రోగుల నిలువు దోపిడీ 

6 Mar, 2019 03:02 IST|Sakshi

భారీగా ధరలుపెంచి మందుల విక్రయాలు

కొన్ని కంపెనీల మందులు 3 వేల శాతం లాభాలతో అమ్మకాలు

అందులో అత్యధికంగా కేన్సర్‌సహా వివిధ ప్రమాదకర వ్యాధులకు చెందినవే

90 శాతం మందులు షెడ్యూల్‌ జాబితాలో లేకపోవడంతో నియంత్రణ కరువు

కేంద్రానికి విన్నవించిన పలు స్వచ్ఛంద సంస్థలు... కొన్నింటి ధరలు తగ్గింపు  

సాక్షి, హైదరాబాద్‌: మందుల కంపెనీలు ధరలు పెంచి ప్రజలను ముంచుతున్నాయి. వందలు వేల శాతం వరకు పెంచి భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇలా కంపెనీలు ఇష్టారాజ్యంగా మందుల ధరలను పెంచి ప్రజారోగ్యాన్ని బజారులో సరుకుగా చేస్తున్నాయి. దీనిపై నిజామాబాద్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ వ్యవస్థాపకులు పి.ఆర్‌.సోమాని పెద్దఎత్తున ఉద్యమానికి తెరలేపారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా కేంద్రంలోని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వేటి ధరలు ఎంతెంత పెరిగాయన్న దానిపై ఆయన ఒక అధ్యయన పత్రం తయారు చేశారు. కొన్ని కంపెనీలు 3 వేల శాతం వరకు మందుల ధరలు పెంచేసి ప్రజలను దోపిడీకి గురిచేస్తున్నాయని ఆయన తన అధ్యయన పత్రంలో పేర్కొన్నారు. 11 వేల రకాల మందులు మూడువేల శాతం అధిక ధరకు విక్రయిస్తున్నారని ఆయన విశ్లేషించారు. అధిక ధరలకు విక్రయించే మందుల్లో కేన్సర్‌సహా వివిధ ప్రమాదకర వ్యాధులకు చెందినవే ఉండటం గమనార్హం. దేశంలో మందుల ధరలను అదుపులో ఉంచేందుకు తగిన డ్రగ్‌ పాలసీ లేకపోవడంతో మందుల తయారీదారులు రెచ్చిపోయి ఇష్టారీతిన ధరలను ముద్రిస్తున్నారన్న విమర్శలున్నాయి. లైఫ్‌ సేవింగ్‌ డ్రగ్స్‌తోపాటు శస్త్రచికిత్స కోసం ఉపయోగించే ఉపకరణాలపై కూడా అధిక మొత్తంలో ధరలను ముద్రించి పేద ప్రజలను దోచుకుంటున్నాయని ఆ నివేదికలో వెల్లడించారు. ఆయన విడుదల చేసిన నివేదిక ప్రకారం...  

8 రూపాయల మందు 160 రూపాయలకు 
సిన్‌వాక్స్‌ 25టీ అనే మందు హోల్‌సేల్‌ ధర ఎనిమిది రూపాయలు కాగా, దాన్ని రూ.160కు రిటైల్‌గా అమ్ముతున్నారు. అంటే 2001 శాతం అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఇక అబ్బోట్‌ కంపెనీ న్యూకోల్డ్‌ ట్యాబ్లెట్‌ హోల్‌సేల్‌ ధర రూ. 2.20. కానీ మార్కెట్లో రూ. 39.80కు విక్రయిస్తున్నారు. అంటే ఏకంగా 1,809 శాతం అధిక ధరకు విక్రయిస్తున్నారు. సిప్లా కంపెనీకి చెందిన ఒకాసెట్‌–ఎల్‌ను కంపెనీ రూ. 3.70 విక్రయిస్తుంటే, రిటైల్‌ వ్యాపారులు మాత్రం రూ.57కు విక్రయిస్తున్నారు. అంటే 1,540 శాతం అధిక ధర. ఎమ్‌క్యూర్‌ కంపెనీకి చెందిన కార్‌బెటా ఇంజక్షన్‌ ధర రూ. 8.50 కాగా, మార్కెట్లో రూ.130కు విక్రయిస్తున్నారు. రిలయన్స్‌ సంస్థకు చెందిన డయాలసిస్‌ ఇంజక్షన్‌ ఇరెత్రొపోయిటిన్‌–ఐపీ 4000 ఐయూను రూ.150కు కొనుగోలుచేసి, వాటిపై రూ.1,400 ధర ముద్రిస్తున్నారు. అంటే 933 శాతం అధిక ధరతో మార్కెట్లో అమ్ముతున్నారు. ఐవీ సెట్‌ పది రూపాయలకు అమ్మాల్సింది రూ.150కు విక్రయిస్తున్నారు. అంటే 1,500 శాతం అధికం. మందుల ధరలు అధికంగా ఉండటం, ప్రాణాంతక వ్యాధులకు చెందిన వాటిపై భారీగా వసూలు చేయడంతో పేదలు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం మనదేశంలో 2018లో 8 లక్షల మంది కేన్సర్‌తో చనిపోయారు. 2040 నాటికి ఆ సంఖ్య రెట్టింపు కానుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటువంటి ప్రాణాంతక వ్యాధులకు చెందిన మందులనూ భారీ ధరలకు అమ్ముతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని కుటుంబాలైతే వైద్యంకోసం, మందుల కోసం ఆస్తులు అమ్ముకుంటున్నాయి. అప్పుల పాలవుతున్నాయి. 

చట్టం బలహీనంగా ఉండటమే: సోమాని 
చట్టంలోని లొసుగులను ఉపయోగించుకొని మందుల కంపెనీలు ప్రజలను దోచుకుంటున్నాయని, ప్రతి ఏడాది రూ. లక్ష కోట్ల ప్రజాధనం దోపిడీకి గురవుతుందని నిజామాబాద్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు పీఆర్‌ సోమాని ఆరోపించారు. మందుల విక్రయాల్లో పలు తయారీ సంస్థలు గరిష్ట అమ్మకపు ధర (ఎంఆర్‌పీ)ని ఎక్కువ ముద్రించి ప్రజలను దోచుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంపై ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కొన్ని మందులపై 3,000 శాతం అధికంగా వసూలు చేస్తున్నారని, దీన్ని ప్రజలు గుర్తించలేకపోతున్నారని అన్నారు. డ్రగ్‌ ప్రైజింగ్‌ కంట్రోల్‌ యాక్ట్‌లోని లొసుగులను అడ్డు పెట్టుకొని ఇష్టానుసారంగా విక్రయిస్తున్నారని విమర్శించారు.

మందుల కంపెనీల మధ్య పోటీ పెరిగి తయారీదారులు తమ మందులను పెద్దఎత్తున అమ్మాలని చూస్తున్నారని, వీరికి సాయంచేసే రిటైల్‌ వ్యాపారులు, కొందరు వైద్యులు తమ స్వార్థంకోసం కంపెనీలపై ఒత్తిడి తేవడంతో మందులపై ఎక్కువ ధరలను ముద్రిస్తున్నారని తెలిపారు. వీటిపై అవగాహనలేని ప్రజలు రోగం తగ్గించుకోవడానికి చెప్పిన ధరలను భరిస్తూ ఆస్తులను కూడా అమ్ముకుంటున్నారన్నారు. తమ పోరాట ఫలితంగా 42 రకాల కేన్సర్‌ మందుల ధరలను నియంత్రించారన్నారు. డాక్టర్‌ రెడ్డీస్‌ కంపెనీకి చెందిన పెగ్‌ఫిల్‌గ్రాస్టిమ్‌ ఇంజక్షన్‌ ధర ఇప్పటివరకు రూ.10,790 ఉండగా, త్వరలో రూ.2,650కు అందుబాటులోకి రానుందన్నారు. ఇంకా కొన్నింటి ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయని, కానీఇంకా వేలాది మందుల ధరలు తగ్గాల్సి ఉందన్నారు.   

మరిన్ని వార్తలు