అద్దె బస్సుల టెండర్లపై హైకోర్టులో పిటిషన్‌

22 Oct, 2019 13:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ అద్దె బస్సుల టెండర్లను పిలవడాన్ని సవాలు చేస్తూ కార్మిక సంఘాలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. 1035 బస్సులను అద్దెకు తీసుకోవడం కోసం టెండర్లు ఆహ్వానిస్తూ ఆర్టీసీ యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఆర్టీసీకి బోర్డు లేకుండా ఎండీ టెండర్లు పిలవడం చట్ట విరుద్ధమని పిటిషనర్‌ ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు. కార్మికుల సమ్మెపై ఏ విషయం తేల్చకుండా శాశ్వత ప్రాతిపదికన అద్దె బస్సులు తీసుకుంటున్నారని పిటిషనర్‌ పేర్కొన్నారు.

అయితే ఆర్టీసీ తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్‌ జనరల్‌.. ఆర్టీసీ సొంత బస్సులను నడిపే పరిస్థితుల్లో లేదని కోర్టుకు తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు అద్దె బస్సులు తీసుకుంటున్నామని అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. ఈ పిటిషన్‌ను ఇప్పటివరకు ఆర్టీసీపై దాఖలై పెండింగ్‌లో ఉన్న పిటిషన్లతో కలపాలని ఆదేశించింది. అన్ని పిటిషన్లపై ఈ నెల 28న వాదనలు వింటామని తెలిపింది.

మరిన్ని వార్తలు