పీజీ సెట్ నోటిఫికేషన్ విడుదల

11 Apr, 2016 20:08 IST|Sakshi
కేయూ క్యాంపస్ (వరంగల్) : కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలో వచ్చే విద్యాసంవత్సరం 2016-2017లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు గాను సోమవారం నోటిఫికేన్ విడుదలైంది. ఈ పీజీ సెట్‌కు అడ్మిషన్ల ప్రక్రియలో తొలిసారిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించబోతున్నారు. ఈనెల 12వ తేదీ నుంచి విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని కాకతీయ యూనివర్సిటీ అడ్మిషన్ల డెరైక్టర్ ప్రొఫెసర్ ఎం.కష్ణారెడ్డి, జాయింట్ డెరైక్టర్లు డాక్టర్ వెంకయ్య, డాక్టర్ జె.లక్ష్మణ్‌నాయక్ సోమవారం వెల్లడించారు. 
 
అభ్యర్థులు మీసేవా లేదా ఏపీ ఆన్‌లైన్ సెంటర్, ఇంటర్నెట్ సెంటర్ ద్వారా కేయూ అడ్మిషన్ల వెబ్‌సైట్ www.kakatiya.ac.in లేదా www.kudoa.in ద్వారా దరఖాస్తులను అప్‌లోడ్ చేయాలన్నారు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫీజును కూడా క్రెడిట్ కార్డు, డిబెట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చన్నారు. ఓసీ, బీసీ విద్యార్థులకు రిజస్ట్రేషన్ ఫీజు రూ.400, ఎస్సీ, ఎస్టీ, వికలాంగ విద్యార్థులు ఫీజు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. అడ్మిషన్లకు సంబంధించిన నియమ నిబంధనలు వెబ్‌సైట్‌లో ఉంచారు. 
 
అపరాధ రుసుము లేకుండా మే 3వ తేదీ వరకు, రూ.600 అపరాధ రుసుముతో మే 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ విధానంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే ఆన్‌లైన్ అప్లికేషన్ హెల్ప్‌లైన్ కేంద్రం నంబర్లు 90524 565721, 99856 66721కు ఫోన్ చేయవచ్చని అడ్మిషన్ల డైరెక్టర్ తెలిపారు. మే చివరి వారంలో పీజీ కోర్సుల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నామని, ప్రవేశ పరీక్షల సమయంలో విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారానే తమ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
మరిన్ని వార్తలు