ఎరువులు ప్రియం

11 Jun, 2017 01:03 IST|Sakshi
ఎరువులు ప్రియం

అన్నదాతపై భారం మోపేందుకు రంగం సిద్ధం
- వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమలు
- పన్ను తగ్గించాలని కోరుతున్న రైతు సంఘాలు
- పాత నిల్వల్ని పాత రేటుకే ఇవ్వాలని డిమాండ్‌


సాక్షి, హైదరాబాద్‌: రైతులపై ఎరువుల భారం మోపేందుకు రంగం సిద్ధమైంది. వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) నేపథ్యంలో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం నుంచే అన్ని రకాల ఎరువుల ధరలు పెరగనున్నాయి. ఇప్పటివరకు పన్నులు లేకుండా విక్రయిస్తున్న కొన్ని రకాల సూక్ష్మ పోషకాల ఎరువుల ధరలకు కూడా రెక్కలు రానున్నాయి. పెరిగిన ధరలు వచ్చేనెల ఒకటి నుంచి అమలవుతాయి. ఈ మేరకు ఎరువుల డీలర్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి. మరోవైపు పాత నిల్వల్ని పాత రేటుకే పంపిణీ చేయాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నెలాఖరులోగా కొనుగోలు చేసే వాటికే పాత ధరలు ఉంటాయని కంపెనీలు చెబుతున్నాయి. ఇప్పటికే కనీస మద్దతు ధర లేక కొట్టుమిట్టాడుతున్న రైతులను ఎరువుల ధరల పెంపు మరిన్ని నష్టాల్లోకి నెట్టేయనుంది.

ఇక యూరియా బస్తా రూ.315
కేంద్ర ప్రభుత్వం అత్యధిక సబ్సిడీతో ఇచ్చే 50 కిలోల యూరియా బస్తాపై గరిష్టంగా రు.17.68 పెరగనుంది. ప్రస్తుతం యూరియా బస్తా రూ.298 ఉండగా జూలై ఒకటి నుంచి అది రూ.315.68 కానుంది. ఇప్పటి వరకు పన్నులు లేకుండా ఎరువుల్ని విక్రయించిన తమిళనాడు, పంజాబ్, హరియాణా, గుజరాత్‌ సైతం ఇకపై ఈ ధరకే విక్రయించాల్సి ఉంటుంది. డై అమోనియం పాస్పేట్‌ (డీఏపీ), కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు కూడా పెరుగుతాయి. ప్రస్తుతం డీఏపీ బస్తా రూ.1,086.50 ఉండగా ఇకపై రూ.62 పెరిగి రూ.1,149 కానుందని కంపెనీలు చెబుతున్నాయి. డీలర్లు మాత్రం రు.76 పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

ఈ ఎరువుల ధరల ఉత్పత్తి వ్యయం ఆయా కంపెనీల సామర్థ్యం, స్థాపనను అనుసరించి ఉంటుంది. ఇఫ్కో, క్రిబ్కో వంటి కంపెనీల ధరలు కాస్త తక్కువగా, మద్రాస్‌ ఫెర్టిలైజర్స్‌ వంటి వాటి ధరలు కొంత ఎక్కువగా ఉంటాయి. తెలంగాణలో వానాకాలానికి 8 లక్షల మెట్రిక్‌ టన్నులు, యాసంగికి రూ. 5.5 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాను సరఫరా చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది. అలాగే వ్యవసాయ సీజన్‌కు 2.5 లక్షల డీఏపీని సరఫరా చేయాలని లక్ష్యంగా ప్రకటించింది. ఈ లెక్కన పెరిగే ధరలతో రైతులపై రూ.82.27 కోట్ల అదనపు భారం పడనుంది.

పురుగు మందులపై 18 శాతం పన్ను
దుక్కుల్లో వేసే జింక్, మెగ్నీషియం, ఇతరత్రా సూక్ష్మపోషకాలు, బయో ఫెర్టిలైజర్ల ధరలు సగటున 5.7 శాతం పెరగనున్నాయి. క్రిమిసంహారక మందులపై ఏకంగా 18 శాతం పెరుగుతాయని అంచనా. ఎరువులు, పురుగు మందులు, సూక్ష్మపోషకాలు అన్నింటి ధరలు పెరగడంతో రాష్ట్రంలో రైతులపై దాదాపు రూ.200 కోట్ల అదనపు భారం పడనుందని అంచనా వేస్తున్నారు. ఎరువులపై విధించే 12 శాతం పన్నుల్లో కేంద్రానికి 5, రాష్ట్రానికి 7 శాతం వస్తుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నోరెత్తడం లేదని రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. చెప్పులపై 12 శాతం పన్ను విధించినందుకు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంతో పోరాడి తగ్గించుకున్నారని, రాష్ట్ర ప్రభుత్వం కనీసం కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాసి ఎరువులపై పన్ను తగ్గించేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు