ధరల దూకుడు.. ఆగేదెప్పుడు!

28 Sep, 2019 10:24 IST|Sakshi

పెట్రోల్, డీజిల్‌ ధరలు పైపైకి..  

పెరుగుదల పైసల్లోనే అయినా రోజుకో రికార్డు

10 రోజుల్లో పెట్రోల్‌ లీటర్‌పై రూ.2.30, డీజిల్‌పై రూ.1.80 భారం

ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ రూ.79.02, డీజిల్‌ రూ.73.29గా నమోదు  

రోజువారి ధరల సవరణతో పెనుభారం

సాక్షి,సిటీబ్యూరో: మళ్లీ పెట్రోల్, డీజిల్‌ ధరలు దూకుడు పెంచాయి. రోజువారీ పెరుగుదల పైసల్లోనే ఉన్నా.. వైగంగా పైపైకి ఎగబాకుతూ రికార్డు సృష్టిస్తున్నాయి. సౌదీ అరేబియాలోని ఆయిల్‌ ప్లాంట్లపై డ్రోన్‌ దాడులతో   అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో పెరుగుతున్న క్రూడాయిల్‌ ధరల ప్రభావం పెట్రోల్, డీజిల్‌పై పడింది. కేవలం పది రోజుల్లో లీటర్‌ పెట్రోల్‌పై రూ.2.30, డీజిల్‌పై రూ.1.80గా పెరుగుదల నమూదైంది. వాస్తవంగా రోజువారీ ధరల సవరణ వినియోగదారుల పాలిట శాపంగా మారింది. ఇప్పటికే దేశంలో డీజిల్‌ ధర టాప్‌ గేర్‌లో పరుగెడుతుండగా.. పెట్రోల్‌ రెండో స్థానంలో పరుగులు తీస్తోంది. 2017 జూన్‌ వరకు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ధరలు సమీక్షించిన చమురు సంస్థలు.. తర్వాత ఆ విధానానికి స్వస్తి పలికాయి. మార్కెట్‌ ధరలకు అనుగుణంగా ఏ రోజుకారోజు ధరలను నిర్ణయిస్తూ వస్తున్నాయి. నూతన విధానం అమల్లోకి వచ్చిన తొలి పదిహేను రోజుల్లో ధరలు తగ్గగా.. ఆ తర్వాత క్రమంగా విజృంభిస్తున్నాయి. పెట్రో ఉత్పత్తుల ధరల దూకుడుకు పన్నుల మోత, రవాణ చార్జీల ప్రభావం కనిపిస్తోంది. 

రికార్డుకు చేరువలో పెట్రోల్‌
ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.79.02కు చేరింది. పదిరోజుల క్రితం రూ.76.72గా «ఉన్న ధర.. తర్వాత పైసల్లోనే పెరుగుతోంది. డీజిల్‌ ధర సైతం అదేస్థాయిలో పరుగులు పెడుతోంది. సరిగ్గా పదిరోజుల క్రితం రూ.71.49 ఉన్న డీజిల్‌ లీటర్‌ ప్రస్తుతం రూ.73.29కి చేరింది. రెండేళ్ల క్రితం ధరల సవరణ సమయంలో డీజిల్‌ లీటర్‌ రూ.59.30కి చేరిన ధర.. ఆ తర్వాత పెరుగుతునే ఉంది. 

మహానగరంలో వినియోగం ఇలా..  
హైదరాబాద్‌ మహా నగరంలో పెట్రో/డీజిల్‌ వినియోగం రోజురోజుకు పెరగుతోంది. నగరంలో సుమారు 60.50 లక్షలకు పైగా వాహనాలు ఉండగా, మరో 10 లక్షల వరకు వాహనాల వరకు నగరానికి రాకపోకలు సాగిస్తుంటాయి. నగర వ్యాప్తంగా మూడు ప్రధాన ఆయిల్‌ కంపెనీలకు చెందిన సుమారు 540 వరకు పెట్రోల్, డీజిల్‌ బంకులు ఉండగా వాటి ద్వారా నిత్యం సుమారు 65 లక్షల లీటర్ల పెట్రోల్, 40 లక్షల లీటర్ల డీజిల్‌ అమ్ముడవుతోంది. ఆయిల్‌ కంపెనీల టెర్మినల్స్‌ నుంచి ప్రతిరోజు పెట్రోల్‌ బంకులకు 150 నుంచి 170 ట్యాంకర్ల ఇంధనం సరఫరా అవుతోంది. ఒక్కో ట్యాంకర్‌ సామర్థ్యం సగటున 12 వేల నుంచి 20 వేల లీటర్లు ఉంటుంది. 

మరిన్ని వార్తలు