పెట్రో రికార్డు

30 May, 2018 08:41 IST|Sakshi

దేశంలోనే తెలుగు రాష్ట్రాల్లో డీజిల్‌ ధర టాప్‌ 

పెట్రోలు ధరలో ముంబయి తర్వాత ఏపీ, తెలంగాణ 

హైదరాబాద్‌లో ఐదేళ్ల క్రితం నాటి పెట్రోలు ధర బ్రేక్‌ 

ఆల్‌టైమ్‌ రికార్డును గత వారమే అధిగమించిన ఏపీ 

సాక్షి, సిటీబ్యూరో : దేశంలోనే తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్‌ ధరలు కొత్త రికార్డు సృష్టిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్‌ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు డీజిల్‌ ధరలో దేశంలోనే మొదటి స్థానంలో ఉండగా...పెట్రోల్‌ ధరలో రెండు, మూడో స్థానాల్లో నిలిచాయి. ఐదేళ్ల క్రితం నాటి పెట్రోల్‌ ధర ఆల్‌టైమ్‌ రికార్డును ఏపీ గత పదిరోజుల క్రితమే అధిగమించగా.. తాజాగా హైదరాబాద్‌ అధిగమించింది. పెట్రో ఉత్పత్తుల ధరల రోజువారీ సవరణ ప్రక్రియ అనంతరం తొలిసారిగా గత పక్షం రోజుల నుంచి  రికార్డు స్థాయిలో ధరలు ఎగబాకుతున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా వరసగా 19 రోజులు పెట్రోల్‌ ధరల ఉత్పత్తుల ధరల సవరణ జోలికి వెళ్లని  చమురు సంస్థలు పోలింగ్‌ ముగియగానే విజృంభించాయి. దీంతో ధరల దూకుడుకు కళ్లెం లేకుండా పోయింది. 

ఆల్‌టైం రికార్డు 
హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర ఆల్‌టైమ్‌ రికార్డును సృష్టించింది. సరిగ్గా ఐదేళ్ల క్రితం 2013 సెప్టెంబర్‌ నెలలో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.83.07తో ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించగా.. తాజాగా మంగళవారం నాటికి రూ.83.08కు చేరి రికార్డును బ్రేక్‌ చేసింది. ఏపీలో మాత్రం గత పదిరోజుల క్రితమే ఆల్‌టైమ్‌ రికార్డును అధిగమించింది. ప్రస్తుతం అమరావతిలో లీటర్‌ పెట్రోల్‌ రూ.86.24 పైసలకు చేరింది. ఇక డీజిల్‌ ధర గత నెల రోజుల క్రితమే ఆల్‌టైమ్‌ రికార్డును అధిగమించి దేశంలోనే టాప్‌గా మారా యి. ప్రస్తుతం ఆమరావతిలో డీజీల్‌ లీటర్‌ ధర రూ 76.57, హైదరాబాద్‌లో 75.54కు చేరింది. మరో పక్షం రోజులపాటు ధరల దూకుడు ఇలాగే ఉంటుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

పన్నులు అధికమే... 
పెట్రో ధరలపై పన్నుల మోత ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్‌ ధరల్లో దాదాపు సగానికిపైగా పన్నుల వడ్డింపు ఉంది. మొత్తం ధరల్లో పెట్రోల్‌పై 57 శాతం, డీజిల్‌పై 44 శాతం పన్ను పోటే ఉంది. వాస్తవంగా పెట్రోల్, డీజీల్‌పై కేంద్ర ప్రభుత్వం సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ పన్ను మోత మోగుతోంది. సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ కింద పెట్రోల్‌పై రూ.21.48 పైసలు, డీజిల్‌పై  రూ.17.33 పైసలు వడ్డింపు విధిస్తున్నారు. తెలంగాణలో రాష్ట్ర వ్యాట్‌ కింద పెట్రోల్‌పై 35.20 శాతం, డీజిల్‌ 27 శాతం పన్ను విధిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌పై 31 శాతం వ్యాట్‌ విధిస్తున్నప్పటికీ ప్రతి లీటర్‌పై రూ.4 అదనపు వ్యాట్‌ వసూలు చేస్తుండటంతో 38.82 శాతానికి చేరింది. డీజిల్‌పై 22.25 శాతం పన్ను, ప్రతి లీటర్‌పై నాలుగు రూపాయలు అదనపు వ్యాట్‌ వసూలు చేస్తుండటంతో 30.71 శాతం పడుతోంది. 

మెట్రో నగరాల్లో  ధరలు  ఇలా.. 

                  పెట్రోల్‌ (లీటర్‌)            డీజిల్‌ (లీటర్‌)
ముంబయి      రూ. 86.24               రూ.73.79 
అమరావతి     రూ. 84.61               రూ.76.57 
చెన్నై            రూ.81.43                రూ. 73.18
హైదరాబాద్‌     రూ.83.08                రూ.75.34 
కోల్‌కతా         రూ.81.06                రూ.71.86 
బెంగళూరు      రూ. 79.71                రూ.70.50
న్యూఢిల్లీ         రూ.78.43                 రూ.69.31

 హైదరాబాద్‌లో ధరల దూకుడు ఇలా 
  నెల                 పెట్రోల్‌    డీజిల్‌ (లీటర్‌) 

మే–2018           83.08    75.34 
ఏప్రిల్‌–  2018     78.08    70.16 
మార్చి–  2018    75.79    67.63 
ఫిబ్రవరి– 2018    77.36    69.65 
జనవరి–2018     74.09    64.86 
డిసెంబర్‌–2017    73.29    63.44 
నవంబర్‌–2017    73.20    62.72 
అక్టోబర్‌– 2017     74.93    64.02 
సెప్టెంబర్‌–2017    73.34    62.06 
ఆగస్టు–2017      69.24    60.38 
జూలై–2017        69.02    58.08 

మరిన్ని వార్తలు