-

‘స్థానికం’లో బీసీ కోటా తగ్గదు 

12 Jul, 2018 01:47 IST|Sakshi
బుధవారం సచివాలయంలో ఉప సంఘం భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మంత్రి ఈటల రాజేందర్‌. చిత్రంలో జోగు రామన్న, జూపల్లి, తుమ్మల

      హైకోర్టు ఆదేశాలపై సుప్రీంలో పిటిషన్‌ 

     మంత్రివర్గ ఉపసంఘం భేటీలో తీర్మానం.. గ్రామాల్లో పాలనపై మంత్రివర్గంలో నిర్ణయం 

     బీసీ జనాభా గణనపైనా అక్కడే చర్చ 

సాక్షి, హైదరాబాద్‌: పంచాయతీరాజ్‌ సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లో 34 శాతానికి తగ్గకుండా చూడాలని మంత్రివర్గ ఉపసంఘం తీర్మానించింది. రిజర్వేషన్లు 50 శాతం మించొద్దని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేయాలని నిర్ణయించింది. బీసీ జనాభా గణన, నెలాఖరులో పాలక వర్గాల పదవీకాలం ముగిసిన తర్వాత పరిపాలన పరంగా చేసే ఏర్పాట్లపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని తీర్మానించింది. ‘స్థానిక’రిజర్వేషన్లపై హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం బుధవారం సచివాలయంలో సమావేశమైంది.

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, హరీశ్‌రావు, కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు బీసీ సంక్షేమ మంత్రి జోగు రామన్న ప్రత్యేకంగా హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్‌ నీతూప్రసాద్, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ రామచందర్‌రావు, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్‌రావులతో పలు అంశాలపై ఉపసంఘం చర్చించింది.

హైకోర్టు తీర్పు, బీసీ గణన, పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగిసిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చ జరిగింది. జూపల్లి మాట్లాడుతూ.. ‘సకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు శాఖ పరంగా అన్ని చర్యలు తీసుకున్నాం. రిజర్వేషన్లపై, బీసీ గణన అంశాలపై కొందరు కోర్టును ఆశ్రయించారు’అని పేర్కొన్నారు. రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉపసంఘానికి వివరించారు.  

కొందరు కోర్టుకెళ్లడంతో చిక్కులు: మంత్రులు 
సమావేశం అనంతరం మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, జోగు రామన్న మీడియాతో మాట్లాడారు. ‘2013 ఎన్నికల సందర్భంగా 61 శాతం రిజర్వేషన్లు కల్పించుకునే వెసులుబాటు సుప్రీంకోర్టు ఇచ్చింది. కానీ రిజర్వేషన్లు 50 శాతం మించొద్దంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంను ఆశ్రయించాలని నిర్ణయించాం. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్నికలను సకాలంలో నిర్వహించడం, స్థానిక సంస్థలను బలోపేతం చేయడం ప్రభుత్వ లక్ష్యం.

కానీ ఎన్నికలపై కొందరు కోర్టుల్లో కేసులు వేయడంతో చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తోంది. జూలై 31తో పంచాయతీ పాలక వర్గాల పదవీకాలం ముగుస్తోంది. ఆ తర్వాత ప్రత్యేక అధికారులకు అప్పగించాలా? పాలక వర్గాలకు అప్పగించాలా? కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. బీసీ జనాభా గణనపై హైకోర్టు తీర్పుపై ఎలా ముందుకు వెళ్లాలన్నదీ ఆ భేటీలోనే నిర్ణయిస్తాం. రిజర్వేషన్‌ అంశంపై రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరాం. దీనిపై మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది’అని తెలిపారు. \

మరిన్ని వార్తలు