ఇక పెట్రోల్‌ మంటే

6 Jul, 2019 14:44 IST|Sakshi

లీటర్‌పై రూ.2.69 పెంపు 

నగరంపై రూ. కోటిన్నరకు పైగా భారం  

సాక్షి, సిటీబ్యూరో : కేంద్ర బడ్జెట్‌ వాహనదారులకు వాత పెట్టింది. సామాన్యులకు మళ్లీ పెట్రో మంట అంటుకుంది. ఇప్పటికే  రోజువారి సవరణతో పెట్రో, డీజిల్‌ ధరలు పైసా పైసా ఎగబాకుతూ పరుగులు తీస్తుండగా.. బడ్జెట్‌లో సుంకాలు పెంపు మరింత భారంగా మారనున్నాయి. పెట్రోల్, డీజిల్‌ లీటర్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ, సెస్‌ రూపాయి చొప్పున బడ్జెట్‌లో పెంచారు. ఫలితంగా హైదరాబాద్‌లో పెట్రోల్‌పై రూ.2.69, డీజిల్‌పై రూ.2.65 అదనపు భారం పడింది. దాంతో ప్రస్తుతం పెట్రోల్‌ ధర లీటర్‌ రూ.74.88, డీజిల్‌ రూ.70.06 గా ఉన్నవి కాస్తా శుక్రవారం రాత్రి నుంచి పెట్రోల్‌ రూ.77.57, డీజిల్‌ రూ.72.71కు చేరాయి. హైదరాబాద్‌ పరిధిలో సుమారు 60.34 లక్షల వివిధ రకాల వాహనాలున్నాయి.

అందులో పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలు 44.04 లక్షలు, డీజిల్‌ బస్సులు, మినీ బస్సులు, కార్లు, జీపులు, టాక్సీలు, ఆటోలు, ట్రాక్టర్లు, ఇతరాత్ర వాహనాలు కలిపి సుమారు 20.30 లక్షల వరకు ఉంటాయని అంచనా. మహానగరం పరిధిలో సుమారు 560 పైగా పెట్రోల్, డీజిల్‌ బంక్‌లు ఉండగా, ప్రతిరోజు సగటున 40 లక్షల లీటర్ల పెట్రోల్, 30 లక్షల లీటర్ల డీజిల్‌  వినియోగమవుతోంది. తాజాగా కేంద్ర బడ్జెట్‌ నిర్ణయంతో గ్రేటర్‌లోని వాహనదారుల నుంచి రోజుకు సగటున రూ.కోటిన్నరకు  పైగా అదనపు భారం పడనుంది.  

పన్నుల మోతనే.. 
పెట్రో ధరల దూకుడుకు పన్నుల మోత, రవాణ చార్జీల బాదుడు కారణంగా కనిపిస్తోంది. పెట్రోల్‌ ఉత్పత్తుల అమ్మకాలపై వ్యాట్‌ పన్నుల విధింపు అధికంగానే ఉంది. నగరంలో పెట్రోల్‌పై 35.20 శాతం, డీజిల్‌ 27 శాతం  వ్యాట్‌ వసూలు చేస్తున్నారు. వాస్తవంగా పెట్రో ఉత్పత్తులపై  రెండు రకాల పన్నుల విధిస్తుండడంతో వినియోగదారుల జేబులు గుల్లవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వం విలువ ఆధారిత పన్ను(వ్యాట్‌) విధిస్తున్నాయి. 

ప్రజలపై పన్ను భారం తగదు 
ఇప్పటికే పెట్రో, డీజిల్‌ ధరలు రోజువారి సవరణతో పెచడం భారంగా మారింది. ఇప్పుడు కేంద్ర బడ్జెట్‌లో  సుంకాలు పెంపు మరింత భారమే. పెట్రో ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడి ఎక్సైజ్, అమ్మకం పన్ను వసూలు చేస్తున్నాయి.  ప్రభుత్వ ఖాజానా నింపేందుకు ప్రజలపై పన్ను బాదుడు తగదు.  జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్‌ ఉత్పత్తులు చేర్చితే ధరలు దిగి ఉపశమనం కలుగుతుంది. 
– బందగి బద్‌షా రియాజ్‌ ఖాద్రీ, చైర్మన్, ట్యాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా