కలవరిమాయె..

5 Nov, 2014 03:34 IST|Sakshi

 ఖమ్మం వ్యవసాయం: జిల్లాలో సాగు చేసిన వరి వివిధ దశల్లో ఉంది. వాతావరణం అనుకూలించకపోవటంతో దీనికి చీడపీడలు ఆశించి నష్ట పరుస్తున్నాయి. వీటిని ఎలా నివారించాలో జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ జె.హేమంత్‌కుమార్ (99896 23813), డాక్టర్ ఎం.వెంకట్రాములు (89856 20346), డాక్టర్ ఆర్.శ్రీనివాసరావు (83329 51138) వివరించారు.

 సుడిదోమ
 గోధుమ వర్ణపు లేదా తెల్లమచ్చ దోమలు దుబ్బుల అడుగున నీటిమట్టంపై ఉండి దుబ్బుల నుండి రసాన్ని పీలుస్తాయి. పైరు సుడులు సుడులుగా ఎండిపోతోంది. దోమ ఆశించినప్పుడు పొలాన్ని అడపాదడపా ఆరబెట్టాలి. ప్రతి 2 మీటర్లకు 20 సెం.మీల బాటలు వదలాలి. దీని నివారణకు బుప్రొపెజిన్ 1.6 మి.లీ లేదా ఇతోఫెన్‌ప్రాక్స్ 2 మి.లీ లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్, ఎథిప్రొల్ 0.25 గ్రాములు లేదా మోనోక్రొటోఫాస్ 2.2 మి.లీ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయచాలి.

 కంకినల్లి
 కంకినల్లినే నల్లకంకి అని కూడా అంటారు. ఈ నల్లులు కంటికి కనబడని సూక్ష్మసాలీడు వర్గానికి చెందిన పురుగులు. ఇవి ఆశించిన ఆకులపై పసుపు రంగు చారలు ఏర్పడుతాయి. క్రమేపి ఆకుతొడిమెల లోపల, ఆకు ఈనెల్లో వృద్ధి చెందుతాయి. ఆకు అడుగు భాగం, ఈనెలు, ఆకు తొడిమలపై నల్లటి మచ్చలు ఏర్పడుతాయి. గింజలపైనా నల్లటి మచ్చలు ఏర్పడి పాలుపోసుకోక తాలు గింజలు అవుతాయి. దీని నివారణకు ప్రొఫెనోఫాస్ 2 మి.లీ లేదా డైకోపాల్ 5 మి.లీ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

 మెడవిరుపు తెగులు
 ఈ తెగులు సోకిన వరి ఆకులపై ముదురు గోధుమ రంగు అంచుతో మధ్యలో బూడిద రంగు నూలు కండె ఆకారపు మచ్చలు ఏర్పడుతాయి. ఈ తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు ఆకులు ఎండిపోయి తగులబడినట్లు కనిపిస్తాయి. వెన్నుల మెడ భాగంలో ఇది ఆశించటం వల్ల వెన్నులు విరిగి కిందకు వాలిపోతాయి. దీని నివారణకు ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు లేదా ఐసోప్రోథయొలేన్ 1.5 మి.లీ లేదా కాసుగామైసిన్ 2.5 మి.లీ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

 పొట్టకుళ్లు తెగులు
 పోటాకు తొడిమలపై నల్లని, లేదా ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి వెన్నులు పొట్టలో కుళ్లిపోతాయి. వెన్ను పాక్షికంగా మాత్రమే బయటకు వస్తుంది. వెన్నులు తాలు గింజలుగా ఏర్పడుతాయి. గింజలు రంగుమారుతాయి. రాత్రి ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండి, మంచుపడటం, వాతావరణం చల్లగా ఉండటం, గాలిలో తేమ ఎక్కువగా ఉంటే ఈ తెగులు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు పొట్ట దశలో ఒకసారి, వారం రోజుల తరువాత రెండోసారి  కార్బండిజమ్ లీటర్ నీటిలో గ్రాము చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

 మానిపండు తెగులు
 పూతదశలో గాలిలో ఎక్కువ తేమశాతం ఉన్న, మంచు లేదా మబ్బులతో కూడిన వర్షపు జల్లులు ఈ తెగులు వృద్ధికి దోహదపడుతాయి. అండాశయంలో ఈ శిలీంధ్రం పెరుగుదల వల్ల ఆకుమచ్చ రంగు ముద్దగా అభివృద్ధి చెందుతుంది. ఆ తర్వాత పసుపు రంగులోకి మారి చివరకు నల్లబడిపోతుంది. దీని నివారణకు ప్రొపికొనజోల్ 1మి.లీ లేదా కార్బండిజమ్ గ్రాము, లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 2.5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి వెన్నులు పైకి వచ్చు దశలో ఒకసారి, వారం రోజుల  తరువాత రెండోసారి పిచికారీ చేయాలి.
 

>
మరిన్ని వార్తలు