రైతులను ముంచిన తుపాను

18 Dec, 2018 02:55 IST|Sakshi
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుబ్బగుర్తిలో పూర్తిగా నీట మునిగిన వరి పనలు

ఉమ్మడి ఖమ్మం, పెద్దపల్లి, వరంగల్‌ జిల్లాల్లో వర్షం 

సాక్షి ప్రతినిధి, ఖమ్మం/మంథని/సాక్షి, వరంగల్‌: పెథాయ్‌ తుపాను ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులను నట్టేట ముంచింది. చేతికొచ్చిన పంట వర్షం బారిన పడటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోసి ఆరబెట్టిన వరి పనలతోపాటు కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకెళ్లిన ధాన్యం కూడా తడిసిపోయింది. వరితో పాటు మిర్చి, పత్తి పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. మిరప పంట తడవటంతో తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఖమ్మం జిల్లాలో 4.1 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10.92 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తుపాను కారణంగా కురిసిన వర్షం పెద్దపల్లి జిల్లా మంథని మార్కెట్‌ను ముంచెత్తింది. డివిజన్‌ పరిధిలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది.  
 
ఉమ్మడి వరంగల్‌లో..  
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. చాలా చోట్ల కుప్పలుగా పోసిన వరిధాన్యం తడిసింది. వరి చేలు, మిరప తోటలు నేలవాలాయి. కొన్ని ప్రాంతాల్లో వాన నీటికి ధాన్యం కొట్టుకుపోయింది. పత్తి పంటకు కూడా నష్టం వాటిల్లింది.  

మరిన్ని వార్తలు