రూ.8 వేల కోట్లతో ఫార్మాసిటీ

12 Dec, 2016 14:51 IST|Sakshi
రూ.8 వేల కోట్లతో ఫార్మాసిటీ

రంగారెడ్డిలో 12,500 ఎకరాలు సేకరించాలని పరిశ్రమల శాఖ ఆదేశం
తొలి దశలో 5 వేల ఎకరాలు సేకరించాలని నిర్ణయం
అంతర్గత మౌలిక సదుపాయాలకు రూ.1,600 కోట్ల ఖర్చు

 సాక్షి, హైదరాబాద్: దేశంలో మరెక్కడా లేనివిధంగా పెద్ద ఎత్తున ఫార్మా సిటీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. దాదాపు రూ.8 వేల కోట్ల వ్యయంతో అంతర్జాతీయ స్థారుులో ‘హైదరాబాద్ ఫార్మా సిటీ లిమిటెడ్’ పేరిట జాతీయ పెట్టుబడుల ఉత్పత్తుల కేంద్రం(నిమ్జ్)ను ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఏకంగా 12,500 ఎకరాల్లో ఫార్మా సిటీ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంలో టీఎస్‌ఐఐసీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించాలని పేర్కొన్నారు.

ఇప్పటికే ఫార్మా సిటీ ఏర్పాటుకు సంబంధించి సమగ్ర నివేదికను రూపొందించే బాధ్యతను సింగపూర్ సంస్థకు అప్పగించారు. ఇటీవల పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరా మారావుకు సింగపూర్ సంస్థ ప్రెజెంటేషన్ రూపంలో ప్రాథమిక నివేదిక కూడా అందజేసింది. ఫార్మాసిటీలో అంతర్గత మౌలిక సదుపాయాల కోసం రూ.1,600 కోట్లు(20 శాతం) ఖర్చు చేయాలని తన నివేదికలో ప్రతిపాదించింది. ఫార్మా సిటీ ఏర్పాటు ద్వారా దాదాపు రూ.64 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. అట్లాగే ప్రత్యక్షంగా 1.3 లక్షల మందికి ఉద్యోగాలు, పరోక్షంగా 3.25 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని భావిస్తోంది. మరోవైపు ఫార్మాసిటీ మాస్టర్ ప్లానింగ్ డిజైన్ కోసం ప్రభుత్వం రూ.30 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిసింది.

తొలి దశలో 5 వేల ఎకరాల సేకరణ
తొలి దశలో 5 వేల ఎకరాలను సేకరించాలని, 2017 మార్చి నాటికి ఫార్మా కంపెనీలకు భూమిని కేటారుుంచాలని పరిశ్రమల శాఖ ప్రణాళిక రూపొందించింది. మొదటి దశలో హడ్కోనుంచి రూ.550 కోట్లు రుణం తీసుకోవాలని నిర్ణరుుంచింది. ఫార్మాసిటీలో ఫార్మా యూనివర్సిటీ, నైపుణ్యాభివృద్ధి శిక్షణా సంస్థ, ఇంక్యూబేషన్ సెంటర్‌ను నెలకొల్పాలని ఆ శాఖ అధికారులు యోచిస్తున్నారు. ఫార్మా సిటీలో కంపెనీలు నెలకొల్పేందుకు 200 సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు చెబుతున్నారు. ఫార్మాసిటీకి సంబంధించి పూర్తి వివరాలను నాలుగైదు రోజుల్లో పరిశ్రమల మంత్రి కేటీఆర్ వెల్లడించనున్నట్లు పరిశ్రమల శాఖ వర్గాలు పేర్కొన్నారుు.

మరిన్ని వార్తలు