పెట్రో ధరలు పైపైకి..

20 Jul, 2019 09:55 IST|Sakshi

పక్షం రోజుల్లో రూ.3కు పైగా పెంపు

మరింత పెరిగే అవకాశాలు

వాహనదారుల గగ్గోలు

పన్నుల మోత వల్లే ఈ పరిస్థితి

సాక్షి, సిటీబ్యూరో: మళ్లీ పెట్రోల్, డీజిల్‌ ధరల దూకుడు మొదలైంది. పైసా..పైసానే పెరుగుతూ రూపాయలకు చేరి వినియోగదారులకు షాక్‌ ఇస్తోంది. హైదరాబాద్‌ మహా నగరంలో తిరిగి ఆల్‌టైమ్‌ రికార్డు చేరువలోకి ఇంధనం ధరలు దూసుకు పోతున్నాయి. కేవలం ఇరవై రోజుల వ్యవధిలో పెట్రోల్‌పై రూ.3.07, డీజిల్‌ రూ.2.12 పెరిగింది. గతేడాది కాలంగా సార్వత్రిక ఎన్నికలు, ఇతరాత్ర కారణాలతో స్వల్ప హెచ్చు తగ్గులతో కొనసాగిన ధరలు.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ అనంతరం మళ్లీ విజృంభించాయి. తాజాగా శుక్రవారం హైదరాబాద్‌ నగరంలో పెట్రోల్‌ ధర లీటర్‌ రూ.77.90కు చేరగా.. డీజిల్‌ ధర  కూడా రూ.72.41కి ఎగబాకింది. గతేడాది మే  నెలలో పెట్రోల్‌ రూ.83.08, డీజిల్‌ రూ.75.34 తో ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. గత రెండేళ్ల నుంచి పెట్రో ఉత్పత్తుల æధరల రోజువారీ సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. రోజు రోజుకు  పైసల్లెక్కన ఎగబాకుతోంది. దీంతో ధరల దూకుడుకు కళ్లెం లేకుండా పోయింది. తాజాగా అంతర్జాతీయ మార్కెట్‌ను బట్టి ధరల దూకుడు మరింతగా ఉంటుందని విశ్లేషకులు వాఖ్యానిస్తున్నారు. పెట్రో ధరల దూకుడుకు పన్నుల మోత, రవాణా చార్జీ్జల బాదుడు కూడా కారణంగా  కనిపిస్తోంది. పెట్రోల్‌ ఉత్పత్తుల అమ్మకాలపై వ్యాట్‌ విధింపు అధికంగానే ఉంది. వాస్తవంగా పెట్రో ఉత్పత్తులపై  రెండు రకాల పన్నుల విధిస్తుండటంతో వినియోగదారుల జేబులు గుల్లవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ (విలువ ఆధారిత పన్ను) విధిస్తున్నాయి. ఆ తర్వాత మొత్తం ధరపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ మోత మోగిస్తోంది. దీంతో ఇంధన ధర మరింత పెరిగి వినియోగదారులకు భారంగా మారుతోంది.

వినియోగం అధికమే..
రాష్ట్రంలోనే నగరంలో పెట్రోల్, డీజిల్‌ వినియోగం అధికం. ఇక్కడి వాహనాలతో పాటు రోజు వారిగా బయటి నుంచి వచ్చి వేళ్లే వాహనాల్లో సైతం ఇంధనం నింపుకుంటారు.  అధికారికంగా గ్రేటర్‌ పరిధిలో 60.34 లక్షల వాహనాలు ఉన్నాయి. అందులో పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలు 44.04 లక్షలు, డీజిల్‌తో నడిచే బస్సులు, మినీబస్సులు, కార్లు, జీపులు, టాక్సీలు, ఆటోలు, ట్రాక్టర్లు, ఇతరాత్ర వాహనాలు కలిపి సుమారు వాహనాలు 20.30 లక్షల వరకు ఉంటాయన్నది అంచనా. మహానగరం పరిధిలో సుమారు 560 పైగా పెట్రోల్, డీజిల్‌ బంక్‌లు ఉండగా, ప్రతిరోజు సగటున 40 లక్షల లీటర్ల పెట్రోల్,  30 లక్షల డీజిల్‌ వినియోగమవుతోంది. దీంతో ఇంధన ధరల పెరుగుదల మరీ భారమవుతోంది.   

మరిన్ని వార్తలు