ఫార్మా సిటీ భూముల పరిశీలన

9 Mar, 2018 12:43 IST|Sakshi
భూములను పరిశీలిస్తున్న కేంద్ర బృందం

ముచ్చర్లలో స్థానిక అధికారులతో కలిసి పర్యటన

ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనుల్లో వేగం

 ఇప్పటికి 7,581 ఎకరాల భూమి సేకరించిన ప్రభుత్వం

 రూ.363 కోట్ల పరిహారం చెల్లింపు

భూసేకరణ వివరాలివీ.. 
కేటగిరీ    ఎకరాలు    లబ్ధిదారులు     
జీఓ 45 ప్రకారం    5,650.34    2,008 
జీఓ 123 ప్రకారం    710.18    360 
2017 భూసేకరణ చట్టం    618.04    295     
ఆక్రమణదారులు    206.23    327 
ఇవిగాకుండా.. అక్రమార్కుల చెర నుంచి 395 ఎకరాలను వెనక్కి తీసుకున్న రెవెన్యూయంత్రాంగం టీఎస్‌ఐఐసీకి బదలాయించింది. 


సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రపంచస్థాయి ఔషధనగరి(ఫార్మాసిటీ) స్థాపనకు కీలక అడుగు పడింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ప్రతినిధుల బృందం గురువారం ప్రతిపాదిత ఫార్మాసిటీ భూములను పరిశీలించి.. సందేహాలను నివృత్తి చేసుకుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టును 19,930 ఎకరాల్లో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముచ్చర్ల కేంద్రంగా కందుకూరు, కడ్తాల, యాచారం మండలాల్లో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీతో జిల్లా రూపు రేఖలు సంపూర్ణంగా మారిపోతాయని సర్కారు భావిస్తోంది. ఈ క్రమంలో 2014 చివరలో అంకురార్పణ జరిగిన ఈ ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పట్టాలెక్కించాలని సంకల్పించింది. న్యాయపరమైన అవరోధాలు అధిగమించి.. మొదటి దశకు సరిపడా భూసేకరణ ప్రక్రియ పూర్తికావడంతో ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రాజెక్టు పనులకు ముహూర్తం పెట్టాలని యోచిస్తోంది.

ఈ నేపథ్యంలో ఔషధనగరి ఏర్పాటుకు అవసరమైన కీలక అనుమతులను పొందడంపై దృష్టిసారించింది. ఈ ప్రాజెక్టుకు నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న టీఎస్‌ఐఐసీ ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియను ముగించడంతో తాజాగా కేంద్ర ప్రభుత్వం అటవీ, పర్యావరణ అనుమతులపై క్షేత్రస్థాయిలో పర్యటించింది. నేరుగా ప్రతిపాదిత ప్రదేశానికి హెలికాప్టర్‌లో వచ్చిన ఆయా శాఖల కార్యదర్శులు, ఇతర అధికారుల బృందం.. ఫార్మారంగంతో ఎదురయ్యే పరిణామాలు, కాలుష్య ఉద్గారాలు రాకుండా తీసుకునే చర్యలు, పర్యావరణంపై ప్రభావం తదితర అంశాలను అధికారులతో చర్చించింది.

అంతేగాకుండా భూసేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులను కూడా అడిగి తెలుసుకుంది. ఫార్మాసిటీకి ‘నిమ్జ్‌’ హోదా దక్కడంతో కేంద్ర ప్రభుత్వం గ్రాంట్‌ రూపేణా భారీగా నిధులు విడుదల చేస్తోంది. ఈ క్రమంలో ప్రతిపాదిత ప్రాంతంలో మౌలిక వసతుల కల్పన, ఉద్యోగుల నివాసగృహాల నిర్మాణం మొదలైన విషయాలను పరిశ్రమల కార్యదర్శి జయేశ్‌రంజన్, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డిని అడిగి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఫార్మా కంపెనీల ఏర్పాటుకు స్థానికుల నుంచి ఏలాంటి అభ్యంతరమూ వ్యక్తం కాలేదని, అక్కడక్కడా ఒకరిద్దరు పరిహారం తీసుకున్నవారే.. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గళం విప్పారని అధికారుల దృష్టికి తెచ్చినట్లు సమాచారం. 

రూ.363.23 కోట్లు చెల్లింపు.. 
ఔషధనగరి (ఫార్మాసిటీ)కి ప్రభుత్వం ఇప్పటివరకు రూ.363.23 కోట్లు వెచ్చించింది.  7581.14 ఎకరాల భూమిని సేకరించి ఈ మేరలో పరిహారం రూపేణా భూములు కోల్పోయిన వారికి డబ్బులు చెల్లించింది. మేడిపల్లి, కుర్మిద్ద, నానక్‌నగర్, తాడిపర్తి, మీర్‌ఖాన్‌పేట, ముచ్చర్ల, పంజాగూడ, కొత్తూరు, మహమ్మద్‌నగర్, తిమ్మాయిపల్లి, కందుకూరు, ముద్విన్, కర్కల్‌పహాడ్, కడ్తాల్‌లో ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం భూములను సమీకరించింది.

జీఓ 45, 123, రాష్ట్ర భూ సేకరణ చట్టం–2017 కింద భూములను తీసుకుంది. ఇవేగాకుండా ఆక్రమిత ప్రభుత్వ భూములను కూడా స్వాధీనం చేసుకుంది. తద్వారా ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు మార్గం సుగమం చేస్తోంది. అయితే, భూసేకరణ తీరును సవాల్‌ చేస్తూ భూ నిర్వాసితులు కొందరు న్యాయస్థానానికెక్కడంతో కొన్ని గ్రామాల్లో సేకరణ ప్రక్రియ నిలిచిపోయింది. ఇలాంటి చోట్ల 2017 చట్టం ప్రకారం భూములను తీసుకునేందుకు రెవెన్యూయంత్రాంగం కసరత్తు చేస్తోంది.  


ఏరియల్‌ సర్వే, మ్యాపుల పరిశీలన


  హెలికాప్టర్‌తో సర్వే

కందుకూరు: ముచ్చర్లలో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీ భూముల్లో కేంద్ర పర్యావరణ బృందం గురువారం పర్యటించింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ప్రత్యేక హెలికాప్టర్‌లో కేంద్రం పర్యావరణ మంత్రిత్వశాఖ కార్యదర్శి గుప్తా, అదనపు కార్యదర్శి వర్మ, రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డితో కలిసి మొదట ఏరియల్‌ సర్వే చేశారు. అనంతరం 2.15 గంటలకు ముచ్చర్ల రెవెన్యూ సర్వే నంబర్‌ 288లోని భూమిలో దిగారు. వ్యూ పాయింట్‌ వద్దకు చేరుకుని దాదాపుగా  గంటకు పైగా పరిశీలించారు. మ్యాపులను చూసి వివరాలను జాయింట్‌ కలెక్టర్‌ సుందర్‌ అబ్నార్‌తో పాటు రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సర్పంచ్, రైతులు, ప్రజలు ఎక్కడ అని బృందంలోని సభ్యులు ప్రశ్నించగా అధికారులు నీళ్లు నమిలినట్లు సమాచారం. అనంతరం 3.20 గంటలకు కేంద్ర బృందం హెలికాప్టర్‌లో తిరిగి వెళ్లిపోయింది. కాగా ఎల్‌బీనగర్‌ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఉదయం నుంచే దాదాపుగా 200 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఫార్మాసిటీలోకి వెళ్లే దారులను దిగ్బంధించారు. వచ్చి పోయే వారిని క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు పొలాలకు వెళ్లే రైతులను సవాలక్ష ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా