పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లకు ఎంసీఐ గుర్తింపు

29 Dec, 2014 02:35 IST|Sakshi
  • పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లకు ఎంసీఐ గుర్తింపు
  • మరో 86 పీజీ సీట్లకు ప్రతిపాదనలు పంపిన ప్రభుత్వం
  • సాక్షి, హైదరాబాద్: మౌలిక సదుపాయాలు, ఇతర వసతులు లేకపోవడంతో.. మంజూరైనా ఇప్పటివరకు గుర్తింపు లేకుండా ఉన్న 49 సూపర్ స్పెషాలిటీ, స్పెషాలిటీ పీజీ సీట్లకు గుర్తింపునిస్తూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిర్ణయం తీసుకుంది. అందులో సూపర్ స్పెషాలిటీ సీట్లు 8 ఉండగా... బ్రాడ్ స్పెషాలిటీ పీజీ సీట్లు 41 ఉన్నాయి. సూపర్ స్పెషాలిటీ సీట్లలో ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన ఎంసీహెచ్ పీడియాట్రిక్ సర్జరీ సీట్లు 6, గాంధీ మెడికల్ కాలేజీకి చెందిన ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ సీట్లు 2 ఉన్నాయి.

    ఇక బ్రాడ్ స్పెషాలిటీ పీజీ సీట్లలో ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన ఎంఎస్ జనరల్ సర్జరీ సీట్లు 11, ఎండీ అనస్థీషియా సీట్లు 9, ఎండీ బయో కెమిస్ట్రీ 4, ఎండీ డీవీఎల్ 4, ఎంఎస్ ఆర్థోపెడిక్స్ 3, ఎండీ ఫోరెన్సిక్ మెడిసిన్ 3, ఎండీ రేడియోథెరపీ 2, ఎండీ మైక్రో బయాలజీ 2, ఎండీ ఫార్మకాలజీ 2 సీట్లు గుర్తింపు పొందాయి. కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన ఎండీ డీవీఎల్‌కు చెందిన ఒక్క సీటుకు కూడా ఎంసీఐ గుర్తింపునిచ్చింది. వాస్తవంగా ఈ సీట్లకు వచ్చే ఏడాది మే నెల నాటికి గుర్తింపు తెచ్చుకోవాలని ఎంసీఐ ఆదేశించింది.

    అయితే గడువుకు ముందే అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర వసతులు కల్పించి తెలంగాణ ప్రభుత్వం గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలావుండగా రాష్ట్రానికి అదనంగా మరో 86 పీజీ మెడికల్ సీట్లు మంజూరు చేయాలని కోరుతూ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు తయారుచేసి పంపింది. అందులో ఉస్మానియా మెడికల్ కాలేజీకి 47, గాంధీ మెడికల్ కాలేజీకి 13, వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీకి 26 సీట్లు కావాలని ప్రతిపాదించింది. ఇవి గనుక మంజూరైతే ఈ మూడు కాలేజీల్లో ప్రస్తుతం ఉన్న 516 సీట్లకు కలిపితే మొత్తం 602 పీజీ సీట్లు కానున్నాయి.
     

మరిన్ని వార్తలు