న్యూయార్క్‌కు ఫణిగిరి శిల్పం  

18 May, 2019 01:21 IST|Sakshi
విరిగిన గీతలు కనిపిస్తూ పాతది ఇలా, మరమ్మతు అనంతరం శిల్పం ఇలా

అంతర్జాతీయ ప్రదర్శనకు ఎంపిక

స్మగ్లర్ల నిర్లక్ష్యంతో మూడు ముక్కలుగా విరిగిన శిల్పం

వెంట్రుక మందం గీత కూడా కనిపించకుండా పూర్వ వైభవం

సాక్షి, హైదరాబాద్‌: అది నాలుగు అడుగుల శిల్పం. వయసు దాదాపు 1800 సంవత్సరాలు. బుద్ధుడి జీవితాన్ని మూడు ఘట్టాలుగా విభజించి అద్భుతంగా చెక్కిన కళాఖండం. సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో లభించిన ఈ శిల్పం ఇప్పుడు ఆమెరికా గడ్డమీద అంతర్జాతీయ పర్యాటకులకు కనువిందు చేయబోతోంది. దేశంలోనే గొప్ప బౌద్ధ స్థూపమున్న ప్రాంతాల్లో ఒకటిగా వెలుగొందుతున్న సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో లభించిన క్రీ.శ. రెండో శతాబ్దం నాటి సున్నపురాయి శిల్పాన్ని విదేశీ ఎగ్జిబిషన్‌లకు ఢిల్లీలోని నేషనల్‌ మ్యూజియం ఎంపిక చేసింది. ‘ది మెట్రోపాలిటన్‌ మ్యూజియమ్స్‌ ఆఫ్‌ ఆర్ట్‌ (ది మెట్‌)’150వ వార్షికోత్సవాన్ని అమెరికాలోని న్యూయార్క్‌లో నిర్వహిస్తోంది.

స్థానిక మెట్రోపాలిటన్‌ మ్యూజియంలో వచ్చే ఏడాది జరగబోయే ఈ వేడుకలో ‘ట్రీ అండ్‌ సర్పెంట్‌’పేరుతో బుద్ధుడి ఇతివృత్తంగా ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ మ్యూజియాల్లో ఉన్న బుద్ధుడికి సంబంధించిన అరుదైన కళాఖండాలను ఇందులో ప్రదర్శనకు ఉంచాలని నిర్ణయించింది. ఈమేరకు మన దేశం నుంచి కొన్నింటిని ఎంపిక చేయాల్సిందిగా ఆ సంస్థ ఢిల్లీలోని నేషనల్‌ మ్యూజియంను కోరింది. దీంతో రంగంలోకి దిగిన నేషనల్‌ మ్యూజియం.. ఏరికోరి హైదరాబాద్‌ స్టేట్‌ మ్యూజియంలో ఉన్న బుద్ధుడి జీవితగాథను ప్రతిబింబించే శిల్పాన్ని ఎంపిక చేసింది. ఈ పురాతన విగ్రహాన్ని న్యూయార్క్‌కు పంపేలా ఏర్పాట్లు చేయమని హెరిటేజ్‌ తెలంగాణకు సూచించింది. దీంతో హెరిటేజ్‌ అధికారులు అనుమతి కోరుతూ రాష్ట్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డిసెంబరులో ఈ శిల్పాన్ని న్యూయార్క్‌కు పంపనున్నారు. 

విదేశీ నిపుణులతో పూర్వ వైభవం! 
నాలుగు అడుగుల ఎత్తున్న ఈ శిల్పాన్ని ఇక్ష్వాకుల కాలంలో రూపొందించారు. ఫణిగిరి బౌద్ధ స్థూపం పరిసరాల్లో 2001లో చేపట్టిన తవ్వకాల్లో ఇది వెలుగు చూసింది. సున్నపురాయితో రూపుదిద్దుకున్న ఈ శిల్పం బుద్ధుడి జీవిత పరమార్థాన్ని 3విభాగాలుగా వివరిస్తూ రూపొందింది. రాజమందిరంలో ఉండటం సరికాదని నిర్ధారించుకుని సిద్ధార్థుడు అడవికి వెళ్లిపోవటం, బుద్ధుడిగా మారి జీవిత పరమార్థాన్ని వివరిస్తూ తన బోధనలను విశ్వవ్యాప్తం చేయటం, తుదకు స్వర్గానికి చేరుకోవటం. శిల్పుల పనితీరు కూడా అద్భుతంగా ఉండటంతో అదిసాధారణ శిల్పం కాదని అప్పట్లోనే తేలిపోయింది. దీంతో దీనిపై స్మగ్లర్ల దృష్టి పడింది. అది లభించిన చోటే తాత్కాలికంగా ప్రదర్శనకు ఉంచటంతో, రాత్రి వేళ కొందరు స్మగ్లర్లు ఆ విగ్రహాన్ని అపహరించారు. గోనెపట్టాల్లో చుట్టి లారీలో సూర్యాపేట మీదుగా దాచేపల్లి తరలించి ఓ ఇంట్లో డ్రైనేజీ సంపులో దాచారు. ఈ క్రమంలో అది మూడు ముక్కలైంది. అప్పట్లోనే ఈ శిల్పం ఖ్యాతి అంతటా వ్యాపించడంతో.. ఈ చోరీ అంశాన్ని నాటి రాష్ట్రపతి కార్యాలయం కూడా తీవ్రంగా పరిగణించింది. దీంతో 2004లో నాటి రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని దొంగల వేట ప్రారంభించి చివరకు పట్టుకుంది. 

హైదరాబాద్‌ స్టేట్‌ మ్యూజియంలో.. 
తర్వాత ఆ శిల్పానికి స్థానిక పద్ధతులతో మరమ్మతు చేయించి హైదరాబాద్‌ స్టేట్‌ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టింది. రెండేళ్లక్రితం ప్రధాని నరేంద్ర మోదీ లండన్‌ పర్యటన సమయంలో.. బ్రిటిష్‌ మ్యూజియం ప్రతినిధులు ఆయనతో భేటీ అయ్యారు. భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించి 7దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా అంతర్జాతీయ ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ముంబై ఛత్రపతి శివాజీ మ్యూజియం, ఢిల్లీ నేషనల్‌ మ్యూజియంలతో కలిసి సంయుక్తంగా మూడు ప్రాంతాల్లో ఈ ప్రదర్శన ఏర్పాటుకు అనుమతి కోరారు. దీనికి మోదీ సరేననడంతో 2017 నవంబరులో ముంబైలో 3నెలల పాటు, గతేడాది ఢిల్లీలో 3నెలల పాటు ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శన కోసం ఫణిగిరి శిల్పాన్ని ఎంపిక చేశారు. కానీ విరగడంతో తిరిగి అతికించినట్టు స్పష్టంగా కనిపించటంతో శిల్పంలో లోపం స్పష్టంగా కనిపించింది. భవిష్యత్తులో అది లండన్, న్యూయార్క్‌ల్లో ప్రదర్శనకు తరలేందుకు అవకాశం ఉండడంతో.. ఆ విగ్రహానికి అంతర్జాతీయ ప్రమాణాలతో మరమ్మతు చేయించాలని నిర్ణయించారు. దీంతో ఈ మధ్యే ముంబైలో విదేశీ పరిజ్ఞానంతో నిపుణులు అందంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం దానిపై ఎక్కడా వెంట్రుక మందంలో కూడా గీతలు కనిపించకుండా పూర్వవైభవం కల్పించారు. 

రూ.3 కోట్లకు బీమా 
ఇటీవల దాన్ని ముంబైకి అక్కడి నుంచి ఢిల్లీకి తరలించే క్రమంలో హెరిటేజ్‌ తెలంగాణ ఈ విగ్రహానికి రూ.2 కోట్లకు బీమా చేయించింది. ఇప్పుడు న్యూయార్క్‌కు తీసుకెళ్లేక్రమంలో రూ.3 కోట్లకు బీమా చేయించనున్నట్టు సమాచారం. కిందపడ్డా విరగకుండా దాన్ని ప్రత్యేకంగా ప్యాక్‌ చేయించనున్నట్టు ఢిల్లీ మ్యూజియం అధికారులు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు