రూ.50 లక్షల పరిహారమివ్వాలి

27 Apr, 2019 02:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించడంతోపాటు, ఆత్మహత్యలకు బాధ్యులైన వారిపై క్రిమినల్‌ చర్యలకు ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది రాపోలు భాస్కర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.  ఇంటర్‌ పరీక్షలు రాసిన విద్యార్థులందరి జవాబుపత్రాలను పునర్‌ మూల్యాంకనం చేసేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు.  మూల్యాంకనం కాంట్రాక్ట్‌ పొందిన గ్లోబరీనా సంస్థ పూర్తి నిర్లక్ష్యంతో, బాధ్యతారాహిత్యంతో వ్యవహరించిందని, అంతిమంగా విద్యార్థులు నష్టపోయారన్నారు. పలువురు విద్యార్థులు తక్కువ మార్కులు వచ్చాయన్న భావనతో ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. 900లకు పైగా మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా ఫెయిల్‌ అయ్యారన్నారు. మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికలో గ్లోబరీనా సంస్థ నిర్వాకం వల్లే ఇదంతా జరిగిందంటూ పేర్కొన్నట్లు పత్రికల్లో వచ్చిందని వివరించారు.   

   

మరిన్ని వార్తలు