42 మండలాల్లో ‘పెథాయ్‌’ పంట నష్టం 

19 Dec, 2018 01:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పెథాయ్‌ తుపాను కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. దాదాపు 6,168 ఎకరాల్లో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్‌లో తుపాను తీరం దాటే సమయంలో దాని ప్రభావం రాష్ట్రంలోని పలు జిల్లాలపై పడిందని, దీంతో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, జగిత్యాల, వరంగల్‌ రూరల్, భద్రాది కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లోని మొత్తం 42 మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వరి, మొక్కజొన్న, వేరుశనగ, ఆవాలు, పత్తి పంటలు పెథాయ్‌ తుపాను ప్రభావంతో వచ్చిన ఈదురు గాలులు, వర్షానికి దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. చేతికొచ్చిన వరి, మొక్కజొన్న పంటలే అధికంగా నీటిపాలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

పునరావాసం కల్పించండి: సీఎస్‌
పెథాయ్‌ తుపాను ప్రభావంతో గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర చలిగాలులు వీస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.  జిల్లాలకు అవసరమైన మందులు, దుస్తులు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారని సీఎస్‌ తెలిపారు. జిల్లా కలెక్టర్‌లు అప్రమత్తంగా ఉండి ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్నారు. అవసరమైతే జిల్లా ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సహాయం తీసుకోవాలని ఆదేశించారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు