బ్లెస్సీ.. ఎక్కడున్నావ్‌?

27 Jul, 2019 11:54 IST|Sakshi

పిల్లి అదృశ్యమైందంటూ ఫిర్యాదు

పట్టి తెచ్చిన వారికి రూ.10 వేల బహుమతి ప్రకటించిన యజమాని

బంజారాహిల్స్‌: ఇంట్లో ముద్దుగా పెంచుకుంటున్న జంతువుల పట్ల నగరవాసుల మమకారం పెరుగుతోందనడానికి ఇదో ఉదాహరణ. తమ పెట్స్‌ కనిపించకపోతే తట్టుకోలేకపోతున్నారు. తిరుమలగిరి జూపిటర్‌ కాలనీకి చెందిన ఐటీ ఉద్యోగి రాజేశ్వరి తన పెంపుడు పిల్లి కనిపించకుండా పోయిందని, దాన్ని దత్తత తీసుకున్న వ్యక్తి నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని.. దాన్ని వెతికిపెట్టాలంటూ శుక్రవారంబంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ‘క్యాట్‌ మిస్సింగ్‌’ కింద కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తిరుమలగిరికి చెందిన రాజేశ్వరి కొంత కాలంగా బ్లెస్సీ ముద్దు పేరుతో రెండు నెలల వయసున్న పిల్లిని ముద్దుగా పెంచుకుంటున్నారు. దీనికి తోడుగా మరో పిల్లి కూడా ఉండటంతో త్వరగా జబ్బులు సంక్రమిస్తాయన్న కారణంగా ఓ పిల్లిని ఎవరికైనా దత్తత ఇవ్వాలని ఇటీవల పీపుల్‌ ఫర్‌ ఏనిమల్‌ సంస్థను సంప్రదించారు. చట్టప్రకారం దత్తత ఇవ్వవచ్చని ఆ సంస్థ చెప్పడంతో తన పిల్లిని దత్తత ఇస్తానని ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు. అది చూసి బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.3లోని శ్రీనికేతన్‌ కాలనీలో నివసించే యువకుడు ఆ పిల్లిని తాను దత్తత తీసుకుంటానని ఆమెను సంప్రదించాడు.

అలా ఈ నెల 13వ తేదీన రాజేశ్వరి తన బ్లెస్సీ(పిల్లి)ని యువకుడికి అప్పగించింది. అయితే, ఈ నెల 20వ తేదీన ఆ పిల్లికి వ్యాక్సినేషన్‌ ఇవ్వాల్సి ఉండడంతో గుర్తు చేసేందుకు సదరు యువకుడికి ఫోన్‌ చేయగా సరైన సమాధానం రాలేదు. దాంతో ఆమె ఆయన ఇంటికి వచ్చి పిల్లి ఏదని ప్రశ్నించగా ఆ రోజు కూడా అతడు సరైన సమాధానం చెప్పలేదు. దాంతో అనుమానం వచ్చిన ఆమె మూడు రోజుల పాటు తిరిగినా పిల్లి కనిపించలేదు. చివరాకరకు పిల్లి కనిపించడం లేదని సదరు యువకుడు చెప్పడంతో అక్కడే కుప్పకూలిపోయింది. తేరుకొని శుక్రవారం ఉదయం బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిందామె. దత్తత పిల్లిని పొగొట్టిన ఆ యువకుడిపై ‘క్రుయాలిటీ చట్టం’ కింద కేసు నమోదు చేయాల్సిందిగా ఆమె ఇన్‌స్పెక్టర్‌ను కోరారు. వైట్‌ అండ్‌ బ్లాక్‌ ఇండియన్‌ బ్రీడ్‌కు చెందిన ఈ పిల్లి అంటే తనకు ప్రాణమని బాగా చూసుకుంటానంటే ఇచ్చానని, ఆదానికి ఏ ఆహారం ఇష్టంగా తింటుందో.. ఏది పెట్టకూడదో ముందే జాగ్రత్తలు చెప్పినట్టు ఆమె పేర్కొన్నారు. తన పిల్లిని ఇతరులకు విక్రయించాడా..? కొట్టి చంపాడా..? సహజంగానే అదృశ్యమైందా అన్నదానిపై దర్యాప్తు చేపట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పిల్లిని పట్టి అప్పగించిన వారికి రూ.10 వేల బహుమతి కూడా ప్రకటిస్తూ మళ్లీ ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిందామె. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని పిల్లి కోసం గాలింపు చేపట్టి సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. 

మరిన్ని వార్తలు