పెట్రోలు, డీజిల్ భారం నెలకు రూ.27.15 కోట్లు

1 Jul, 2014 05:02 IST|Sakshi
పెట్రోలు, డీజిల్ భారం నెలకు రూ.27.15 కోట్లు

సాక్షి, సిటీబ్యూరో: పెట్రో, డీజిల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. గ్రేటర్‌లోని వాహనదారులపై తాజాగా అదనపు భారం పడింది. పెట్రోల్‌పై డీజిల్ ధరలు పెంచుతూ చమురు సంస్థలు సోమవారం నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్ లీటర్‌పై 1.69 పైసలు, డీజిల్‌పై 50 పైసలు పెంచగా గ్రేటర్ హైదరాబాద్‌లో స్థానిక పన్నులు కలుపుకొని లీటర్ పెట్రోల్‌పై రూ.2.21 పైసలు, డీజిల్‌పై 62 పైసలు పెరిగినట్లయింది.

సోమవారం అర్ధరాత్రి నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. పెరిగిన ధరలతో మొత్తం పెట్రోల్ వినియోగదారులపై రోజుకు రూ.70.72 లక్షల చొప్పున నెలకు రూ.21.21 కోట్ల భారం పడనుంది. అదేవిధంగా డీజిల్ వినియోగదారులపై రోజుకు రూ.19.80 లక్షలు చొప్పున నెలకు రూ. 5.94కోట్ల భారం పడుతుంది.
 
నగరంలో 450పైగా బంకులు..
 
మహానగరం పరిధిలో సుమారు 450పైగా పెట్రోల్, డీజిల్ బంక్‌లు ఉన్నాయి. ఇందులో సుమారు 45.47 లక్షల వరకు వివిధ రకాల వాహనాలు ఉన్నాయి. పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర, ఇతరత్రా వాహనాలు 33.54 లక్షలు, డీజిల్‌తో నడిచే బస్సులు, మినీబస్సులు, కార్లు, జీపులు, టాక్సీలు, ఆటోలు, ట్రాక్టర్లు, ఇతరత్రా వాహనాలు కలిపి సుమారు 11.93 లక్షల వరకు ఉంటాయన్నది అంచనా.  రోజుకు సగటున 32 లక్షల లీటర్ల పెట్రోల్, 33 లక్షల డీజిల్  వినియోగమవుతోంది. ఈ లెక్కనా పెరిగిన ధరతో వినియోగదారుల జేబులకు భారీగానే చిల్లు పడనుంది.
 

>
మరిన్ని వార్తలు