అంతర్జాతీయ స్థాయిలో ఫార్మాసిటీ

24 Jul, 2014 01:25 IST|Sakshi
అంతర్జాతీయ స్థాయిలో ఫార్మాసిటీ

ఏడువేల ఎకరాల్లో ఏర్పాటు
ఫార్మా కంపెనీల ప్రతినిధులతో కేసీఆర్

 
హైదరాబాద్: తెలంగాణలో అంతర్జాతీయ స్థాయిలో ఏడు వేల ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఫార్మాసిటీని నిర్మిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. బుధవారం ఆయన సచివాలయంలో ఫార్మాకంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రస్తుతం పరిశ్రమ పరిస్థితి, భవిష్యత్తు, ఈ రంగంలో ఉన్న అవకాశాల మీద చర్చించారు. ఈ రంగంలో చైనా, భారతదేశాలే అభివృద్ధి చెందాయని, దేశంలో ఇప్పటికే తెలంగాణ అగ్రగామిగా ఉందని, మరింత అభివృద్ధి సాధించేం దుకు తెలంగాణలోనే ఎక్కువ అవకాశాలున్నాయని వివరిం చారు. రైలుమార్గం, జాతీయ రహదారి, నీటివసతి అందుబాటులో ఉన్న చోట ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామన్నారు. వీటికి తోడు నిరంతరాయంగా 500 మెగావాట్ల విద్యుత్ అందించేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. ఫార్మాసిటీకి అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

కాలుష్యరహిత పారిశ్రామిక విధానానికి అనుగుణంగానే ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఐదు వేల ఎకరాల్లో పరిశ్రమలను, రెండు వేల ఎకరాల్లో ఆయా పరిశ్రమల్లో పనిచేసే వారికి కాలనీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఫార్మా అనుబంధ కంపెనీలు కూడా ఇక్కడే ఉంటాయని, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న పరిశ్రమలను కూడా ఫార్మాసిటీకే తరలించాలని సూచించారు. ఫార్మాసిటీ ఏర్పాటైతే ఐదు లక్షల మందికి ఉపాధి లభించనుందని, వారందరూ నివసించేందుకు వీలుగా టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేస్తామని సీఎం చెప్పారు. ఫార్మా వ్యవహారాలను పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ అధికారిని నియమించే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఫార్మా విధానం అత్యుత్తమంగా ఉందో పరిశీలించాలని అధికారులకు సూచించారు. అంతర్జాతీయ కన్సల్టెంట్లతో ఫార్మాసిటీ డిజైన్‌ను తయారు చేయించాలని నిర్ణయించారు. సమావేశంలో డ్రగ్ ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు జయంత్ ఠాగూర్, ప్రధానకార్యదర్శి ఆర్.కె.అగర్వాల్, సీఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగరావు పాల్గొన్నారు.
 
 

మరిన్ని వార్తలు