్న తల్లితో కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడలేని నిర్బంధ స్థితిలో ఉండిపోయారు.

వీళ్ల తండ్రి కూడా ఎడారి దేశంలో కూలీపని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబసభ్యుల యోగాక్షేమాలను తెలుసుకోలేనంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య నలిగిపోయారు. అదృష్టవశాత్తు వీళ్లు ఉంటున్న జైళ్ల నుంచి మరో వ్యక్తి ద్వారా ఆవునూర్‌లో ఉన్న తల్లికి సమాచారం అందింది. టీఆర్‌ఎస్‌ నాయకుడు కుంబాల మల్లారెడ్డికి విషయం తెలిసి సింగపూర్‌లో ఉంటున్న తనస్నేహితుడు ఏళ్ల రాంరెడ్డికి ఫోన్‌లో విషయం వివరించాడు. ఆయన వెంటనే స్పందించి మలేషియాలోని ఎమ్మిగ్రేషన్‌ అధికారులను సంప్రదించారు.

సదరు యువకుల విడుదలకు అవసరమైన అన్ని అధికారిక ఏర్పాట్లను చేయించారు. ఎట్టకేలకు సదరు యువకుల పాసుపోర్టు జారీఅయ్యాక ఈనెల 10న చెన్నైలో దిగారు. అక్కడి నుంచి రైలులో వరంగల్‌కు చేరుకుని శుక్రవారం ఆవునూర్‌ గ్రామానికి చేరుకున్నారు. విషయం తెలిసిన వెంటనే స్పందించిన రాంరెడ్డి కేవలం పదిరోజుల్లో అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసి నకిలీ ఏజెంట్ల చేతిలో మోసపోయిన యువకులను తిరిగి ఇంటికి రప్పించడంలో కృషి చేసినందుకు ప్రజాప్రతినిధులు అభినందించారు. వీసాల విషయంలో మోసపోకుండా ఉండాలని ఈ సందర్భంగా రాంరెడ్డి సూచించారు.  

మరిన్ని వార్తలు