పెట్రో ట్యాంకర్ల సమ్మె విరమణ

31 May, 2016 04:09 IST|Sakshi
పెట్రో ట్యాంకర్ల సమ్మె విరమణ

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలియం, ఎల్పీజీ రవాణాపై 14.5 వాల్యూ యాడెడ్ ట్యాక్స్(వ్యాట్) విధించడాన్ని నిరసిస్తూ చేపట్టిన సమ్మెను విరమిస్తున్నట్లు తెలంగాణ పెట్రోలియం ట్యాంకర్ల ఓనర్స్ అసోసియేషన్ సోమవారం సాయంత్రం ప్రకటించింది. పన్ను మినహాయింపుపై చర్చించేందుకు ప్రధాన చమురు సంస్థల ప్రతినిధులు మంగళవారం రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌మిశ్రాతో సమావేశం కానున్నారు. సమ్మె ఫలితంగా ఆదివారం అర్ధరాత్రి  నుంచి ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన ఏడు టెర్మినల్స్ నుంచి సుమారు మూడు వేల ట్యాంకర్లు కదలలేదు.

చమురు సంస్థల అధికారులు ట్యాంకర్ల ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సోమవారం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. పెట్రో ఉత్పత్తుల రవాణాపై వ్యాట్‌ను భరించడంతోపాటు బకాయిలు చెల్లించేందుకు చమురు సంస్థలు అంగీకరించాయి. దీంతో సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ట్యాంకర్ల ఓనర్స్ అసోసియేషన్  ప్రకటించింది. కాగా, చమురు సంస్థల ప్రతినిధులు వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్‌తో సమావేశమయ్యారు. పెట్రో ఉత్పత్తులపై రవాణా పన్ను భరించేందుకు హామీ ఇవ్వడంతో ట్యాంకర్ల ఓనర్స్ సమ్మె విరమించారని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. పన్నులో మినహాయింపు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరగా రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీతో సమావేశం ఏర్పాటుకు అనిల్ కుమార్ అంగీకరించారు.

మరిన్ని వార్తలు