చైనా తరహాలో ఫార్మాసిటీ!

27 Dec, 2014 01:07 IST|Sakshi
చైనా తరహాలో ఫార్మాసిటీ!
  • అక్కడి చెంగ్డూ సిటీ తరహాలో చేపట్టాలని నిర్ణయించిన తెలంగాణ సర్కారు
  •  అధునాతనంగా నిర్మించే దిశగా కసరత్తు
  •  ఫార్మాసిటీపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన అధికారులు
  •  భూముల సేకరణ టీఎస్‌ఐఐసీకి.. ప్రాజెక్టు రిపోర్టుల రూపకల్పన కన్సల్టెన్సీలకు అప్పగింత
  • సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలో నిర్మించతలపెట్టిన ఫార్మా సిటీని చైనాలోని చెంగ్డూ నగరం తరహాలో చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు నాలుగు వేలకు పైగా ఔషధాల తయారీ పరిశ్రమలు ఉన్న చైనాలోని ‘చెంగ్డూ బయో ఫార్మాస్యూటికల్ సిటీ’కి ఆసియా ప్రాంతంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో ఆ నగరంలో వేలాది ఫార్మసీ కంపెనీల స్థాపనకు తోడ్పడిన మౌలిక వసతులు, సదుపాయాలను అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

    అవసరమైతే అక్కడికి రాష్ట్ర అధికారుల బృందాన్ని పంపించి, పరిశీలన చేయాలని భావిస్తోంది. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివార్లలోని ముచ్చెర్ల ప్రాంతంలో 11 వేల ఎకరాల్లో ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఫార్మా కంపెనీల దిగ్గజాలతో కలిసి ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆ ప్రాంతంలో ఏరియల్ సర్వే కూడా చేశారు. అనువైన ప్రాంతాలను గుర్తించి అక్కడే అధికారులు, ఫార్మసీ కంపెనీల ప్రతినిధులతో సమీక్ష జరిపారు.

    అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఫార్మా సిటీకి అవసరమైన భూములను గుర్తించాలంటూ మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టీఎస్‌ఐఐసీ), పరిశ్రమల శాఖకు ఆదేశాలు జారీ చేసింది. మౌలిక సదుపాయాలకు సంబంధించి అంచనా వ్యయంతో సహా అవసరమైన అన్ని అంశాలతో నివేదికలు సిద్ధం చేయాలని సూచించింది కూడా.

    ఈ మేరకు భూముల సర్వే, ప్రాజెక్టు రిపోర్టు , పర్యావరణ సంబంధిత అంశాలను పరిశ్రమల విభాగం ప్రైవేటు కన్సల్టెన్సీలకు అప్పగించింది. జురాంగ్, ఐఎల్‌ఎఫ్‌ఎస్, ఎల్‌అండ్‌టీ రాంబోల్ కంపెనీలకు ఈ పనులు అప్పగించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ నివేదికలు అందిన అనంతరం ప్రతిపాదనలను కేంద్రానికి పంపించి ఫార్మా సిటీకి అవసరమైన అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
     

మరిన్ని వార్తలు